2026 చివరి నాటికి భారత రాజకీయ యవనికపై నుంచి వామపక్షం కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ పార్టీ చివరి కంచుకోట అయిన కేరళలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కేరళలోని అధికార సీపీఎం కేంద్రంలోని బీజేపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్న దరిమిలా.. మైనారిటీలు దూరమయ్యే ప్రమాదాన్ని వామపక్ష పార్టీ ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో కేరళలో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. గతంలో తమ కంచుకోటలైన పశ్చిమ బెంగాల్‌ను తృణమూల్ కాంగ్రెస్‌కు, త్రిపురను బీజేపీకి వామపక్ష పార్టీలు కోల్పోయిన విషయం విదితమే. ఈ తరుణంలో 2026లో జరగనున్న ఎన్నికల్లో కేరళను కూడా కోల్పోతే ఇక వామపక్ష పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినట్టే!
వామపక్షం తన క్యాడర్‌ను, ఓటుబ్యాంకును క్రమంగా కోల్పోతున్న నేపథ్యంలో బీజేపీ వైపు కేరళ సీపీఎం మొగ్గుచూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్; సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్య ప్రతీ ఐదేండ్లకొకసారి అధికార మార్పిడి జరిగే దశాబ్దాల ట్రెండ్‌ను వామపక్ష పార్టీ తిప్పికొట్టింది. వామపక్షం ఎదుట హిందూ ఏకీకరణ దిగదుడుపేనని గత ఎన్నికల్లో తేటతెల్లమైంది. కేరళలో రికార్డు స్థాయిలో వరుసగా రెండోసారి లెఫ్ట్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇది ఎంతగానో దోహదపడింది.
సాధారణంగా లెఫ్ట్, రైట్ వింగ్ పార్టీలను రాజకీయ వైరి పక్షాలుగా అందరూ భావిస్తారు. కానీ, అవి సమన్వయంతో ఎలా పని చేయవచ్చో సీపీఎం చేసి చూపించింది. సోషలిస్టు అగ్రనేతలు రామ్మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ల పంథాలోనే 1964లో ఆవిర్భవించినప్పటి నుంచి సీపీఎం నడుస్తున్నది. సీపీఎం ఎంతటి కాంగ్రెస్ వ్యతిరేకి అంటే.. ఒకానొక సందర్భంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా సంఘ్‌తో సామరస్యంగా ఉంటూ, ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలనీ చూసింది. కాగా, 1962లో చైనా దురాక్రమణ సమయంలో ఉమ్మడి సీపీఐలో అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. నాడు నెహ్రూ ప్రభుత్వానికి సీపీఐ మద్దతివ్వగా, ఆ పార్టీలోని చైనా అనుకూల వర్గం డ్రాగన్‌ను దురాక్రమణదారుగా పేర్కొనేందుకు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో రష్యా అనుకూల సీపీఐ నుంచి చైనా అనుకూల వర్గం సీపీఎం పేరిట 1964లో వేరు కుంపటి పెట్టుకున్నది. 1964 నుంచి 2004 వరకు సీపీఎం పార్టీ సంఘ్ పరివార్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. 1992లో బాబ్రీ కూల్చివేతతోపాటు, 2002లో గుజరాత్ మారణకాండలోనూ ఈ సఖ్యత వ్యక్తమైంది. 2004లో వామపక్ష ఫ్రంట్ తొలిసారి యూపీఏ కూటమికి బయటి నుం చి మద్దతివ్వగా, నాటి బీజేపీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు సీపీ ఎం చర్యను ఖండించారు. సంఘ్, సీపీఎంల మధ్య ఉన్న అవగాహన భావోద్వేగంతోపాటు సైద్ధాంతికపరమైనదని గద్గద స్వరంతో ఉద్ఘాటించారు. నెహ్రూ ‘సామ్రాజ్యవాదులు చెప్పినట్టు ఆడే తోలుబొమ్మ’ అని గ తంలో సీపీఎం విమర్శించిందని గుర్తుచేశారు. నెహ్రూను వ్యతిరేకించడం సంఘ్, సీపీఎంల మధ్య ఉన్న సారూప్యత అని ఆయన పేర్కొన్నారు.
కూటమి రాజకీయాల్లో భాగంగా ఆరెస్సెస్ చేసిన ప్రయోగం సంయుక్త విధాయక్ దళ్ (ఎస్వీడీ)తో 1967లో సీపీఎం కలిసి ఉన్నది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో 1971లో గ్రాండ్ అలయన్స్‌లో భాగమైంది. 1977లో విజయతీరాలకు చేరినప్పుడూ సీపీఎం జతకట్టింది. మళ్లీ 1989లో బీజేపీతో జట్టుకట్టింది.
1989లో వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తాను కీలకపాత్ర పోషించినట్టు సీపీఎం నాయకుడు హరికిషన్‌సింగ్ సుర్జీత్ చెప్పారు. తాను బీజేపీని వ్యక్తిగతంగా సంప్రదించలేనని, ఆ పార్టీని నేరుగా సంప్రదించాలని వీపీ సింగ్‌కు ఆయనే సలహా ఇచ్చారు. బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీలతో కూడిన వామపక్ష ఫ్రంట్ మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. 1993లో చండీగఢ్‌లో జరిగిన సమావేశంలో సుర్జీత్ పార్టీ లైన్ దాటారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించడం తమ పార్టీ విధానమని చెప్తూనే, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత బీజేపీని అతిపెద్ద శత్రువుగా భావిస్తున్నట్టు ప్రకటించడం పార్టీలో కలకలం రేపింది. సీపీఎంలో గందరగోళం నెలకొనడంతో వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామని స్పష్టం చేశారు. 2004-2008 మధ్యకాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నుంచి విడిపోవాలని ప్రకాశ్ కారత్ భావించారు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ఆ కూటమిని దివంగత సీతారామ్ ఏచూరి సమర్థించారు. ఈ నేపథ్యంలో వారిమధ్య ప్రచన్న యుద్ధమే నడిచింది. యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని పార్టీపై ఒత్తిడి చేసేందుకు భారత్-అమెరికాల మధ్య జరిగిన అణు సహకార ఒప్పందం ప్రకాశ్ కారత్కు సరైన సందర్భాన్ని అందించింది. ఆ తర్వాత ప్రకాశ్ కారత్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే విధానాన్ని అవలంబించారు (బీజేపీ నేత ఎల్కే అద్వానీని సమర్థించడమైనా సరే). కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ముసుగులో సీపీఎం ఎప్పటినుంచో సంఘ్‌ను సమర్థిస్తున్నదనే వాదనను ఈ విధానం బలపరిచింది.
కేరళలో ప్రకాశ్ కారత్ హవా నడుస్తున్నది. బీజేపీ-సీపీఎం మధ్య వారధి ఏర్పాటు చేసుకునేందుకు లెక్కలేసుకొని మరీ వామపక్షం హిందూ కార్డును ప్రయోగిస్తుండటం ఇదే సూచిస్తున్నది. ఇటీవల సీపీఎం గ్లోబల్ అయ్యప్ప సదస్సు నిర్వహించింది. శబరిమల అభివృద్ధి కోసం విస్తృత ప్రణాళికలను కేరళ సర్కారు రూపొందించింది. 2020లో ప్రతిపాదించిన శబరిమల నీలక్కల్ బేస్ క్యాంప్ లేఅవుట్ ప్లాన్‌కు ఆమోదముద్ర వేయడం ఇందులో ఒకటి. సన్నిధానం, పంబా వద్ద ట్రెక్ రూట్ల కోసం లేఅవుట్ ప్లాన్లను 2025 జనవరిలో పినరాయి విజయన్ ప్రభుత్వం ఆమోదించింది. కరోనా మహమ్మారి సమయంలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు దేవస్థానం బోర్డు ఇబ్బందులు పడుతున్నప్పుడు పినరాయి విజయన్ ప్రభుత్వం రూ.140 కోట్లు ఆర్థిక సాయం చేసింది. అంతేకాదు, పలు పునరుద్ధరణ పనుల కోసం రూ.123 కోట్లను కూడా అందించింది.
సీపీఎం మొదటినుంచీ ఒకే విధానాన్ని అనుసరిస్తుండగా, సీపీఐ మాత్రం సందర్భాన్ని బట్టి సొంత మార్గాన్ని ఎంచుకున్నది. 1969లో కాంగ్రెస్ విభజన తర్వాత డీఎంకేతో కలిసి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సీపీఐ మద్దతిచ్చింది. 1971 ఆగస్టు 9న భారత్-సోవియట్ యూనియన్ మధ్య ‘శాంతి, స్నేహం, సహకార ఒప్పందం’ జరిగాక శ్రీపాద్ అమృత్ డాంగే నేతృత్వంలో సీపీఐ ఎమర్జెన్సీ సమయంలోనూ ఇందిర సర్కారుకు మద్దతు కొనసాగించింది. అయితే, కాంగ్రెస్‌ను గుడ్డిగా వ్యతిరేకించే క్రమంలో సీపీఎం తన లౌకికవాదాన్ని కోల్పోయింది.
– వెంకట్ పర్సా