కేవలం భారతీయ సమాజానికే పరిమితమైన విశిష్ట లక్షణం కులం. పుట్టుకకు ముందే నిర్ణయమై, పుడమిలో కలిసినా మారనిది కులమే. ఒకప్పుడు సమాజ పురోభివృద్ధికి అది వెన్నెముక. కానీ, యాంత్రిక విప్లవం ఆరంభంతో కులవృత్తుల ప్రాభవం మసకబారడం మొదలైంది. కార్పొరేట్ శక్తుల రంగప్రవేశంతో అణగారిన వర్గాలు మరింతగా అణచివేయబడుతుండగా, ఆధిపత్యవర్గాలు సంపదను పోగుచేసుకుంటూ మరింత బలపడుతున్నాయి. ఈ వైరుధ్యమే ప్రస్తుత కులగణన డిమాండ్‌కు మూలకారణం.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ ఫలాలు, విద్యా, ఉపాధి అవకాశాలు ఓబీసీల్లో ప్రాబల్యం పొందిన వర్గాలకే అధిక భాగం చెందుతున్నాయనేది చేదు వాస్తవం. ఫలితంగానే ఇతర ఓబీసీ వర్గాలు గళం విప్పుతున్నాయి. జనాభా ప్రాతిపదికన సంపదలో వాటాలను పంచమంటున్నాయి.
తెలంగాణలో విద్యా, ఉపాధి, ఉద్యోగాలు, స్థానికసంస్థల్లో ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదంతో మళ్లీ రగడ రాజుకుంది. మాటిచ్చాం.. కులగణన చేశాం.. ఇక కేంద్రానిదే బాధ్యత అంటూ కాంగ్రెస్.. చట్టం చేసి అమలు చేసుకోవచ్చని బీజేపీ పరస్పరం నెపాన్ని మోపుకుంటున్నాయి. శాస్త్రీయ అధ్యయన నివేదికలు లేకుండా రిజర్వేషన్ల కల్పన అసాధ్యం. ఇక జనాభా గణాంకాల సేకరణ కేంద్రం పరిధిలోని అంశం.
కానీ దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీలు ఆ స్ఫూర్తికి తిలోదకాలిచ్చాయి. ఇప్పటికీ కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి స్థితిగతులపై ఎలాంటి లెక్కలను సేకరించకుండా, వెనకబాటుతనాన్ని నిర్ధారించకుండా జనాభా ఆధారంగానే రిజర్వేషన్లను అమలు చేయడం ఒక వైచిత్రి. ఈ అశాస్త్రీయ, అసంబద్ధమైన విధానాల వల్లే రిజర్వేషన్ల అంశం నేడు రచ్చగా మారుతున్నది.
సహేతుకమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడం వల్లే ఓబీసీల రిజర్వేషన్లు న్యాయసమీక్ష ఎదుట వీగిపోతున్నాయి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నేడు అనేక ఆంక్షలు, షరతులను విధించాల్సి రావడమేగాక, అనుసరించాల్సిన నియమ నిబంధనలను జారీచేయాల్సిన అగత్యం ఏర్పడిందంటే ఏలికల తీరు అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ అంటేనే భూస్వాముల, పెత్తందారుల పార్టీ. అధికారం కోసం దేశంలో కుల, వర్గ వైషమ్యాలను పెంచి పోషించింది కాంగ్రెస్సే. హస్తం పార్టీ ప్రవచించే సామాజిక న్యాయం నోటిమాటలే తప్ప 60 ఏండ్ల ఆచరణలో ఎక్కడా కనిపించదు. ఓబీసీల పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు యూపీఏ ప్రభుత్వం తలవంచి 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేయించింది. కానీ, సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఆ నివేదికను తొక్కిపెట్టింది.
మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కులగణన, సామాజికన్యాయం అంటూ ఊదరగొడుతున్నది. తెలంగాణ మోడల్ అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢంకా బజాయిస్తున్నది. మరి ఆచరణ తీరు ఏమైనా మారిందా? అంటే శూన్యమనే చెప్పాలి. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్లో 2 సీట్లను బీసీలకు కేటాయిస్తామని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అట్టహాసంగా ప్రకటించి, అమలును అటకెక్కించింది.
అధికారంలోకి వచ్చిన అనంతరం క్యాబినెట్ విస్తరణలో, నామినేటెడ్ పోస్టుల భర్తీలో, ఉన్నతాధికారుల నియామకంలో ఇలా అడుగడుగునా ఓబీసీలకు మొండిచేయి చూపుతున్న తీరే కాంగ్రెస్ ధోకా రాజకీయాలకు దర్పణం. ఇక ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కులగణన మరీ ఘోరం. 1.13 శాతం మాత్రమే తప్పులు దొర్లాయని 2011 కులగణన నివేదికను తొక్కిపెట్టిన కాంగ్రెస్ పార్టీనే.. ఇప్పుడు రాష్ట్రంలో 3.6 శాతం మంది ప్రజల గణాంకాలు సేకరించకుండా, అదే ప్రామాణికమని ప్రవచించడం శోచనీయం. తులనాత్మక అధ్యయనాలు సాగించకుండా, కమిషన్ల నివేదికలు బయటపెట్టకుండా, కులాలవారీ లెక్కలు తేల్చకుండా, అసెంబ్లీలో బిల్లులను పెట్టి చేతులు దులుపుకొన్నది. ఎందుకంటే కాంగ్రెస్ కులగణన నినాదం రాజకీయ అవసరాల కోసమే అన్నది సుస్పష్టం.
‘అట్టడుగు వర్గాలకు ఏ రూపంలోనూ రిజర్వేషన్లు ఉండకూడదు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ యథాతథంగా కొనసాగాలి..’ ఇదీ క్లుప్తంగా బీజేపీ సిద్ధాంతం. మండల్ కమిషన్ మొదలు గడిచిన పదేండ్లుగా బీజేపీ సాగిస్తున్న పాలనా విధానాలే అందుకు నిదర్శనం. 2014లో అధికారంలోకి వస్తే యూపీఏ ప్రభుత్వం 2011లో చేయించిన కులగణన లెక్కలు ప్రకటిస్తామని బీజేపీ చెప్పింది. కానీ, గడచిన పదేండ్లలో ఆ పని చేయలేదు. పైగా నివేదికను బహిర్గతం చేస్తే సామాజిక అసమానతలకు దారితీస్తుందని కొత్త భాష్యాన్ని ప్రచారంలోకి తీసుకురావడం బీజేపీ నయవంచనకు నిదర్శనం. జనగణనలోనే కులగణనను చేపడతామని 2018లో అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. కులగణన చేపట్టాలని ‘ఓబీసీ పార్లమెంటరీ స్థాయి సంఘం’ సిఫారసు చేసింది. కానీ ఆ హామీని, సిఫారసులనూ కేంద్రం మరోసారి బుట్టదాఖలు చేసింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా బీజేపీ పట్టించుకున్నదీ లేదు.
వర్గస్వభావ రీత్యా.. వెనకబడిన వర్గాల ప్రయోజనాలను వ్యతిరేకించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకే విధానం. ఓబీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వంచించడంలో దొందూదొందే. రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునే ఎత్తులే తప్ప బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అప్పగించే యోచనే వాటికి లేదనేది సత్యం. ఆ రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో పావులుగా మిగులుతున్నది.. దశాబ్దాలుగా దగా పడుతున్నది ఓబీసీలే. జాతీయ పార్టీల అలాంటి విధానాల ఫలితంగా ఓబీసీ వర్గాలు ప్రాంతీయ పార్టీలకు పట్టుకొమ్మలై నిలిచాయి. ప్రాంతీయ పార్టీలు సైతం ఓబీసీ వర్గాలకు పెద్దపీట వేశాయి. ఇకనైనా బీసీ సంఘాలు సత్యాన్ని గ్రహించాలి. జాతీయపార్టీలతో అంటకాగడం మానాలి. ఏకతాటిపై నిలబడాలి. అవకాశాలను అందివ్వగల, అభ్యున్నతికి బాటలు వేస్తున్న, హక్కుల సాధనకు బీసీలకు బాసటగా నిలుస్తున్న, గొంతు కలుపుతున్న నూతన శక్తులతో ఏకం కావాలె. అదే జాతీయపార్టీల వంచనను ఢీకొట్టే పాశుపతాస్త్రం, దశాబ్దాల ఆకాంక్షల సాకారానికి అనుసరణీయ మార్గం.
– మ్యాకం రవికుమార్
94929 10065