కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020’ ముసుగులో ప్రాథమిక విద్యలోనూ థర్డ్ లాంగ్వేజ్‌గా హిందీని తప్పనిసరిగా చేద్దామని చూసిన మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతుండటమే అందుకు నిదర్శనం. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పఢణవీస్ సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే, ‘ఆప్షనల్’ పేరిట, అధ్యయన కమిటీ రూపేణా దొడ్డిదారిన హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు కొనసాగుతుండటంతో మహారాష్ట్రలో భాషా వివాదం ఇంకా రగులుతూనే ఉన్నది.
హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మోదీ సర్కారు తీసుకొచ్చిన త్రీ లాంగ్వేజ్ పాలసీని తమిళనాడు సహా దేశంలోని అనేక రాష్ర్టాలు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. స్టేట్ బోర్డు ఆధ్వర్యంలో నడిచే మరాఠా, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రాథమిక విద్యలోనూ (గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5) హిందీని థర్డ్ లాంగ్వేజ్‌గా తప్పనిసరి చేస్తూ ఏప్రిల్ 16న మహారాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేయడంతో మహారాష్ట్రలో భాషా కుంపటి రాజుకుంది. మరాఠా, ఇంగ్లీష్ మీడియం మినహా ఇతర మీడియం పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఇప్పటికే థర్డ్ లాంగ్వేజ్ విధానం అమల్లో ఉండగా.. మరాఠా, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో మాత్రం గ్రేడ్-5 నుంచి మాత్రమే థర్డ్ లాంగ్వేజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
కనీస అధ్యయనం లేకుండా, చర్చలు చేయకుండా చిన్నారులపై హిందీని రుద్దడంపై ఆ రాష్ట్ర మేధావులు, భాషావేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రాంతీయ భాషాభివృద్ధి సంస్థలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రాథమిక విద్యలో థర్డ్ లాంగ్వేజ్‌ను అమలు చేయడం, పైగా హిందీని రుద్దాలని చూడటాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సాంస్కృతికంగా మరాఠా భాషను దెబ్బకొట్టడమేనని వారు మండిపడుతున్నారు. ఆరెస్సెస్ విధానం ‘హిందీ, హిందూ, హిందుస్థాన్’లో భాగంగా మహారాష్ట్ర సర్కారు హిందీని తమ నెత్తిన రుద్దుతున్నదని పలువురు విమర్శించారు. చివరికి ప్రభుత్వం నియమించిన భాషా సలహా కమిటీ సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో హిందీ తప్పనిసరి కాదని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే ప్రకటించాల్సి వచ్చింది. అయితే, హిందీని జనరల్ థర్డ్ లాంగ్వేజ్‌గా పేర్కొంటూ జూన్ 17న మహారాష్ట్ర సర్కారు మరో ఉత్తర్వు జారీచేసింది. దేశంలోని ఏదైనా భాషను థర్డ్ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చని కానీ, కనీసం 20 మంది విద్యార్థుల నుంచి ఆ మేరకు డిమాండ్ రావాలని ఆ ఉత్తర్వులో పేర్కొనడంపై మహారాష్ట్రలో మరోసారి దుమారం చెలరేగింది.
హిందీ వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకొచ్చింది. మరాఠాల ఆత్మగౌరవమే తమ పార్టీ సిద్ధాంతమని చెప్పుకొనే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ‘మనం హిందువులం, హిందీలం కాదు’ అని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ఈ వివాదం ఠాక్రే సోదరుల కలయికకు మార్గం సుగమం చేసింది. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. ‘హిందీ మాట్లాడే రాష్ర్టాలన్ని మహారాష్ట్ర కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ఆ రాష్ర్టాల ప్రజలు హిందీ మాట్లాడని రాష్ర్టాలకు వలసపోతున్నారు. హిందీ వల్ల వారికేమైనా ఒరిగిందా? మరి మేం ఎందుకు హిందీ నేర్చుకోవాలి?’ అని రాజ్ ఠాక్రే బీజేపీ పాలకులను ప్రశ్నించారు. ‘ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లో థర్డ్ లాంగ్వేజ్‌గా ఏ భాష ఉంది’ అని ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు. మరోవైపు మహాయుతి కూటమిలోనూ ‘హిందీ’ రగడ మొదలైంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా సొంత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. గ్రేడ్-4 వరకు హిందీని అమలు చేయకూడదని ఆయన చెప్పడంతో పఢణవీస్ సర్కారు కంగుతిన్నది.
ఈ నేపథ్యంలో సవరించిన ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు పఢణవీస్ ప్రకటించారు. త్రీ లాంగ్వేజ్ పాలసీపై అధ్యయనం చేసేందుకు ఆర్థికవేత్త నాగేంద్ర జాదవ్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించగా, దానిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఈ కమిటీతోపాటు త్రీ లాంగ్వేజ్ పాలసీని రద్దు చేయాలని మహారాష్ట్రలో డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడాల్సిన రోజు వస్తుందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, భాషా వైవిధ్యమనేది భారత బలం. ఇలాంటి వివాదాలు రాజకీయ లబ్ధి కోసం పాలకులు తెరపైకి తీసుకొచ్చేవేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజా సమస్యలను, తమ వైఫల్యాలను పక్కదారిపట్టించేందుకు వారు చేసే కుతంత్రాలివి. ఈ వివాదాలు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం చేకూర్చవచ్చేమో గానీ, శాశ్వతంగా మాత్రం కాదు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల దేశానికి, కొలువుల కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్న యువతకు ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. వాస్తవానికి ఇంగ్లీష్ మాట్లాడేందుకు దేశ యువత ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. కొలువులు తీసుకొచ్చే భాషగా ఇంగ్లీష్‌ను యువత చూస్తున్నది. యువత కొలువులను కోరుకుంటున్నారే తప్ప, సమస్యలు కప్పిపుచ్చే ఇలాంటి భాషా వివాదాలను కాదు.
– ఎడిటోరియల్ డెస్క్