మహామహులు ఒక్క మాట అన్నారంటే ఆ మాటలో ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష వరహాల విలువ ఉంటుంది. ‘అక్షర లక్షలు’ అంటారే, అలాగ! ఈ మధ్య చంద్రబాబు గారు అటువంటి మాటలు చాలా అంటున్నారు. అంటే ఇదివరకు కూడా అన్నారనుకోండి. 2004లో అధికారం కోల్పయినా 2014 దాకా అటువంటి మాటలన్నీ వారు తమ ముఖ్యమంత్రిత్వం కింద జరిగిన గొప్ప గొప్ప పనుల గురించి ఉండేవి.
Chandrababu | 2014లో చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక, కొన్నాళ్లు దూరవిద్య లాగ దూర పరిపాలన చేశారు. హైదరాబాద్‌లో ఎక్కువకాలం ఉంటూ లక్షల్లో ఆంధ్రప్రదేశ్‌లో అద్దె ఇళ్లల్లో ఉండి డబ్బులు ఖర్చు పెట్టినా, పదేండ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా, అకస్మాత్తుగా అమరావతికి మారిపోయారు. కారణం చెప్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుందని చెప్పటం లేదు. క్షమించండి! అమరావతికి మకాం మార్చాక ఇక అమరావతి రాజధానిగా ఎలా వెలిగిపోతుందో, పోలవరం వారం వారం ఎంత అభివృద్ధి చెందేస్తోందో చెప్పటం తోటి ముఖ్యమంత్రి గారి కాలవ్యవధి అయిపోయింది. డైరెక్టర్ రాజమౌళి కూడా రాజధాని రూపకల్పనలో తోడ్పడినా, చివరికి చంద్రబాబు గారు పీఠం దిగేటప్పటికీ ఆ రాజధాని అవతార్ సినిమాలాగా ఊహల్లోనే ఉండిపోయింది. ఇంద్రుడి నగరం నుంచి కిందకి దిగలేదు! ఇప్పుడు బళ్లు మళ్లీ ఓడలయ్యాయి. మరి ప్రయాణం ఎలా ఉండబోతోంది. మొన్న శ్రీ నారా వారు అన్న మాట విన్నాక ‘ఆహా’ అనిపించింది. ఏమన్నారు?
‘ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసేసి, తెలంగాణ రాష్ర్టానికి వచ్చి, ఈ రాష్ర్టానికి పూర్వవైభవం తెస్తాను’, అని చంద్రబాబు అన్నారు. అది వినగానే 1995 నుంచీ 2014 దాకా మన తెలంగాణ ఎలా ఉండిందో ఠక్కున గుర్తుకువచ్చింది. పూర్వ వైభవం అంటే ట్యాంక్‌బండ్ మీద ఉన్న 33 విగ్రహాల్లో, 30 ఆంధ్రా వాళ్లవి, 3 తెలంగాణ వాళ్లవి. కావాలా అలాంటి వైభవం? నిజానికి చంద్రబాబు గారు మొదటి టర్మ్‌లో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. 1994 డిశంబరులో రాష్ట్ర శాసనసభా ఎన్నికలలో నందమూరి తారకరామారావు గారు పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే పాపం వారికి ఏ శాపం ఉందో కానీ, మొట్టమొదటి సారి 1983లో ఎన్నికై ముఖ్యమంత్రి అయిన రామారావు గారికి వారి సహచరుడు నాదెండ్ల భాస్కర్‌రావే వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేశాడు. అయితే హీరో కదా మళ్లీ శత్రువులని జయించి సీఎం అయ్యాడు ఆయ న. అయితే 1994లో రెండవసారి వెన్నుపోటు మాత్రం కాస్త బలంగా దిగి, పీఠం దిగిపోవలసి వచ్చింది. ఆరుగురు కొడుకులున్నా, అల్లుడిదే పైచేయి అయి, నారా వారికి కాలం కలిసివచ్చి, ఏడాది తిరగకుండానే ముఖ్యమంత్రి మారాడు. ఇక 1995-1999 దాకా, తర్వాత బీజేపీ సహాయంతో మళ్లీ 1999-2004 దాకా అప్రతిహతంగా ఉమ్మడి ఏపీకి సీఎంగా వెలిగాడు బాబు. మొదట్లో కొన్ని నెలల ఇబ్బంది పడ్డా, జనవరి 1996లో ఎన్టీఆర్ మర ణం తర్వాత రంధి లేకుండాపోయింది చంద్రబాబుకు, దిక్కులేకుండా పోయింది తెలంగాణకి! మళ్లీ ఆ నారా యుగం ఎలా ఉండిందో చూద్దాం.
మొట్టమొదటగా ఆంధ్రుల పొలాలకు అవసరమైన నీళ్లు నిరాఘాటంగా పారిపోయి తెలంగాణను ఎడారి చేశాయి. ఊళ్లల్లో పనులు లేక తెలంగాణ పల్లెల నుంచి రైతుల్లో చాలా భాగం హైదరాబాద్‌కు వచ్చి కూలీలుగా, పరిశ్రమల్లో వర్కర్స్‌గా రైతురాజులు లేబర్లయిపోయారు. ఇక స్కూళ్లల్లో పంతుళ్లను నియమించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చాలాభాగం మూతపడ్డాయి. పైగా విద్యారంగంలో నిధులు 80 శాతం ఆంధ్ర జిల్లాలకు, 20 శాతం తెలంగాణకు వస్తే మరి పంతుళ్లెక్కడ నుంచి వస్తారు? పంతుళ్లు లేరని పిల్లలు మానేసి, సరైన సంఖ్య లేదని స్కూళ్లు మూతపడి, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులతో హైదరాబాద్‌లో చిన్న కూలీలైపోయారు.
ఇక కొద్దిగా ఉద్యోగస్థులు, పైసలున్నవాళ్ల పిల్లలను ఉద్ధరించటానికి ఆంధ్ర విద్యావేత్తలు చంద్రబాబు గారి ప్రాపకంలో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడి, ఇబ్బడిముబ్బడిగా తమ సంస్థలను పెంచేశారు. దూరదృష్టి ఉన్న రామారావు గారే ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ వగైరా కోర్సులకు ఎంసెట్ పరీక్షను కలిపి గుంటూరు, తెనాలి, విజయవాడ నుంచి వారి కోచింగ్ మాస్టర్స్‌ను హైదరాబాద్ రప్పించారు. ఇక బాబు హయాంలో వారి సంస్థలు, సంపదలు బ్రహ్మాండంగా పెరిగాయి. మా స్కూలు రోజుల్లో మొద్దు పిల్లలు ట్యూషన్లకు వెళ్లేవాళ్లు. మాకు కనపడకుండా మొహాలు కప్పుకొని పరిగెత్తేవాళ్లు. కానీ, ఆంధ్రా సంస్కృతి ఇక్కడ నిండాక ట్యూషన్లకు వెళ్లనివాళ్లు అంటరాని వాళ్లయ్యారు. 10, 12 గంటలు తమ దగ్గరే విద్యార్థులను పెట్టుకొని, వారికి సామాజిక జీవితం, లోకజ్ఞానం లేకుండా చేసేవాళ్లు విద్యావేత్తలయ్యారు. ఇంగ్లీషులో 95 శాతం మార్కులు, ఇంగ్లీషు ముక్క మాట్లాడటం చాతకాదు! అదీ ఆంధ్ర విద్య అంటే! నిజాంల కాలంలో ఉర్దూ మీడియం వారికి కూడా ఇంగ్లీషు చక్కగానే నేర్పేవారు. ఆ కాలంలో ఇక్కడ డాక్టర్లయిన వాళ్ల దగ్గరికి ఇతర దేశాల వాళ్లు వైద్యానికి వచ్చేవాళ్లు.
ఇక తెలంగాణ యువతకు ఉద్యోగాలు లేక, వేరే దారి లేక అల్లాడారు బాబు కాలంలో. జిల్లాకు 300 మంది యువకులకు తక్కువ కాకుండా నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్లకు బలయ్యారు. రైతులకు, ఇక్కడి యువతకు పనిపాటలు లేవు. అయితే, బాబు గారి కాలంలో మేలేం జరగలేదా అంటే జరిగింది. కానీ ఎవరికి అన్నది లెక్కలు తీస్తే తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉమ్మడి రాష్ట్రమైనప్పుడు ఒప్పుకున్న శాతం ఉద్యోగాలు రాలేదు, నదీజలాలు దక్కలేదు. నిజాం వదిలిన 3 లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాటిల్లో సగంపైగా కబ్జాలోకి వెళ్లిపోయాయి. ఇంత జరిగినా తెలంగాణను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే శక్తులు, పదేండ్ల తర్వాత కూడా కుబుసం విడిచి మీదకి వచ్చి బుస కొడుతున్నాయి.
తెలంగాణ ప్రజలు మేలుకొని, తమపై కుట్ర లు పన్నుతున్న స్థానిక, స్థానికేతర నాయకులను రాజకీయాల్లోంచి వెళ్లగొట్టకపోతే మళ్లీ 60 ఏండ్ల ఉద్యమం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త!
~కనకదుర్గ దంటు – 8977243484