జాతీయ పార్టీలు గొప్ప జాతీయతా భావాలు కలిగి ఉండాలి. సమగ్రమైన జాతీయ విధానాలతో దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిలో సమతుల్యత పాటించాలి. అధినాయకుడి స్వరాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదాలు లేకుండా అన్ని ప్రాంతాల సంక్షేమాన్ని సమదృష్టితో చూస్తే ప్రాంతీయ పార్టీల పుట్టుక ఉండేది కాదు.
ప్రాంతీయ, జాతీయపార్టీల మధ్య సైద్ధాంతిక, విధానపరమైన వ్యత్యాసాలు చాలా ఉంటాయి. జాతీయ పార్టీలు విస్తృతమైన, జాతీయ స్థాయి భావజాలాన్ని కలిగి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలను నడి పే జాతీయ పార్టీ నాయకులకు స్వతంత్ర ప్రతిపత్తి కొరవడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు స్వ తంత్రంగా తీసుకునే అధికారం ఉండదు. కొన్ని చారిత్రక కారణాలు, ప్రాంతీయ అసమానతల వల్ల ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తాయి. ఫెడరల్ స్ఫూర్తి లోపించి పెచ్చు మీరిన వివక్షలు ఏపీలో టీడీపీ, ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) ఏర్పాటుకు నాంది పలికాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్థానంలో తాను బలపడటంతోపాటు కూటమిలో భాగస్వామిగా ఏపీలో వేళ్లూనుకోవాలని బీజేపీ పథకాలు రచిస్తున్నది. అయితే, బీఆర్ఎస్ నాయకత్వ పటిమ ద్వారా కార్యకర్తల్లో పెల్లుబికిన ఉత్సాహం ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాల ద్వారా గోచరిస్తున్నది. ఒకప్పటి పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్న తీరు గమనిస్తే తెలంగాణలో రెండు జాతీయపార్టీల దూకుడును బీఆర్ఎస్ కట్టడి చేయగలదని ప్రజలు నమ్ముతున్నారు.
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాల్సిన బీఆర్ఎస్ కాస్త బలహీనపడడంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తన సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగిందే కానీ, క్షేత్రస్థాయిలో దాని ఓటర్ బేస్ బలపడి కా దు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా సుపరిపాలన దిశగా ముందుకు తీసుకువెళ్లగల బలమై న, స్థిరమైన నాయకత్వం కాంగ్రెస్‌లో కనబడటం లేదు. అంతర్గత కుమ్ములాటలు దాని స్థానాన్ని మరింత బలహీనపరిచే అవకాశం ఉన్నది.
ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారినా ప్రాథమికంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధికే పరిమితమై, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి శ్రమించింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తన పాలనను పార్టీ జాతీయ విధానాలతో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నదే తప్ప స్థానిక ప్రజానీకానికి మేలు చేసే దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం లేదు.
ఉద్యమ స్ఫూర్తితో, జాతీయతాభావాన్ని నరనరాల్లో నింపుకొని అత్యంత వైభవంగా జాతీయ పండుగలు జరుపుకొనే తెలంగాణ ప్రజలకు భారత రాష్ట్ర సమితి నామకరణ కూడా స్వాగతించదగినదే. ఆ మాటకొస్తే ఆల్ ఇండియా (భారతీయ) అనే పదాన్ని వాడుకున్న ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో కొన్ని.. ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (తమిళనాడు), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (పశ్చిమ బెంగాల్), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (హర్యానా), ఆల్ ఇండియా మజ్లిస్ ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)తోపాటు ఇటీవలే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలు మినహాయిస్తే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఇటీవల ఎన్నికల్లో బలం తగ్గినట్టే. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిన రాష్ర్టాల్లో కాంగ్రెస్ గణనీయమైన స్థానాలు కోల్పోయింది. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే తమ తమ ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ కాంగ్రెస్‌ను పక్కన పెడుతున్నాయి. చాలా రాష్ర్టాల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్నాయి. మార్పు కోసం ఎదురుచూసి మోసపోయిన ప్రజల ఆశలు అడియాసలవుతున్న ఈ సమయాన్ని బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలి.
ప్రాంతీయ ఆశయాలు, సాంస్కృతిక భావాలు, స్థానిక సమస్యలకు ప్రతిస్పందనగా ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ లక్ష్యాలు, రాజకీయ వ్యూహాలు, విధానాలన్నీ స్థానిక ప్రజలు లబ్ధి పొందేలా రూపొందించి ఆచరించారు. కాబట్టి ఇప్పుడు ఇక ప్రజలకు కావాల్సింది సుపరిపాలన. వారి అభీష్టాలకు అనుగుణంగా కాలయాపన చేయకుండా అట్టడుగు స్థాయి నుంచి బీఆర్ఎస్ బలాన్ని పెంచుకొని కార్యకర్తలను ఉత్తేజపరచాలి. కీలక ప్రాంతాల్లో క్యాడర్‌ను పునర్నిర్మించి ప్రాంతీయ, జాతీయ లక్ష్యాలను ప్రతిబింబించే ఏకీకృత ఎజెండాను రూపొందించుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో సాధించిన బలమైన బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తూ తన ప్రాభవాన్ని తిరిగి పొందే సామర్థ్యం బీఆర్ఎస్కు ఉందని నిరూపించుకోవాలి. జాతీయపార్టీల డిక్లరేషన్లు, గ్యారెంటీలు, డబుల్ ఇంజిన్ సర్కార్ల నినాదాలు స్థానిక ప్రజానీకం ఆకాంక్షలను అందుకోలేవని బలమైన ప్రాంతీయ పార్టీలే నిరూపించగలగాలి.
కొన్ని సందర్భాల్లో గత చరిత్రతో సంబంధం లేకుండా తమ ప్రాంత ప్రయోజనాల కోసమో లేక స్వప్రయోజనాల కోసమో జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు జతకలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతాయి. ఆ పరిణామాలను కూడా ప్రజలు దోషపూరితంగా పరిగణించడం లేదు. పార్టీలు, నాయకుల మధ్య శాశ్వత మిత్రుత్వం గానీ, శాశ్వత శత్రుత్వం గానీ ఉండదన్న విషయం జగద్వితమే. అందుకే భార త రాజకీయ వ్యవస్థలో నిరంతరం చీలికలు, కలయికలు, పార్టీ మార్పిడులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ ఐడెంటిటీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించడం ద్వారా, దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి పనులను నొక్కిచెప్పడం ద్వారా, అణగారిన వర్గాల ఆందోళనలను పరిష్కరించడం ద్వారా విమర్శకులకు సహేతుక సమాధానాలతో బీఆర్ఎస్ తన ఉద్యమ ఆకర్షణను, తెలంగాణ తత్వాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయగలదు. తెల ంగాణ ప్రజలతో బలమైన సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోగలదు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, భాషాపరమైన ప్రత్యేకతలను వెలుగులోకి తెచ్చి పూర్వ వైభవాన్ని, ప్రజాదరణను తిరిగి పొందాలి. ఆ విధంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టే ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలి. తెలంగాణ గుర్తింపు స్ఫూర్తితో మమేకమవుతూ ప్రజల ఆకాంక్షలను తీర్చే ఏకైక పార్టీగా బీఆర్ఎస్ తన స్థానాన్ని పదిలం చేసుకోగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.