హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రం-1 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి చేరుకోవడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక కీలక మలుపు. దేశంలో ప్రభుత్వ గుత్తాధిపత్యంలో కొనసాగుతున్న అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచిన ఘట్టం ఇది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో శ్రీహరికోట నుంచి ప్రయాణించిన విక్రం-1 పూర్తిగా ప్రైవేట్ సంస్థ రూపొందించి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత తొలి రాకెట్‌గా చరిత్రకెక్కింది. ఈ ప్రయోగం ద్వారా భారత్ ప్రపంచంలోని ప్రైవేట్ అంతరిక్ష రంగంలో అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీపడే స్థాయికి చేరుతున్నట్లు స్పష్టమైంది. దశాబ్దాలుగా అంతరిక్ష పరిశోధనలను పూర్తిగా ప్రభుత్వ సంస్థ ఇస్రో ఆధిపత్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన విధానపరమైన మార్పులతో ప్రైవేట్ రంగం ప్రవేశానికి వీలు కలిగింది. విక్రం-1తో దీనికి శుభారంభం జరిగింది.ఈ ప్రయోగం ద్వారా గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మనదేశం కీలక పాత్ర పోషించే రోజులు ఎంతో దూరంలో లేవు.
స్కైరూట్ విజయం ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి గర్వకారణం అని చెప్పాలి. ఇప్పటివరకు ఐటీ రంగంలో తన సత్తా చాటుకున్న భాగ్యనగరం, ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలోనూ విజయబావుటా ఎగరేసింది. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ హయాంలో, అప్పటి మంత్రి కేటీఆర్ ఆధ్యర్యంలో ఏర్పాటైన స్టార్టప్ హబ్‌లో స్కైరూట్ సంస్థ పురుడుపోసుకున్నది. దీని స్ఫూర్తితో మరెన్నో సంస్థలు రావడంతో తెలంగాణ ‘స్పేస్ హబ్’గా ఎదగడం సరికొత్త రాష్ర్టానికి గర్వకారణం. అబ్బురపరిచే ప్రతిభను ప్రదర్శించిన స్కైరూట్ యువ ఇంజినీర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విజయాన్ని రాష్ట్రంలోని యువత స్ఫూర్తిగా మలచుకోవాలి. అయితే ఇది ఆరంభం మాత్రమే. ప్రైవేట్ రంగం అంతరిక్ష పరిశోధనలో వేళ్లూనుకోవాలంటే ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే స్థిరమైన పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి, ప్రభుత్వ సహకారం ఈ మూడూ కీలక పాత్ర పోషిస్తాయి. దీక్షాదక్షతలతో కృషి చేస్తే విజయం వరించి తీరుతుందని స్కైరూట్ వ్యవస్థాపకుల కథ చెప్తున్నది.
అయితే నాణేనికి మరోవైపున అన్నట్టు ఈ ప్రైవేట్ విజయగాథను వెన్నంటే ప్రభుత్వరంగ సంస్థ సంక్షోభంలోకి కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి కాలంలో ఇస్రోలో చోటుచేసుకుంటున్న స్వచ్ఛంద ఉద్యోగ విరమణలు (వీఆర్ఎస్) తీవ్రమైన సమస్యగా మారుతున్నది. ఇటీవలకాలంలో 100 నుంచి 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకోవడం దేశానికి శుభసూచకం కాదు. స్వల్ప వ్యవధిలో అంతమందిని కోల్పోవడం ఏ సంస్థకూ మంచిది కాదు. ప్రైవేట్ స్పేస్ కంపెనీల ఆకర్షణీయమైన వేతనాలు, సౌకర్యాలు ఓ వైపు ఆకర్షిస్తుంటే, ఇస్రోలోని కఠినమైన నియమ నిబంధనలు, పరిమిత అవకాశాలు మరోవైపు నుంచి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను బయటకు నెడుతున్నాయని అంటున్నారు. ఇది కేవలం ఉద్యోగులను కోల్పోవడం కాదు, అనుభవం, జ్ఞానం, సృజనాత్మకత వంటి అమూల్యమైన మానవ వనరుల సంపదను కోల్పోవడంగా చూడాల్సి ఉంటుంది. గగనయాన్ వంటి కీలక ప్రాజెక్టుల నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తున్నది. తక్షణమే ప్రోత్సాహకాలు, సంస్కరణలు, అనుకూలమైన పని వాతావరణం కల్పించకపోతే, ఇస్రో దీర్ఘకాలంలో తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం, సమతూకం సాధించాల్సిన అవసరం కనిపిస్తున్నది. ప్రైవేట్ రంగం ఎదగడాన్ని ఎవరూ కాదనరు. అయిదే అది ప్రభుత్వ రంగానికి సమస్యలు తేకూడదు. ప్రైవేట్ రాకెట్లు పైకి లేవాలన్నా ఇస్రో వేదికలే శరణ్యమన్న సంగతి గుర్తుంచుకోవాలి. దేశంలో అంతరిక్ష విజ్ఞానానికి పునాదులు వేసి మహోన్నత శిఖరాలను అందుకున్న ఇస్రోను సమస్యలపాలు కానివ్వడం మంచిది కాదు. ప్రైవేట్‌కు ద్వారాలు తెరువడంతోనే సరిపోదు. అంతరిక్ష విజ్ఞానం అభివృద్ధిలో రెండు రంగాలూ చెట్టపట్టాలు వేసుకునే సాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నది.