Chandrahas | బుల్లితెర నటుడు ప్రభాస్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పాడిన ‘గుంజి గుంజి’ పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. అసలు పాట లిరిక్స్ మార్చి బూతు పదాలు జోడించి పాడటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని కూడా చుట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, జయంత్ సి. పరాంజీ, ఆది సాయి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్టేజ్ మీద చంద్రహాస్ పాట పాడిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. సాధారణంగా పాట పాడితే సమస్య లేకపోయినా, అసభ్య పదాలు జోడించడం వల్ల ఈ వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్నప్పటికీ చంద్రహాస్ వెనక్కి తగ్గలేదు.
తనపై విమర్శలు చేసిన ఓ జర్నలిస్టుకు వీడియో ద్వారా కౌంటర్ ఇస్తూ, తాను తప్పు చేయలేదని, తనను ఎప్పటినుంచో ట్రోల్ చేస్తున్నవారికి సమాధానంగా రెండు పదాలు వాడితే తప్పేంటని ప్రశ్నించాడు. జర్నలిస్టు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని హెచ్చరించడంతో ఆ జర్నలిస్టు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఇక ఈ ఘటనపై సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి స్పందిస్తూ సినిమాకు పబ్లిసిటీ కోసం బూతులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. స్టేజ్ మీద పాట విన్న వెంటనే వెళ్లిపోవాల్సిందని, కానీ సినిమా ఇమేజ్ దెబ్బతినకూడదనే ఆగానని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రహాస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ డిస్కషన్లో మాట్లాడుతూ, ఈవెంట్ సమయంలో జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టి ప్రశంసించారని, బయటకు వచ్చాక మాట మార్చడం బాధ కలిగించిందని అన్నాడు. “నేను తప్పు చేసి ఉంటే అక్కడికక్కడే చెప్పాలి గానీ, తర్వాత ఇలా మాట్లాడడం సరైంది కాదు” అంటూ వాపోయాడు.
చంద్రహాస్ మరో అడుగు ముందుకేసి, తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ముందుగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా జేడీ చక్రవర్తి వేరేలా మాట్లాడారని పేర్కొన్నాడు. “స్టేజ్ మీద ఒకలా, బయట మరోలా ఉండకూడదు. పెద్ద స్థాయిలో ఉన్నవారు స్ట్రెయిట్‌గా మాట్లాడాలి” అంటూ విమర్శించాడు. ఆయనను ఈవెంట్ కు పిలిచినందుకు నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా.. జే.డీ.చక్రవర్తి తన తండ్రికి ఫోన్ చేసి, తాను (చంద్రహాస్) ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొంచెం హార్ష్‌గా మాట్లాడతాను, ఫీల్ అవ్వొద్దు అని చెప్పమని కోరారని, ఇలా రెండు రకాలుగా ప్రవర్తించడం సరికాదని అని అన్నార. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, ఇరువైపులా అభిమానులు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వివాదంపై జేడీ చక్రవర్తి మరింతగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక ప్రీరిలీజ్ ఈవెంట్లో పాడిన పాట టాలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసింది.