హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు ఒక ట్రిగ్గర్ పాయింట్ లేదు. ఇప్పట్లో పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఐటీ పరిశ్రమల ద్వారా హైదరాబాద్‌లో హఠాత్తుగా రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చినట్టు వస్తుంది అని, అలా పెరుగుతుందని ఆశలు అసలే పెట్టుకోవద్దు. ట్రిగ్గర్ పాయింట్ లేదు కాబట్టి ఎదుగుదల పెద్దగా ఉండదు. రియల్ ఎస్టేట్ రంగంలో చాలాకాలం నుంచి ఉన్న ఒక రియల్ ఎస్టేట్‌కు చెందిన వారు చెప్పినమాట.
గతంలోనైనా, ఇప్పుడైనా అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఇద్దరు తెలుగు వారు కలుసుకున్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తప్పనిసరిగా మాట్లాడుకుంటారు. గతంలో మాట్లాడారు, ఇప్పుడూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ మాటల్లో తేడా ఉన్నది. గతంలో రియల్ ఎస్టేట్ ఎలా దూసుకువెళ్తుందో మాట్లాడుకునేవారు. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా చల్లబడిందో మాట్లాడుకుంటున్నారు.
Hyderabad | తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ అని వేరుపడినా ప్రపంచంలో ఏ మూలకున్న తెలుగువాడికైనా రియల్ ఎస్టేట్ రాజధాని హైదరాబాద్ నగరమే. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉత్తరాదికి చెందినవారు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై విశ్వాసం ఉంచి పెట్టుబడి పెట్టారు. దీనికి క్రమంగా మసకబారుతున్నది.
దేశంలోని మెట్రో నగరాలన్నిటికన్నా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎక్కువగా మందగించింది. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం.. జూలై, సెప్టెంబర్ త్రైమాసిక నివేదిక ప్రకారం కొత్త వెంచర్ల ప్రారంభంలో 54 శాతం తగ్గగా, అమ్మకాలు 42 శాతం తగ్గాయి. తగ్గుదలలో ప్రధాన మెట్రో నగరాలు అన్నిటికన్నా హైదరాబాద్‌లోనే ఎక్కువ తగ్గుదల నమోదైంది. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 2023లో 25,370 కొత్త ఇండ్ల నిర్మాణం జరిగితే, అదే ఈ సంవత్సరం 11,601 ఇండ్లు మాత్రమే. దీనికి అనేక కారణాలున్నట్టు నివేదిక చెప్తున్నది. అవసరానికి మించి సరఫరా ఉండటం, రేట్ల పెరుగుదలతో పాటు హైడ్రా హడావుడి సైతం రియల్ ఎస్టేట్ స్లంప్‌కు ప్రధాన కారణం. ఇదే కాలంలో దేశంలో ప్రధాన నగరాల్లో ఇండ్ల నిర్మాణం 11 శాతం, కొత్త వెంచర్ల ప్రారంభం 18 శాతం తగ్గినట్టు నివేదిక. దేశవ్యాప్తంగా గృహ నిర్మాణం తగ్గినా హైదరాబాద్‌లో ఈ తగ్గుదల చాలా ఎక్కువగా ఉన్నది. శాసనసభ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు హఠాత్తుగా పడిపోయాయి. అంతకుముందు హైదరాబాద్ ప్రధాన ప్రాంతాల్లో ఇంటి స్థలాల కన్నా ఎక్కువ స్పీడ్‌గా భూముల ధరలు పెరిగాయి. నగర శివారుకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఎకరం రెండు కోట్ల ధర పలికిన భూములు ఇప్పుడు కోటి రూపాయలకు కూడా కొనేవారు లేరనే మాటలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ సంస్థలన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత బ్యాంకులు లోన్లు ఇచ్చిన తర్వాత నిర్మించిన గృహాలను కూడా హైడ్రా కూల్చివేయడంతో కొనుగోలు దారుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అనవసర రిస్క్ ఎందుకని కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. చెరువుల ఆక్రమణలను తొలగించడం మంచి నిర్ణయమే. మరి ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినవారిపై చర్యలేవీ? అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని మీడియాకు లీకేజీ వార్తలు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఒక సామాన్యుడు ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అనుమతి పత్రాలు కాకుండా ఇంకెలా సొంతంగా పరిశోధన చేయాలి. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన తర్వాత కొనుగోలు చేసిన వారి ఇండ్లను కూడా హైడ్రా కూల్చేసింది. ఇక ఇళ్ల కొనుగోలుదారులు ఏ పత్రాలు చూడాలి.
తెలంగాణ ఏర్పడినప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుందనుకున్నారు కానీ, ఆరు నెలలకు మించి స్తబ్ధత లేదు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, లాభాలు పెరిగాయి. ఏడాది నుంచి ఈ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీన్ని ప్రభుత్వం గ్రహించాలి.
రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు పడిపోవడం మంచిదే కదా అనే వాదనలు కూడా వినిపిస్తాయి. హైటెక్ సిటీ భవన నిర్మాణ భూమి పూజ సమయంలో అక్కడ లక్ష రూపాయలకు ఎకరం. హైటెక్ సిటీ నిర్మాణం జరిగి ఐటీ రంగంలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తర్వాత లక్ష రూపాయలకు అరగజం స్థలం కూడా దొరకని పరిస్థితి. అక్కడ ఎకరా లక్ష పలికినప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండేవా? అరగజం లక్షకు పలికినప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండేవో చూస్తే తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా ధరలు పెరుగుతున్నప్పుడు, ధరలు పెరుగుతాయనే నమ్మకం ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీనివల్ల కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. గృహ నిర్మాణరంగం మందగించడంతో సిమెంట్, స్టీల్ పరిశ్రమలు కూడా మందగిస్తాయి. పెట్టుబడులు నిలిచిపోతున్నాయి. అమెరికాలో ఉన్న తెలుగువారు సైతం భూములు, ప్లాట్స్, ఇండ్లపై ఇన్వెస్ట్ చేస్తారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మందగించడంతో బెంగళూరుపై దృష్టిసారిస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. తెలంగాణ ఏర్పాటును కోరుకున్నవారు సైతం కొంతవరకు ఈ ప్రచారాన్ని నమ్మరు. ఐతే దీన్ని గ్రహించిన బీఆర్ఎస్ పాలకులు చాకచక్యంతో వ్యవహరించి రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు వచ్చాయి. సహజంగా తమ పెట్టుబడులకు తగిన లాభం వచ్చినప్పుడు ఆ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయి. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలానా కాలంలో అదే జరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూములపై తొలి దెబ్బపడింది. నిజానికి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేక చర్యలు చేపట్టలేదు కానీ, హఠాత్తుగా భూముల ధరలు పడిపోయాయి. భూములపై కొత్త ఇన్వెస్ట్మెంట్లు నిలిచిపోయాయి. ‘నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా?’ అని ఓ విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకోవడానికి రేవంత్‌రెడ్డి ఏదో చేస్తారని ఆశించినవారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ, ఏమీ జరగలేదు. పురోగతి మాట దేవుడెరుగు, రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనం వల్ల ఆ రంగంలోకి పెట్టుబడులు తగ్గుతాయి. అదే సమయంలో ఆ మేరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధిలో అవకాశాలు తగ్గిపోతాయి.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయింది. బాబు పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐటీ దెబ్బ తింటుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఈ ప్రచారానికి వైయస్ రాజశేఖర్‌రెడ్డి సైతం కంగారు పడ్డారు. అప్పటివరకు ఉచిత విద్యుత్తు అంటూ రైతులపైనే ఫోకస్ చేసిన వైఎస్సార్ చివరి దశలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐటీ రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రచారం చేశారు. భయపడినట్టుగా ఏమీ జరగలేదు కానీ, ఐటీ ఎగుమతులు మరింతగా పెరిగాయి. ఇక రాష్ట్ర విభజన సమయంలోనూ ఇదేవిధంగా ఐటీ రంగం వెళ్లిపోతుందని ప్రచారం చేశారు. కానీ మరింతగా ఐటీ ఎగుమతులు పదేండ్లలో పెరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ వచ్చాయి. టీడీపీ బాబు, కాంగ్రెస్ వైఎస్సార్, టీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఐటీరంగం పెరుగుతూనే పోయింది తప్ప ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతూనే పోయాయి కానీ, తగ్గలేదు. తెలంగాణ ఏర్పడినప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుందనుకున్నారు కానీ, ఆరు నెలలకు మించి స్తబ్ధత లేదు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, లాభాలు పెరిగాయి. ఏడాది నుంచి ఈ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీన్ని ప్రభుత్వం గ్రహించాలి.
ఎన్నికల ముందు రాచకొండలో కొత్త నగరాన్ని నిర్మిస్తామని పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇప్పుడు ముచ్చర్ల ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ సరసన 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ప్రకటించారు. ఔషధ నగరం కోసం గత ప్రభుత్వం సేకరించిన భూమి ఇది. ఇక్కడ కొత్త నగరం నిర్మిస్తామని సీఎం హామీ. ఉన్న నగరంలోనే రియల్ ఎస్టేట్‌ను స్తబ్ధతగా మార్చారు. కొత్త నగరం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియదు.
రాజకీయం ఎలా ఉన్నా ఉపాధి రంగాలను దెబ్బతీయవద్దు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏదో ప్రాజెక్ట్‌లు ఇస్తుందని ఆశలు పెట్టుకోవద్దు. దక్షిణాదికి ఏమైనా ఇవ్వాలనుకుంటే మిత్రపక్షం అధికారంలో ఉన్న ఆంధ్రను పట్టించుకోవచ్చు కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ మాత్రం మోదీ ప్రాధాన్యం జాబితాలో ఉండదు. మన వనరులను మనమే సమకూర్చుకోవాలి. మన ఉపాధి అవకాశాలు మనమే చూసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కనిపించడం లేదు. తెలంగాణకు రియల్ ఎస్టేట్ బంగారు బాతు గుడ్డు లాంటిది. దానిని చేతులతో చిదిమేయవద్దు.
– బుద్దా మురళి