అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల వ్యతిరేకత అంతకంతకూ ఊపందుకుంటున్నది. ముఖ్యంగా వలసదారుల విషయంలో ట్రంప్ ఫర్మానాలు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి. ఆయన ‘నా మాటే శాసనం’ అన్నట్టుగా వ్యవహరిస్తుంటే అమెరికా ప్రజలు ‘మనది రాజరికం కాదు’ అంటూ వీధుల్లోకి వస్తున్నారు. ముందుగా ‘అక్రమ’ వలసదారులపై ట్రంప్ సర్కారు దాడులు ప్రారంభించినప్పుడు సామాన్య ప్రజానీకం పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రోజుల్లో ఆయన ‘సక్రమ’ వలసదారులపైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అమెరికా పౌరులకూ రుచించడం లేదు. ఈ నెల 5న ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరిట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ‘50501’ పేరిట దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. 50 రాష్ర్టాలు, 50 ప్రదర్శనలు, 1 ఉద్యమం అన్న అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టడం విశేషం. రాజకీయ రాజధాని వాషింగ్టన్, ఆర్థిక రాజధాని న్యూయార్క్‌తో సహా పలు నగరాలు ట్రంప్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. వలసదారుల నిర్బంధాలు, బహిష్కరణలపై అమెరికా పౌరులు గళమెత్తడం ఈ ఆందోళనల ప్రత్యేకత. అమెరికా ప్రభుత్వ ప్రతీకారానికి భయపడి చాలామంది వలసదారులు మౌనంగా ఉండిపోవడం తెలిసిందే.
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నిబంధనల్లో తీసుకువస్తున్న మార్పుల వల్ల ఎక్కువగా దక్షిణాసియా సంతతివారే ప్రభావితమవుతున్నారు. ట్రంప్ పాలనలో వలసదారుల విషయంలో అనుసరించే నిర్దిష్టమైన విధి విధానాలు గాలికెగిరిపోతున్నాయి. వలసదారులకు ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే అయినప్పటికీ ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతుండటం ప్రజలను కలచివేస్తున్నది. వలసదారులను అరెస్టు చేసి రాత్రికిరాత్రే ఏదో దేశానికి పంపిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారనేది కనీసం సొంత కుటుంబాలకు సైతం తెలియని పరిస్థితి. విద్యార్థి వీసాలను రద్దు చేయడమే కాకుండా, సెవిస్ (స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లో చెల్లుబాటయ్యే విద్యార్థి హోదాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నది. ప్రస్తుతం కోర్టుల్లో దీన్ని సవాలు చేస్తూ అనేక కేసులు నమోదయ్యాయి. జన్మతః పౌరసత్వ హక్కు రద్దుపై సుప్రీం కోర్టు స్టే కూడా విధించింది.
వలసల కారణంగానే పురుడు పోసుకున్న అమెరికాలో ఇప్పుడు వలసదారులకు కడగండ్లు ఎదురుకావడం ఓ విడ్డూరమే. అయితే, ఇది ఇప్పటికిప్పుడు మొదలైన సమస్య కాదు. 1900ల ప్రారంభంలో అమెరికన్లకు, ఇతర ఆసియన్లకు చైనీస్ ప్రవేశం నిషేధించారు. రెండో ప్రపంచయుద్ధం రోజుల్లో అమెరికన్లను జపనీస్ గుండుగుత్తగా నిర్బంధ శిబిరాలకు తరలించిన చరిత్ర మరువలేం. ఇలాంటి జాతి పరమైన మినహాయింపులను మనం అమెరికా చరిత్రలో అనేక సందర్భాల్లో చూడవచ్చు. 9/11 ఉగ్రదాడి తర్వాత ముస్లిం వ్యతిరేక విధానాలు అమలుచేయడం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ‘ఏలియన్ ఎనిమీ యాక్ట్’ వంటి భ్రష్ఠు పట్టిన పాత చట్టాలకు పునరుజ్జీవం కలిగించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ప్రస్తుత ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ట్రంప్ సర్కారు వలసదారుల విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.