మూడు అరెస్టులు.. ఆరు కేసులన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది. నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని తలపోస్తున్నది. తన మాటకు ఎదురు చెప్పేవారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నది. ప్రజాకంఠక విధానాలను యథేచ్ఛగా అమలుచేస్తున్నది. ప్రశ్నిస్తున్న వాళ్లను కంట్లో పెట్టుకుంటున్నది. ‘అంతు చూస్తా’ అన్నట్టుగా బెదిరింపులకు గురిచేస్తున్నది. తనకెవరూ ఎదురుచెప్పకూడదని, ఒకవేళ చెప్తే ‘పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని తన చర్యల ద్వారా బాహాటంగానే హెచ్చరిస్తున్నది. ప్రజాస్వామ్య పరిరక్షణ ‘మా ఏడో హామీ’ అని ఊదరగొట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యస్ఫూర్తినే కాలరాస్తున్నది. అందుకు గత ఏడాది కాలంగా నా పట్ల రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరే ప్రత్యక్ష నిదర్శనం.
ఈ జూన్ 11వ తేదీన రాత్రి 9 గంటలకు నిర్మల్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణం సాక్షిగా రేవంత్ సర్కార్ న్యాయాన్ని పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని లోకానికి మరోసారి తేలిపోయింది. చివరికి న్యాయమూర్తి జోక్యం చేసుకొని, నన్ను వదిలివేయాలని ఆదేశిస్తే కానీ, పోలీసులు వదల లేదు. గత 13 నెలలుగా అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టాలని ప్రయత్నించటం, న్యాయస్థానాల జోక్యంతో నాకు స్వేచ్ఛ లభించడం తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా అనేక మంది నాయకులను, సోషల్ మీడియా యాక్టివిస్టులను రకరకాల విచారణలు, కేసుల పేరుతో వేధించటాన్ని అందరూ గమనిస్తున్నారు. పాలనలో విఫలమై, ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక రాష్ర్టాన్ని అధోగతి పాలుజేస్తున్న రేవంత్ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది.
అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేసి, జైళ్లకు పంపి ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నది. హైడ్రా బాధితులు, మూసీ కూల్చివేతల బాధితులు, లగచర్ల బాధితులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం ఇలా ఏ ప్రజా పోరాటానికి మద్దతుగా నిలబడినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కేసులతో రేవంత్ ప్రభుత్వం వేధిస్తున్నది.
2024, మే నెలలో తెలంగాణ స్టేట్ ఆర్టీసీ (టీఎస్ఆర్టీసీ) పేరును తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ)గా మార్చినప్పుడు ‘తెలంగాణ అస్తిత్వాన్ని ఎందుకు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు?’ అని ప్రశ్నించినందుకు నా మీద తొలి కేసు నమోదైంది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని నన్ను అరెస్టు చేయొద్దని చెప్పింది. 2024, సెప్టెంబర్‌లో పోలీసు బృందం ఏ కారణమూ చెప్పకుండానే నన్ను నిర్బంధించింది.
హైదరాబాద్‌లోని పలు పోలీస్స్టేషన్లు తిప్పి 12 గంటల పాటు వేధించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు ఖండించారు, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు అనేక మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పరిస్థితులను బేరీజు వేసుకున్న పోలీసులు అర్ధరాత్రి నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. ఆ నోటీస్ చూశాకే ఆదిలాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసు ఒకటి నా మీద అక్రమంగా బనాయించారని అర్థమైంది. అక్టోబర్‌లో వ్యక్తిగత పని నిమిత్తం ఫ్రాన్స్ దేశానికి వెళ్లి స్వదేశానికి తిరిగి వచ్చేప్పుడు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసేందుకు మరొక అక్రమ కేసు బనాయించి ‘లుక్ ఔట్ సర్యులర్’ జారీ చేసింది. ఆ లుక్ ఔట్ సర్యులర్‌ను సస్పెండ్ చేసి, నన్ను స్వదేశానికి రానివ్వవలసిందిగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు న్యాయస్థానం ఆ లుక్ ఔట్ సర్యులర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఉత్తర్వులను పోలీసులకు ఇవ్వడానికి సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఇంకో కొత్త కేసు పెట్టి మరోసారి అరెస్ట్ చేశారు.
నిజానికి చట్టబద్ధ పాలన మీద నమ్మకం ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇట్లా హైకోర్టు ఉత్తర్వులు అందజేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పౌరుడిని అరెస్ట్ చేయదు. కానీ, రేవంత్ పాలనలో చట్టవ్యతిరేక పనులు నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయి.
అప్పుడు కూడా నా అరెస్ట్‌ను గోప్యంగా ఉంచి, అనేక పోలీస్స్టేషన్లు తిప్పి నాంపల్లి కోర్టు లో హాజరుపరిచారు. వేరెవరి మీదనో పెట్టిన ఈ అక్రమ కేసు విషయం ‘ఇక ముందు ఏ చర్యలూ తీసుకోవద్దు’ అని అంతకు కొన్ని వారాల కిందటనే రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన పాత ఎఫ్ఐఆర్కు నా పేరును జతచేశారు. ‘ఏ చర్యలూ తీసుకోవద్దు’ అని ఉత్తర్వులున్నా, అదే ఎఫ్ఐఆర్కు మరో పేరెలా జతచేస్తారు? అని న్యాయస్థానం ప్రశ్నించి, పోలీసులు కేసు మోపటంలో ఉద్దేశాన్ని గమనించి నన్ను విడుదల చేసింది. నా మీద ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు తెలపాలని వెంటనే రాష్ట్ర డీజీపీ, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశాను. వాటికి జవాబు రాలేదు. కానీ, ప్రతిరోజూ నన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ బృందాలు తిరుగుతూనే ఉన్నాయని గమనించి న్యాయవాదులు నా మీద ఉన్న కేసుల వివరాలన్నీ తెలుపాల్సిందిగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. నాకు తెలియకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా నా మీద ఐదు కేసులున్నాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు, ఆ కేసుల్లో నన్ను అరెస్ట్ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తే మరోసారి తాతాలికంగా రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది.
మే 18వ తేదీన మా నాన్నగారి స్మారకార్థం మా కుటుంబ సభ్యులం తెచ్చిన పుస్తకాన్ని అమెరికాలోని వర్జీనియాలో ఆవిష్కరించేందుకు మా చెల్లె విశాలి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. అందులో నేను హాజరుకావొద్దని, నన్ను అమెరికా వెళ్లకుండా నిరోధించేందుకు మరొక లుక్అవుట్ సర్క్యులర్‌ను రేవంత్ సర్కార్ జారీచేసింది. నా అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి సహా ఉన్నతాధికారులకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. దీంతో గత్యంతరం లేక నేను హైకోర్టును ఆశ్రయిస్తే నెలరోజుల పాటు అమెరికా వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. కానీ, మరోసారి హైకోర్టు ఆదేశాలను రేవంత్ సర్కార్ బేఖాతరు చేసింది.
మొన్న జూన్ 10వ తేదీన అమెరికా నుంచి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించారు. నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూన్ 11 వరకూ ప్రయాణం చేసే అవకాశం హైకోర్టు ఇచ్చినా, ఆ గడువు ముగియకముందే అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని నిరూపిస్తున్నది.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచాం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎలాంటి తప్పుడు కేసులకు, తాటాకు చప్పుళ్లకు బెదరలేదు. మాకు న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూనే ఉంటాం. రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వ అరాచక పాలన మీద తెలంగాణలోని బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తాలి. జై తెలంగాణ!
-రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ,98496 96536