అతడు అసమాన వీర యోధుడు.
ఇతడూ సరిసాటిలేని విలుకారుడే!
అతడు సత్యపథాన్ని తప్పనివాడు.
ఇతడూ అకుంఠిత సత్యవ్రతుడే!
అతడు పితృవాక్య పరిపాలకుడు.
ఇతడూ తండ్రి కోసం మాట ఇచ్చి తప్పనివాడే!
అతడు కుటుంబ గౌరవానికి నిబద్ధుడు.
ఇతడూ కుటుంబానికి కట్టుబడినవాడే!
అతడిదీ, ఇతడిదీ ఒకటే మాట, ఒకటే బాట!
కానీ… అతడు దేవుడయ్యాడు.
ఇతడు కాలేకపోయాడు!
ఎందుకు? కారణమేమిటి?
నా జర్నలిజం గురువు ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో మొన్న అర్ధరాత్రి జరిపిన సుదీర్ఘ సంభాషణలో జరిగిన చర్చ ఇది! ఎందుకంటే అన్ని లక్షణాల్లో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోనప్పటికీ, ఒకానొక సంక్లిష్ట సందర్భంలో, మనం ఎటువైపు అనే సంవాద నాదంలో… తన మాట- తాను ఆచరించాల్సిన ధర్మం వేరు కాకుండా చూసుకున్నాడు అతడు! భావోద్వేగాల్లో పడకుండా, ధర్మానికి కట్టుబడ్డాడు. ధర్మం వైపే నిలిచాడు. ధర్మాన్నే ఆచరించాడు… దానివల్ల జరిగే కష్టనష్టాలన్నీ తెలిసి కూడా!
ఇక ఇతడు ఇచ్చిన మాటకు- పాటించాల్సిన ధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణలో చిక్కుకొని, భావోద్వేగాల్లో సతమతమై, భవబంధాల లెక్కలే ముఖ్యమని ఎంచుకుని, తలవంచుకుని, జరుగుతున్న తప్పులను చూస్తూ సహించాడు… దానివల్ల కలిగే పర్యవసానాలన్నీ తెలిసి కూడా!
అందుకే అతడు.. రాముడు దేవుడయ్యాడు.
ఇతడు.. భీష్ముడు దేవుడు కాలేకపోయాడు!
ఒకరిది కృత యుగం. మరొకరిది ద్వాపరయుగం. యుగమేదైతేనేం.. జగమదే! సందర్భాలు చాలాసార్లు సమరభరితంగానే ఉంటాయి. అప్పుడు మనం ఏ పక్షం వహిస్తామన్నదాన్ని బట్టే, మనకు సిద్ధించే ఫలితం ఆధారపడి ఉంటుంది. సమర సన్నివేశాల్లో స్పష్టతే తొలి విజయం! తెలంగాణ ఇప్పుడు అలాంటి సమరాంగణంలోనే నిలబడి ఉంది. కళ్లెదుట కనిపించే నిజాన్ని కూడా అబద్ధమని చెప్పే మాయగాళ్లు, మేకను కుక్కగా పదేపదే చెప్పి నమ్మించే పంచతాంత్రికులు ఎప్పుడూ ఉంటారు. కానీ అది కట్టుకథ, కనికట్టు అని తెలుసుకోగలగాలి. మేకను మేక అని గుర్తించడం ద్వారానే మనం గొర్రెలం కాదని ఎదుటివారికి చెప్పగలం.
తెలంగాణలో ఇప్పుడు గాయిగత్తర కనిపిస్తున్నది. గడబిడ, లొడలొడ లడాయి వినిపిస్తున్నది. ఏం కొంపలు మునిగాయని ఈ లొల్లి? తెచ్చుకున్న రాష్ట్రం పోయిందా? ఇచ్చుకున్న సంక్షేమం తగ్గిందా? పర్చుకున్న ప్రగతి ఆగిందా? మెచ్చుకున్న ప్రపంచం తిడుతున్నదా? మరేమైంది? ఏం లేదు.. మూడేండ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అందుకే అందని ద్రాక్ష కోసం అవివేక ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఉద్యమం వంద శాతం సక్సెస్, తెలంగాణ రావడం వందశాతం సక్సెస్, 24 గంటల కరెంటు వందశాతం సక్సెస్, కాళేశ్వరం వంద శాతం సక్సెస్, మిషన్ కాకతీయ వందశాతం సక్సెస్, మిషన్ భగీరథ వందశాతం సక్సెస్, రైతుబంధు వంద శాతం సక్సెస్, రైతు బీమా వందశాతం సక్సెస్, వ్యవసాయ స్థిరీకరణ వంద శాతం సక్సెస్, కోటి ఎకరాల మాగాణం వందశాతం సక్సెస్, ఆత్మహత్యలు తగ్గడం వందశాతం సక్సెస్, అనేకరకాల పింఛన్లు వందశాతం సక్సెస్, ఇంటింటికీ మంచినీళ్లు వందశాతం సక్సెస్, గురుకులాల ఏర్పాటు వందశాతం సక్సెస్, పాలమూరు పచ్చబడడం వందశాతం సక్సెస్, వలసబోయినవారు వాపస్ రావడం వందశాతం సక్సెస్, నల్లగొండ నుంచి ఫ్లోరైడ్‌ను తరిమేయడం వందశాతం సక్సెస్, జిల్లాలు- మండలాల ఏర్పాటు వంద శాతం సక్సెస్, భూముల ధరలు పెరగడం వందశాతం సక్సెస్, లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు- లక్షలాది ప్రైవేటు ఉద్యోగాల కల్పన వందశాతం సక్సెస్, హైదరాబాద్ అభివృద్ధి వందశాతం సక్సెస్, జోనల్ వ్యవస్థ వంద శాతం సక్సెస్, తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు వందశాతం సక్సెస్, పారిశ్రామిక విధానం వందశాతం సక్సెస్.. ఎన్నని చెప్పగలం? ఇవన్నీ నిజం కావా?
జరిగినవి అనేకం కండ్లముందుంటే, జరగని ఒకటో అరో చూపించి, అదొక్కటి ఎందుకు చేయలేదని గాయిగాయి. ఇదే కాంగ్రెస్ ఇదే ప్రాంతాన్ని అనేక దశాబ్దాలు పరిపాలించింది. ఇప్పుడో తప్పుబడుతున్నవారు అప్పుడే ఈ పనులన్నీ చేసి మెప్పెందుకు పొందలేదు? అప్పుడు స్వరాష్ట్ర నినాదమే తలెత్తేది కాదు. బీజేపీ ఏడేండ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నది. అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది. మరి అక్కడ వీటిలో ఒకటి రెండైనా ఎందుకు చేయడం లేదు? ఫార్మర్స్ హౌజ్‌ని నిందార్థంలో చూపిస్తున్న పార్టీల అగ్రనేతలకు ఫామ్హౌజ్లే లేవనుకుందాం! మరి వారెందుకు ఇవన్నీ చేయడం లేదు? ఏం వ్యాపారం చేసి తాము వందల కోట్లు సంపాదించారో చెప్పలేని విపక్షనేతలు, ఎదుటివారి వ్యవసాయమూ అవినీతేనని, హిట్ అండ్ రన్ పద్ధతిలో, రోజుకో బురదజల్లుడు ఆరోపణ చేస్తుంటే మనమంతా చెవులప్పగించి వినాలా? కళ్లప్పగించి చూడాలా? ఎక్కడా ఏమీ చేయనివారు, చేసినవాళ్లను వేలెత్తి చూపే కుతర్కమొకటి ఇప్పుడు మొదలైంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువన్నది సామెత కావచ్చు. కానీ అడిగేవాడి తాహతేమిటో మనం ఆలోచించాలి. ఎవరి ట్రాక్ రికార్డు ఏమిటో చూడాలి కదా! లొల్లి లొల్లి చేస్తున్న ఆ నలుగురు తెలంగాణ సాధన కోసం చేసిన కృషి ఏమిటి?
‘విఠలా, నువ్వు మంచోడివిరా.. అంటే ముడ్డిబట్ట విప్పిచ్చే రకం మనం’ అని మా తాత వెంకటకిష్టయ్య చెప్పేవాడు! నిజమేనేమో.
మాటలకు పొంగిపోయి మనం డబ్భు ఏండ్ల కిందట సిరుల మూటను పోగొట్టుకున్నం. భాష పేరు చెప్పంగనే ఆశపడ్డం,గోస పడ్డం. రాష్ర్టాన్ని కాదు; ఏకంగా మన దేశాన్ని, హైదరాబాద్ స్టేట్‌ను కోల్పోయినం. ఎందుకు భాషా ప్రయుక్త రాష్ర్టాలు దేశమంతా, అన్ని భాషలకూ ఏర్పడలేదు? ఇప్పుడున్న రాష్ర్టాల్లో ఒక్క భాష మాత్రమే మాట్లాడుతున్నరా? మన హైదరాబాద్ స్టేట్ అంతా, అప్పుడున్నది ఉన్నట్టు రాష్ట్రమయ్యుంటే ఇవాళ మనం ఎంత పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్లం? దాదాపు 30 లోక్‌సభ సీట్లతో ఎవరినైనా శాసించగలిగేవాళ్లం కదా! చిన్న రాష్ర్టాలే మంచివన్న అంబేద్కర్‌ను నమ్మాల్నా? విలీనం చేయాలన్న ఆంధ్రా నేతలను నమ్మాల్నా? అని తేల్చుకోవడంలో మన తడబాటు, మనం వేసిన తప్పటడుగే మన పాపం. తరతరాల శాపం. అలాంటి తప్పు మళ్లీ చేస్తమా?
ఇప్పుడు జరుగుతున్న క్రీడను ఒక్క వాక్యంలో చెప్పవచ్చు. తెలంగాణ కోసం అధికారం ఒకవైపు.అధికారం కోసం రాజకీయం మరోవైపు. ఎవరు ఎటున్నారో, మనం ఎటుండాలో మనమే తేల్చుకోవాలి. వ్యక్తిని అల్లుకొని వ్యవస్థలు వెలుస్తాయి. వ్యక్తిని దెబ్బకొడితే వ్యవస్థను చిన్నాభిన్నం చేయవచ్చన్న ఎత్తుగడ. అందుకే వ్యక్తి కేంద్రంగా ఈ దాడి.
మా తాత చెప్పిన విషయాన్నే ఢిల్లీ సెఫాలజిస్టులు కాస్త సోఫిస్టికేటెడ్‌గా ‘తెలంగాణ ఓటరు దేశంలోనే అత్యంత ఎమోషనల్ ఓటరు. అతన్ని బుట్టలో వేసుకోవడం తేలిక’ అంటున్నారు. ఆ మేరకే సాఫ్ట్వేర్ సిద్ధమవుతున్నది. ఇక మన అరచేతిలోని అద్దంలో అనుక్షణం ఒక అబద్ధం. ఇప్పుడు మెజీషియన్ ది గ్రేట్ పీసీ సర్కార్ కాదు; ఢిల్లీ సర్కార్! మన చేతికొక మెరిసే స్మార్ట్ ఫోనివ్వాలి. మన మెదడును మొద్దుబార్చాలి. అంపశయ్యపైకి చేర్చిన బీఎస్ఎన్ఎల్ను అర్జంటుగా చంపేసి, అగ్వల మన ఫోన్లోకి జియో డేటాను జొప్పించాలి. ఆధార్ డేటాతో అంజనం వేయాలి. అదిలించి సోషల్‌మీడియా సంస్థల్ని అదుపులో పెట్టుకోవాలి. అవాస్తవాల ఫ్యాక్టరీలో ఆల్ కలర్ వీడియో తీయించాలి. వాట్సాప్‌లో వదలాలి. ఇన్‌స్టాలో విసరాలి. ఆన్లైన్లో పెట్టాలి. ఫేస్బుక్లో నెట్టాలి. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లల మెదళ్లలో ఓ బీజం నాటి ఉంచాలి. ఇదీ ఎజెండా! చూసేది మన కళ్లే. కానీ అభివృద్ధిని కాదు, అబద్ధాల తెరను. మన మనసు ఆలోచిస్తుంది. కానీ ఆ ఆలోచన మనది కాదు. మన చైతన్యం మొద్దుబారి, సాఫ్ట్వేర్ పైత్యంలో గిరిగీసుకు కూర్చుంటుంది. ఇదేంది ఇట్లా జరుగుతుందని మనం మథనపడి, బయటకువచ్చే ప్రయత్నం చేసేలోపే, తెరమీద మరో అబద్ధం ఆవిష్కృతమై, అటువైపు గుంజుతుంది. మన ఆలోచన తప్పని మనకే చెప్తుంది. అరుగుమీద కూర్చుని మాట్లాడుకోవడానికి అవసరమైనదానికన్నా ఎక్కువ సరంజామాను అది అందిస్తుంది.
అదొక అసత్యాల సముద్రం. లోపలికి వెళ్లామా, దారితెన్నూ తోచక అందులోనే కొట్టుకుంటాం తప్ప బయటకురాలేం. చర్చ అభివృద్ధిపై ఉండదు. తామే ముద్దెర వేసిన అలవాట్లపై ఉంటుంది. చర్చ జరిగినదానిపై ఉండదు. జరగబోయేది జరగదని ఉంటుంది. చర్చ ప్రజలకు కలిగిన సౌకర్యాలపై ఉండదు. నాయకుడి నివాసంపై ఉంటుంది. చర్చ దేశంపై కాదు; దేహాలపై నడుస్తుంది!
ఒక అబద్ధం వెయ్యిసార్లు చెబితే నిజమనిపిస్తుందనేలా, ఒక చిన్న ఘటన టీవీ తెరపై, ఫోన్ స్క్రీన్‌పై, చిట్టి మనసుపై వేలు, లక్షల సార్లు మల్టీ ైప్లె అయి, అసలు విషయం కన్నా కొసరే ఎక్కువై అసలుకు ఎసరు తెస్తుంది. మిషన్ కాకతీయ తీసుకున్నా, కాళేశ్వరం తీసుకున్నా, భగీరథ తీసుకున్నా, ధరణిని తీసుకున్నా, ఇప్పటికిప్పుడు జోనల్ బదిలీలు తీసుకున్నా అదే కథ. మనం ఫార్వార్డ్ చేస్తున్నామనుకుంటం. కానీ బ్యాక్వార్డ్కు వెళ్తున్నామని గుర్తించం. మనం షేర్ చేస్తున్నామనుకుంటం. కానీ బేకార్ అవుతున్నామని గమనించం. ఇదొక పన్నాగం. మన భావోద్వేగాలను మనపైకే రెచ్చగొట్టి మనతోనే ఆడుకునే ఆధునిక సాంకేతిక రాజకీయ విన్యాసం. మీకు తెలియకుండానే మీ మనసును తమ గుప్పిట్లోకి తీసుకునే వశీకరణ విద్య. అదొక వందల కోట్లతో తయారుచేసే మరుగు మందు. దానిపేరు సోషల్ మీడియా. అందుకే నేను 2019 ఆగస్టు 29నే.. ఉద్వేగమే రాజకీయం అని హెచ్చరించాను. ఇప్పుడదే జరుగుతున్నది.
దశాబ్దాల దాస్యం తర్వాత లభించిన స్వాతంత్య్రమిది. ఏండ్ల తరబడి చెరలో మగ్గిన తెలంగాణ తల్లి ఏడేండ్ల కిందటే విముక్తమైంది. ప్రామాణిక భాష కింద నలిగిన మన యాస ప్రమాణ పూర్తిగా ఇప్పుడిప్పుడే సజీవంగ ధ్వనిస్తున్నది. ఆధిపత్యపు అవహేళనలకు జంకి దాచుకొని ఆడుకున్న మన ఆటపాటలు, ఇప్పుడిప్పుడే పురవీధుల్లో పురివిప్పుతున్నయి.
మన బతుకమ్మ దుబాయ్ బురుజెక్కినా,ఆస్ట్రేలియాలో మన బోనమెత్తినా, ఆఫ్రికాలో అలయ్‌బలయ్ జరిగినా, అమెరికాలో దసరా ఊగినా, దీపావళి మోగినా.. అది ఈ తెలంగాణ నేల ప్రతిధ్వని మాత్రమే! ప్రతిబింబం మాత్రమే! మన భాష, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనమిప్పుడు సగంలో ఉన్నది. ఈ సమయంలో తెలంగాణను మరోసారి అన్యాక్రాంతం చేసే కుట్ర జరుగుతున్నది.
మోసమెప్పుడూ అందంగానే కనిపిస్తుంది. అప్పుడు తెలుగు భక్తి, ఇప్పుడు మత భక్తి. అప్పుడు రాష్ట్ర భక్తి. ఇప్పుడు దేశ భక్తి. అప్పుడూ ఇప్పుడూ శత్రువొక్కడే. తెలంగాణ భావజాలాన్ని, అభివృద్ధిని వ్యతిరేకించేవాడు. ఎప్పుడూ ఘోరీలే ఉండరు. వారిని గెలిపిస్తామనే జయచంద్రులూ పనిచేస్తుంటారు. ముందు నటిస్తున్నది ఎవడో, తోలుబొమ్మలాట ఆడిస్తున్నది ఎవడో మనం గుర్తించాలి.
రాముడు సత్య సంధుడు. అసత్యాలు చెప్పమన్లేదు. రాముడు ఎవరినీ ద్వేషించలేదు. చివరికి రావణుడిని కూడా గౌరవించాడు. రాముడు కుటుంబ విలువలను గౌరవించాడు. రాముడు మర్యాదా పురుషోత్తముడు. అసభ్యమైన భాష వాడలేదు. రాముడు సింహాసనాన్ని త్యాగం చేశాడే తప్ప, అధికారం కోసం వక్రమార్గం తొక్కలేదు. రాముడి మార్గంలో నడవడం రామభక్తి తప్ప, రామనామాన్ని జపించడం కాదు.నూతన సంవత్సర శుభాకాంక్షలతో…
రాముడు ధర్మాన్ని ప్రవచించలేదు, ఆచరించాడు. అది రామరాజ్యం. అధర్మాన్ని మౌనంగా సహిస్తూ ఉండిపోయినా,అదే ధర్మమని దబాయించినా… జరిగేది కురుక్షేత్రమే!
తిగుళ్ల కృష్ణమూర్తి
kruthi1972@gmail.com