ఇదివరకటి తరాలతో పోలిస్తే ఈ తరంలో సాహిత్యం పట్ల ఆసక్తి కాస్త తక్కువే. కాలంతో పాటు మార్పు వస్తుంది, అంగీకరించక తప్పదు. ఈ మార్పులకు అనుగుణంగా సాహిత్యాన్ని తర్వాతి తరాలకు అందించడంలో మన కర్తవ్యం ఏమిటనేదే పునరాలోచించుకోవాలి.
పాఠకులను తయారుచేసుకోవడంలో రెండు, మూడు తరాలను కోల్పోయాం. 10వ తరగతి లోపు 2000 రోజులు పాఠశాలలో గడిపిన పిల్లల్లో 2, 3 శాతానికి కూడా సాహిత్యం పట్ల ఆసక్తి కలగడం లేదు. సాహిత్యాన్ని వ్యక్తిగత ఇష్టంతో చదవడం లేదు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు పిల్లలకు సాహిత్యాన్ని చేరవేయడంలో విజయం సాధించలేదు. సిలబస్ పూర్తిచేసే పనిలో మాత్రమే వాళ్లున్నారు. అందువల్ల పాఠశాల స్థాయిలోనే చాలావరకు సాహిత్యం పట్ల ఆసక్తి లేకుండా పోతున్నది. ప్రైవేట్ పాఠశాలల సంగతి చెప్పవలసిన అవసరం లేదు. తెలుగంటే వాళ్లకి అంటరానిది. మరి ఇంగ్లీషులో ఏమైనా సాహిత్య విలువలు ఉన్నాయా అంటే అది కూడా సున్నా. ఇంగ్లీషులో నాలుగు సృజనాత్మక వాక్యాలు రాయమన్నా వారు నోరు వెళ్లబెట్టాల్సిందే.
ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా పిల్లలకు సాహిత్యపు విలువలను, ఆసక్తిని కలిగించడంలో పూర్తిగా విఫలమైనట్టుగా తెలుస్తున్నది. ఇక డిగ్రీ స్థాయికి వచ్చేసరికి విద్యార్థులకు సమాజం పట్ల, సమూహం పట్ల ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. అక్కడ కూడా తెలుగు పాఠం మాత్రమే చెప్తున్నారు కానీ, సాహిత్యం ఏం చేస్తుందో, సాహిత్యంతో పాటు మనం ఎందుకు నడవాలో, మంచి పుస్తకాలు మనుషులను ఏం చేస్తాయో ఇట్లాంటి విషయాలను చేరవేయడంలో మన విద్యావిధానం సరైన మార్గంలో వెళ్లడం లేదని చెప్పవచ్చు.
ఇట్లాంటి సందర్భంలో సాహిత్యాన్ని యువత వద్దకు లేదా పాఠశాల స్థాయికి తీసుకువెళ్లాలంటే రచయితలుగా మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఇప్పటికే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఉన్నాం. తెలుగు భాషకు సంబంధించి రాత విషయంలో పిల్లలు దారుణంగా వెనుకబడి ఉన్నారు. సొంతంగా పది వాక్యాలు కూడా రాయలేని తరం ఒకటి ఇప్పుడు నడుస్తున్నది. హైస్కూల్ స్థాయి పిల్లలకు అమ్మ గొప్పతనం గురించి, నాన్న గురించి పది వాక్యాలు రాయమని చూడండి, వాళ్లు ఎట్లాంటి స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. ఉపన్యాస పోటీలు నిర్వహించండి కనీసం ముగ్గురు, నలుగురు వచ్చి నిలబడి మాట్లాడే పరిస్థితుల్లో ఉండరు. విద్యార్థుల ముందు నిలబడి పాఠం చెప్పే ఉపాధ్యాయులను రచయితలు చేరాలి. మండల కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ బతిమిలాడో, బలవంతంగానో అప్పుడప్పుడు సాహిత్య సమావేశాలు జరిపి ఉపాధ్యాయులను ఆహ్వానించి సాహిత్యాన్ని పిల్లలకు చేరవేయాలని చెప్పక తప్పదు. మా ఆదివారాన్ని నాశనం చేస్తారా అని ఉపాధ్యాయులు అడగవచ్చు.
నెలలో ఒక్క ఆదివారం మన కోసం, మన భాష కోసం, మన పిల్లల కోసం అని చెప్పి ఒప్పించగలగాలి. వీలైతే అందులో 10 శాతం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లిన తర్వాత పిల్లల ముందు కచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అలాగే జూనియర్, డిగ్రీ కళాశాలలు. ఇట్లా ముందు అధ్యాపకులను మనం చేరగలిగితే ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. సాహిత్యం అంటే తెలుగు ఉపాధ్యాయుడి పని అనే అపోహను తొలగించగలగాలి. మనకు దగ్గరలో ఉన్న పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, కస్తూర్బా పాఠశాలలను బృందాలుగా దర్శించాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న వర్క్ షాపులు నిర్వహించుకోవాలి. ఇట్లాంటి కార్యాచరణను రూపొందించుకోవడానికి ముందు రచయితలు అంతా ఏకం కావాలి. మనం ఏ దృక్పథానికి చెందిన రచయిత అయినా పర్లేదు, ముందు సాహిత్యం పట్ల ఆసక్తిని, దాని విలువను తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం, సాహిత్యాన్ని తర్వాతి తరానికి అందించడమని నమ్మేవాళ్లు ఏకం కావాలి. రచయితలంతా ఏకమై తరచుగా విద్యాలయాలను సందర్శించడం, కనీసం బతిమాలైనా ఒక గంట పాటు అరువు తీసుకోవడం, ఆ గంటను చైతన్యవంతంగా, సమర్థవంతంగా వినియోగించుకోవడం పట్ల ఆలోచించాలి. ఉపాధ్యాయులను బృందాలుగా కలుపుకొని సాహిత్యాన్ని ఒక ఐదు నిమిషాలు పాఠశాలలో పరిచయం చేయమని బతిమిలాడాలి. వర్సిటీల్లో పీజీ స్థాయి విద్యార్థులుంటారు. వాళ్లకు కనీసం నెలకు ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలి. ఇతిహాసాల నుంచి సమకాలీన సాహిత్యం వరకు ఏదో ఒక అంశాన్ని ఇచ్చి వాళ్ల చేత రెండు మూడు నిమిషాలు మాట్లాడించవచ్చు. ఆ నెపంతో వాళ్లు కొన్ని పుస్తకాలను తిరగేస్తారు. విశ్వవిద్యాలయ గ్రంథాలయాలను సందర్శిస్తారు. అక్కడే ఉండే పీజీ విద్యార్థులు, పరిశోధకులతో చిన్న వర్క్‌షాప్ సెమినార్లు ఏర్పాటు చేయవచ్చు. అయితే విశ్వవిద్యాలయంలో కూడా సమస్యలు లేకపోలేదు.
అన్ని విశ్వవిద్యాలయాలలోను నియామకాలు లేవు. ఆయా విభాగాలలోని అధ్యాపకులకు కూడా హెచ్చు తగ్గు భేదాలు, ఒకరంటే ఒకరికి పడకపోవడాలు లాంటివి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సాహిత్యాన్ని యువత దగ్గరికి తీసుకెళ్లడంలో మనం సరైన మార్గం లో వెళ్లకపోవడం కారణంగా సాహిత్యంలో సృజనాత్మకతతో కూడిన ఆలోచనలు తక్కువ అయ్యా యి. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ముందు తరం రచయితలు ఈతరం రచయితలతో ముఖాముఖి ఏర్పాటు చేయవచ్చు. కవిత్వ భాషా పుస్తకంలో బొల్లోజు బాబా చెప్పినట్టు సాహిత్యం చేసే పని చదివితే వచ్చే మార్కుల్లాగా కనిపించదు.
అందులో ప్రోగ్రెస్ కార్డులు ఉండవు. కానీ సాహిత్యం అంతః సంస్కారం అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలోత్సవ పేరు మీద ఒకటి రెండు రోజులు కార్యశాలలు జరుగుతున్నప్పటికీ అవి ఎంత మాత్రం కొనసాగింపుగా ఉన్నాయో పరిశీలించుకోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో , ప్రభుత్వ పాఠశాలల్లో భాషోపాధ్యాయుడు, విద్యార్థులతో సారస్వత సంఘాలు ఏర్పాటు చేయాలి. చెట్టు, వర్షం, సముద్రం, ఆకాశం, మంచి స్నేహితుడు ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు ఇచ్చి విద్యార్థుల చేత మాట్లాడించాలి. అక్కడ కొంతమంది కవుల రచనలను చదివి వినిపించగలగాలి. పాఠశాల స్థాయి సాహిత్యపు రుచిని నుంచి చూపించాలి.
తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్లకు ఓటీటీ వేదికలుగా అపారమైన అవకాశాలున్నాయి. మీడియాలో అవకాశాలున్నాయి. అయితే వాళ్లు కనీసం నాలుగైదు పేజీలు వ్యాసం రాయగలగాలి. అనువాదాల మీద దృష్టి పెట్టాలి. సృజనాత్మకత గల రచనకు ప్రాతిపదికగా అంతకుముందున్న రచనలు పనికొస్తాయనే విషయాన్ని తెలియజేయాలి. తెలుగు సాహిత్యాన్ని చదివితే ఎట్లాంటి అవకాశాలున్నాయో వాళ్లకు తెలియజేయాలి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఒక కథ చెప్పి తరగతి గదిలో చర్చలు మొదలుపెట్టవచ్చు. ఒక కవిత వినిపించి దాన్ని వారికెలా అర్థమైందో చెప్పమని అడగవచ్చు. తెలిసిన దాన్నుంచి పిల్లలను తెలియనిదానికి తీసుకువెళ్లి వదలాలి. ఇవాళ అన్ని స్థాయు ల్లోనూ ఒక నిర్లిప్తత కొనసాగుతున్నది. మార్కులు సంపాదించే విషయం భాష కాదు. పాఠ్య పుస్తకాల్లోని పాఠాలతో భాషను నేర్పించలేం. అది కేవలం కొంత తోడ్పాటు మాత్రమే.