నేటి ప్రపంచం నిద్ర లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు క్షణక్షణం ఏది చూసినా, ఎవరితో మాట్లాడినా, ఏ టివీ చూసినా, ఏ సోషల్ మీడియా తెరలు తెరిచినా అంతటా హొర్ముజ్ జల సంధి గురించి చర్చ జరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని జల సంధి నేడు 8.2 బిలియన్ల ప్రపంచ మానవాళిని నిద్ర పోనివ్వడం లేదు. పల్లెల్లోనూ హోర్ముజ్ పేరు వినిపిస్తున్నది.
అమెరికా, ఇజ్రాయిల్ భీకర దాడులకు సమాధానంగా హొర్మోజ్ జలసంధిని ఇరాన్ ఆయుధంగా మలుచుకున్నది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వరకు ఈ జలసంధి మీదుగానే జరుగుతున్నది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు కూడా యుద్ధం కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయాన్ని పలు దేశాలు అమెరికాకు ప్రత్యక్షంగా చెప్పాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ చేసిన బాంబు దాడిలో ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో ప్రారంభంపైన యుద్ధం నెలరోజులుగా కొనసాగుతూ ఉన్నది. అమెరికా వెనుకడుగు వేసే పరిస్థితికి చేరింది. ట్రంప్ మాటల ఘాటు తగ్గుతున్నది. అమెరికా స్వరం పట్టు తప్పుతున్నది. అమెరికన్ దళాలకు గుండెల్లో గుబులు పెరిగిందని ప్రపంచ మీడియా కథనాలు వెలువరిస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది. ఇంధన కొరత ద్రవ్యోల్భణానికి దారి తీసింది.
అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో హొర్మోజ్ జలసంధి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ జల మార్గంపై ఇరాన్‌దే పైచేయి కావడంతో చమురు రవాణాకు ఆటంకం కలుగుతున్నది. భారత్ లాంటి మిత్ర దేశాల నౌకలకు అనుమతులు ఇవ్వడం, శత్రు దేశాల చమురు నౌకల రవాణాపై ఆంక్షలు కొనసాగుతున్నది. నేటి ప్రపంచానికి ఇరాన్ మరో వినూత్న యుద్ధ రీతిని పరిచయం చేస్తున్నది. చవకైన షాహెడ్ డ్రోన్ బాంబులు, పేలుడు పదార్థాలతో కూడిన బోట్లు, నావల్ మైన్స్, కైలో క్లాస్ సబ్మెరైన్లతో ప్రత్యర్థుల బలమైన, అత్యంత ఖరీదైన ఆయుధాలకు ధీటుగా సమాధానం చెప్తున్నది. నేడు అమెరికా కూడా వెనకడుగు వేయక తప్పడం లేదు. సౌదీ, యూఏఈ, ఖతార్‌పై కూడా ఇరాన్ దాడులు చేసినప్పటికీ ఆ దేశాలు బలంగా ఎదిరించడం లేదు. దీనికి కారణం ఆయా దేశాల చమురు రవాణా నౌకలను జల సంధి మీదుగా వెళ్లకుండా ఆపగల సామర్థ్యం ఇరాన్ చేతిలో ఉన్నది. నేడు ఇరాన్‌కు హొర్మోజ్ జలసంధి ఒక పదునైన ఆయుధంగా మారి, యుద్ధ ముగింపునకు చర్చలు జరిగే స్థాయికి చేరింది.
ఒక వైపు పర్షియన్ గల్ఫ్‌తో, ఓమన్ గల్ఫ్‌ను కలుపుతున్న హొర్ముజ్ జల సంధికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఓమన్/యూఏఈ దేశాలు ఉన్నాయి. ఈ జలసంధి అతి ముఖ్యమైన చమురు రవాణా సముద్ర మార్గంగా నేడు యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్నది. రెండు దశాబ్దాలుగా అమెరికా ఆంక్షల నడుమ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా చితికిపోయింది. నేడు గోరుచుట్టుపై రోకలి పోటు వలె ఈ యుద్ధంతో ఇరాన్ మరో ఆర్థిక అగాథంలోకి కూరుకుపోయింది. ఇరాన్ అగ్ర నాయకులు మరణించడం, ప్రధాన సైనిక స్థావరాలు నేల మట్టం కావడం, వ్యూహాక్మక కేంద్రాలు విచ్ఛిన్నం కావడం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ చలించడంలేదు. హొర్మోజ్ జలసంధిని అత్యంత పదునైన ఆయుధంగా చేసుకొని రెండు బలమైన దేశాలకు చెమటలు పట్టిస్తున్నది. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ బలగాలు వెనక్కి తగ్గడం లేదు.
ప్రపంచంలో ఎన్నో సముద్ర మార్గాలు ఉన్నప్పటికీ హొర్మోజ్ జలసంధి ప్రత్యేకత వేరు. ఈ జల సంధికి అడ్డుకట్ట వేయడంతో ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నది. వన్‌వే రోడ్డు లాంటి ఈ జల సంధి మీదుగా ఒకే సారి ఎక్కువ నౌకలు వెళ్లే వీలు లేదు. గల్ఫ్ దేశాల చమురు ప్రపంచ దేశాలకు చేరడానికి ఈ జలసంధి గుండానే ప్రయాణించాలి. ఈ జల సంధి గేట్లు మూసి వేస్తే చమురు రవాణాకు బ్రేక్ పడుతుంది. దీనిని ఇరాన్ అనుకూలంగా మార్చుకొని అగ్ర రాజ్యానికి వణుకు పుట్టిస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ప్రతి రోజూ 2 కోట్ల బ్యారెల్స్ చమురు, ఎల్ఎన్జీ ఈ జల సంధి మీదుగా ప్రపంచ దేశాలకు చేరుతున్నది. ఈ మార్గంలో నౌకలు వెళ్లకుండా ఇరాన్ పలు డ్రోన్లు, మైన్స్, మిసైల్స్ ఉపయోగించి ఓడల రాకపోకలను అడ్డుకుంటున్నది. ప్రపంచ ఆర్థిక భారీ కుదుపులను దృష్టిలో పెట్టుకొని అమెరికా/ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాలు తలో మెట్టు దిగి షరతులను సవరించుకోవాలని విదేశాంగ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమ నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకొని చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి వచ్చి యుద్ధ ముగింపు వార్తలను ప్రసారం చేయాలని కోరుతున్నారు. ప్రపంచ శాంతి స్థాపనకు దోహదపడాలి చాలామంది కోరుకుంటున్నారు.
(వ్యాసకర్త: రిటైర్డ్ ప్రిన్సిపాల్)
– డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
99497 00037