మిన్ను విరిగి మీద పడ్డట్టు హైడ్రా డైనోజార్లు అమాయక పేద ప్రజల ఇళ్లపై విరుచుకపడ్డాయి. సినిమాల్లో గ్రాఫిక్‌లను తలదన్నేలా పేద మధ్యతరగతి గుడిసెలు, పాకలు, ఇండ్లు కండ్ల ముందే నేలమట్టమయ్యాయి. బుచ్చమ్మ బుగులుతో ఉరి వేసుకుని భూమిలో కలిసిపోయింది. గుండె చెదిరి, గూడు చెదిరి వీధుల పాలైన కష్టజీవుల కన్నీటి సన్నివేశాలకు, ఎప్పుడు ఏ ఇంటి మీద పిడుగు పడుతుందో తెలియని భీతావహ వాతావరణానికి మూగ సాక్షిగా నిలిచింది మన మహా నగరం హైదరాబాద్. కాదు కాదు, ‘హైడ్రా’ బాద్. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బాధితులు తెలంగాణ భవన్ బాట పట్టడం, వారి తరఫున బీఆర్ఎస్ ఉద్యమాన్ని చేపట్టడం, సమాజం యావత్తు ఇది అన్యాయమని ఎలుగెత్తడంతో ప్రభుత్వం నాలుక కరుచుకున్నది.
మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం విసిరిన హైడ్రా పాచిక పారింది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సతమతమైన దుస్థితి నుంచి హైడ్రా పుణ్యమాని కొంత సేదతీర గలిగింది. అతివృష్టి, వరదలు, విష జ్వరాలు, పంట నష్టం, అకాల మరణాల వంటి ప్రధాన తక్షణ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంలో కొంతమేర సఫలమైంది. చెరువులు, నాలాల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అం శాల్లో ప్రభుత్వాలు చర్యలు చేపడితే అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలోపం, యంత్రాంగం అలసత్వం, అవినీతి అధికారుల ధనాపేక్ష వల్ల ఏర్పడిన ఈ సమస్య సామాన్య ప్రజల పాలిట శాపంగా మారకూడదు. స్థలం రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులు, ఇంటి నెంబర్లు, ఆస్తి పన్ను, కరెంటు, మంచినీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, చెత్త సేకరణ ఇవన్నీ ప్రభుత్వ విభాగాలే సమకూర్చి నిర్వహిస్తున్న క్రమంలో ఆ ఇండ్లల్లో నివాసం ఉంటున్న ప్రజలను రాత్రికిరాత్రి ఆక్రమణలంటూ వీధుల పాలు చేయ డం అభ్యంతరకరం, అమానుషం. నిర్వాసితులు, బాధితులు ప్రశ్నిస్తున్నది అదే. పైగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. తక్షణమే పరిష్కారమయ్యే సమస్య కాదు. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేపట్టి, బాధితులకు తగినంత సమయం ఇచ్చి ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించి, విడతల వారీగా హైడ్రా కార్యక్రమం కొనసాగితే బాగుండేది. కానీ, అలా జరగలేదు.
ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో సంపన్నులు రాజ భవనాలు, ఉద్యాన, విలాస మందిరాలను నిర్మించుకున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూములనే ప్లాట్లు చేసి, ఇండ్లు కట్టి అమాయకులైన పేద మధ్యతరగతి ప్రజలకు అంటగట్టారు. దీంతో ఆ ప్రజలు దారుణంగా మోసపోయారు. దీనికి ముగిం పు పలకాలనుకున్న ప్రభుత్వం ముందుగా తన ప్రతాపాన్ని పెద్ద తలకాయల మీద చూపెడితే సబబుగా ఉ ండేది. కూల్చివేతల వల్ల వారికి పెద్దగా నష్టం కూడా జరిగేది కాదు. పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అలా కాదు. వారికి అది జీవన్మరణ సమస్య. ప్రభు త్వం ఈ వాస్తవాన్ని విస్మరించి సామాన్య ప్రజల ఆవాసాలను వరుసగా సెలవు రోజుల్లో సైతం రాత్రిపగలు తేడా లేకుండా గంటల్లోనే కూల్చివేత ప్రక్రియ పూర్తిచేయడం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటున్నవారు చేయదగిన పనేనా? అని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. శాపనార్థాలు పెట్టారు. మంత్రులు తమ ప్రజా దర్బారులనుహైడ్రా కూల్చివేత ప్రాంతా ల్లో ముందస్తుగా నిర్వహించారా? ప్రజల గోడు ఏమి టో కనీసం విన్నారా?వారిని ప్రజాభవన్‌కు రమ్మన్నారా? సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించారా? అని బాధితులు నిలదీస్తే అధికార పార్టీ నేతలు నీళ్లు నమిలారు. నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన అన్నిరకాల అనుమతులు సౌకర్యాల కేటాయింపులు ఉండి ఉంటే వాటిని అలా ఉంచి సావధానంగా నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కూలిపోయిన ఇండ్లకు బ్యాంకు కిస్తీలు కట్టే దురవస్థ దాపురించేది కాదు. మిగిలిన పేదలందరికీ డబుల్ బెడ్రూంలు కేటాయించిన తర్వాత కూల్చివేత కొనసాగిస్తే ఇంత ప్రతిఘటన వచ్చేదే కాదు.
ఇప్పుడు వారికి కేటాయిస్తున్న డబుల్ బెడ్రూములు కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టినవే. ఈ 10 నెలల్లో ప్రభుత్వం ఆ దిశగా డబుల్ బెడ్రూమ్లకు కనీసం ముగ్గు పోయలేదు. తట్టెడు మట్టి తీయలేదు. అలాంటప్పుడు ప్రభుత్వ చర్య వల్ల నిర్వాసితులయ్యే లక్షలాది మంది పేదల గోడు వినేదెవరు? వారందరికీ ఇండ్లు కేటాయించేదెప్పుడు?
అంగ బలంతో, అర్థ బలంతో ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునే స్థోమత గాని, న్యాయస్థానాలను ఆశ్రయించే తాహతు కానీ సామాన్య ప్రజలకు ఉండవు కదా. ప్రజల నిస్సహాయత, దీనావస్థతో పరాచికాలాడటం ప్రభుత్వానికి క్షేమం కాదు. ఇప్పటికే కూల్చివేతలతో నష్టపోయిన కుటుంబాలకు సమంజసమైన పరిహారం కాలయాపన చేయకుండా చెల్లించడం ప్రభుత్వం కనీస బాధ్యత.
హైదరాబాద్‌కే కాదు, దేశ రాజధాని ఢిల్లీ సహా కలకత్తా, చెన్నై వంటి మహా నగరాలకు నదులు, నాలాల సమస్య ఉన్నది. ఇతరత్రా పెద్ద పెద్ద నగరాలు సర్వసాధారణంగా నదీ తీరాల్లోనే ఉన్నాయి. ఆక్రమణలు తొలగించమని ఆయా ప్రాంతాల న్యాయస్థానాలు ఆదేశించాయి. కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం లాగా లేడికి లేచిందే పరుగు అన్నట్టు వ్యవహరించలేదు. సావధానంగానే సమస్యను ఉభయతారకంగా పరిష్కరించుకుంటూ పోతున్నాయి. యూపీలో తప్ప ఏ ఇతర రాష్ర్టాల్లో బుల్డోజర్ భూతాలను ఆయా ప్రభుత్వాలు సామాన్య ప్రజల ఇండ్ల మీదికి తోలడం లేదు. నదులు, నాలాలు పొంగడానికి, నీళ్లు రోడ్ల మీదికి ఇండ్లలోకి రావడానికి, కేవలం పేదోళ్ల ఆక్రమణలు మాత్రమే కారణమని అభాండాలు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదు. అభ్యంతరకర నిర్మాణాలను కూల్చుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఉండదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న సోమాజిగూడ, బేగంపేట్, రాణిగంజ్ ప్రాంతాల స్వరూపమే మారిపోతుంది. ప్రభుత్వ భవనాల ఉనికి సైతం ప్రశ్నార్థకమవుతుంది. వీటితోపాటు నగరమంతా నరాల లాగా అల్లుకుపోయిన నాలాలను వ్యవస్థీకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. అందుకు ప్రభుత్వం వేసిన ప్రణాళికలెన్ని? కేటాయించిన నిధులు ఎన్ని?
1908లో మూసీనది ఉప్పొంగి బేగంబజార్, చార్మినార్, గౌలిగూడ, చాదర్‌ఘాట్, అంబర్పేట్, మలక్‌పేట్ సహా సగం హైదరాబాద్ మునిగిపోయినప్పుడు నాటి నిజాం ప్రభువు ఆయా ప్రాంతాల ప్రజల ఇండ్లను కూల్చివేయలేదు. దీర్ఘదృష్టితో ఆలోచించి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిర్మించాడు. మూసీనదికి ఇరువైపులా రక్షణ గోడలు కట్టించాడు. వందేండ్ల అవసరాలు తీర్చగలిగే డ్రైనేజీ, వంతెనలు నిర్మించాడు. పరిష్కారమంటే అది. సముద్ర మట్టానికి దిగువగా ఉన్న నెదర్లాండ్స్ సాంకేతిక నిర్మాణ పరిజ్ఞానంతో ముంపు సమస్యను అధిగమించింది. ఇటలీలోని వెనిస్, కేరళలోని అలెప్పీ పట్టణాలు నీళ్లలోనే నిర్మాణమయ్యాయి. ప్రభుత్వం తలచుకుంటే నిర్వాసితులకు న్యాయం చేస్తూనే మూసీ నదిని, చెరువులను, నాలాలను చక్కదిద్దడం అసాధ్యమేమీ కాదు. వాటిని రక్షించడం అంటే తత్సంబంధిత భూభాగాన్ని రక్షించడం ఒక్కటే అనుకుంటోందేమో ప్రభుత్వం. ప్రమాదకరమైన కాలుష్యం గురించి ఆలోచించడం లేదు. బహుళ అంతస్థుల భవనాలకు, బాహుబలి వ్యాపార కేంద్రాలకు అనుమతివ్వడానికి ముందే దీర్ఘకాలిక అవసరాలు తీర్చగలిగే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేస్తే ఈ దుస్థితి దాపురించదు కదా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర వైశాల్యంలో 30 శాతం రోడ్లు ఉండాలి. అందులో సగం కూడా లేవు. అందుకే ఏటా హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.
ప్రజల దైనందిన సమస్యలు పరిష్కరించకుండా, ఇచ్చిన హామీలు అమలుచేయకుండా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం సరికొత్త ఇంద్రజాల ప్రదర్శనకు తెర లేపిందన్నది స్పష్టం. జనావాసాల తొలగింపు వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలెన్ని? వారి కోసం ఎన్ని ఇండ్లు కట్టాలి? ఎంత ఖర్చవుతుంది?నిధులెట్లా? ఎప్పటిలోగా ఇండ్లు పూర్తవుతాయి వంటి అంశాలు సాకారమైన తర్వాతే, బాధితులకు నచ్చచెప్పి ఒప్పించిన తర్వాతే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించి ఉంటే ప్రజామోదం లభించేది.
బ్యాంకు రుణాలు సహా అన్నిరకాల అనుమతులున్న ఇండ్లను ముట్టుకోకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుండేది. పరిపాలనలో ప్రాధాన్యాలు చాలా ఉంటాయి. అవి ఎంత గొప్పవైనా సామాన్య ప్రజల కనీస అవసరాల తర్వాతే. ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా ఇది ఇంతటితో ఆపి పరిష్కారం కోసం సవ్య దిశగా అడుగు వేస్తే మంచిది. న్యాయస్థానాల తలంట్లు సరిపోలేదా. ఇప్పటికైనా అన్ని రాజకీయపక్షాలతో సాంకేతిక నిపుణులతో, మేధావులతో ఒక సమావేశం ఏర్పాటుచేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. సర్వజనామోదానికి అదొక్కటే మార్గం. లేదంటే ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. 1976లో ఎమర్జెన్సీ రోజుల్లో నాటి ప్రధాని గాంధీ, తనయుడు సంజయ్ గాంధీ ప్రేరేపణతో ఢిల్లీలోని తుర్కుమెన్ గేట్ ప్రాంతంలో మొగలుల కాలం నుం చి ఉంటున్న ప్రజల నివాసాలను బుల్డోజర్లు నేలమ ట్టం చేశాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ జరిగింది. ఆ సంఘటన ప్రభావం 1977 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీ సహా కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఒక కారణమైం ది. ఇప్పుడు హైదరాబాద్‌ను మరో తుర్క్మెన్ గేట్ చేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం?