చట్టం ముందు అందరూ సమానమే. ఈ సంగతి ఎన్నో న్యాయ పోరాటాల్లో నిగ్గుదేలిన సంగతి తెలిసిందే. కానీ, సమానత్వం అనేది చట్టానికి భాష్యం చెప్పే తీర్పరి వ్యవస్థ మీద కొంత, దానిని ప్రభావితం చేసే ప్రభుత్వ వ్యవస్థల మీద కొంత ఆధారపడి ఉంటుంది. ఆ రెండింటి ప్రభావంతో కొన్నిసార్లు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బెయిలు విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. నెలరోజులకు పైగా జైలులో మగ్గుతున్న లగచర్ల రైతుల విషయంలో ఈ వ్యత్యాసం మరోసారి మన ముందుకువచ్చింది. సర్కారు వెన్నుపోటు పొడిచిందనే ఆగ్రహంతో తిరగబడ్డందుకు నెల రోజులకు పైగా 24 మంది రైతులు కటకటాల వెనుక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సంగతి తెలిసిందే. మొన్నకు మొన్న ఓ రైతు ఖైదీకి గుండెజబ్బు వస్తే పశువులను సంతకు తోలినట్టు సంకెళ్లు వేసి దవాఖానకు తరలించిన దృశ్యం మనం మరచిపోలేం. నిర్బంధంలో వారు ఎదుర్కొంటున్న దుర్భర స్థితిని అది కండ్లకు కట్టింది. రైతులు తమ వద్దకు వచ్చిన అధికారులపై కోపం చూపారు. కానీ, అసలు సిసలు కారకులైన ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ ఎజండాను తెరవెనుక నుంచి నడిపిస్తూనే ఉన్నారు. దాడి వల్ల సమస్య తీరకపోగా కేసులు మెడకు చుట్టుకొని రైతుల బతుకు నరకమైపోయింది. రైతుల కుటుంబాల పరిస్థితి ఎక్కే మెట్లు, దిగే మెట్లు అన్నట్టుగా తయారైంది.
బెయిలు ఇవ్వడం తప్పనిసరి, జైలుకు పంపడం అనేది మినహాయింపుగా ఉండాలని సుప్రీంకోర్టు పదే పదే చెప్తున్నది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులోనూ, ప్రొఫెసర్ సాయిబాబా కేసులోనూ ఇదే సంగతిని పునరుల్లేఖించింది. ఈ లగచర్ల రైతుల బెయిలు కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదు. ప్రముఖులు ఇలా వెళ్లి అలా తిరిగివస్తారు. కానీ, అమాయకులైన అన్నదాతలు మాత్రం దిక్కులేని పక్షుల్లా జైలు గోడల వెనుక దిగులుగా గడుపుతున్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులకు బెయిలు ఇవ్వడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. లగచర్ల రైతులకు ఎందుకివ్వడం లేదు అనేదే ప్రశ్న.
రైతులు కేసును తారుమారు చేస్తారా? నీరవ్ మోదీలా, విజయ్ మాల్యాలా దేశం విడిచి పారిపోతారా? ఊరు దాటితే ఒడ్డున పడ్డ చేపలే కదా.. పోలీస్ స్టేషన్లో, కోర్టులో ధాటిగా మాట్లాడనైనా మాట్లాడలేరు. రేపు న్యాయస్థానం విచారణ జరిపి ఏ శిక్ష వేసినా ఎవరూ కాదనలేరు. దేనికైనా ముందు చార్జిషీటు దాఖలు కావాలి. కానీ, ప్రభుత్వం కుంటిసాకులతో సాగదీత ధోరణి అనుసరిస్తున్నది. బలమైన ఆధారాలుంటే చార్జిషీటు ఎందుకు దాఖలు చేయరనే వాదనలూ వినిపిస్తున్నాయి. తన అభీష్టాన్ని ప్రశ్నించి, ప్రతిఘటించినందుకు వీలైనన్ని రోజులు రైతులను జైల్లోనే మగ్గబెట్టాలనే మంకుపట్టుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంతా సమానమే కానీ, కొంతమంది కొంచెం ఎక్కువ సమానమన్న వ్యంగ్యోక్తికి అద్దం పట్టేలా తయారైంది లగచర్ల రైతుల కేసు. సర్కారు ఇప్పటికైనా తన మొండి వైఖరి మార్చుకొని బెయిలుకు మోకాలడ్డు పెట్టడం మానుకోవాలి. తాను వ్యవహరిస్తున్నది సామాన్యులైన రైతులతోననే సోయి తెచ్చుకుంటే మంచిది.