అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇవ్వాళ సమగ్రాభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్నది. పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోవటానికి తెలంగాణ ప్రామిసింగ్ యువనేత కల్వకుంట్ల తారక రామారావు కారణం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి పిలిస్తే పలికే నేతగా పేరుగాంచారు. ఆపదలో ఆపన్న హస్తం అందిస్తూ.. ఆదుకుంటున్న హృదయం ఉన్న మంచి మనిషి మన కేటీఆర్.
సాధారణ ఆహార్యం. ఎదుటివారిని ఆకర్షించే బాడీ లాంగ్వేజ్. సమస్త రంగాల్లో అంతులేని విషయ పరిజ్ఞానంతో అబ్బురపరిచే వ్యక్తిత్వం ఆయనది. వేదికకు తగిన ఉపన్యాసాలు, సందేశాలతో శ్రోతలను ఆకట్టుకునే కళ అతని సొంతం. దీనికి తోడు ప్రజల వ్యక్తిగత, సామూహిక కష్టాలు, సమస్యలను ఓపిగ్గా వింటూ.. పరిష్కరిస్తూనే పార్టీ పరంగా కార్యకర్తలకు పెద్దన్నగా అండగా నిలుస్తున్న నేత కేటీఆర్. నిరంతరం సమాజ, ప్రభుత్వ, ప్రజా, పార్టీ యంత్రాంగ సంబంధంగా అల్లుకున్న మానవీయ బంధం కేటీఆర్‌ది.
ప్రతి ఒక్కరినీ ఇంటి మనిషిలా చేసుకునేంతటి సుగు ణ సంస్కారం. కేటీఆర్ విధి నిర్వహణలో, ప్రజాసేవలో, ఆపన్నులను ఆదుకోవటంలో విసుగూ, విరామం ఎరుగని నిరంతర కృషీవలుడు. ఎంతటి వివాదాస్పద విషయమైనా, రాజకీయ వైరుధ్యాలనైనా తనదైన శైలిలో పదునైన చెణుకులకే పరిమితం చేసే హుందాతనం కేటీఆర్ సొంతం. ఎంత క్లిష్టమైన బాధ్యతనైనా తిరుగులేని ఆత్మవిశ్వాసం, మొక్కవోని దీక్షతో అలవోకగా అధిగమించే సాఫల్య చిరునామా అతడు. అందుకే ప్రజా జీవితంలో దేశమే కాదు, ప్రపంచం మెచ్చిన ప్రజానేతగా కేటీఆర్ భాసిల్లుతున్నారు. దేశంలోని యువనేతల్లో విశ్వ పటంపై తళుక్కుమంటున్న ప్రసిద్ధుల్లో కేటీఆర్ తర్వాతే ఎవరైనా. తెలంగాణ ఉజ్వల భవిత కోసం శ్రమిస్తున్న తపస్వి కేటీఆర్. ఉమ్మడి పాలనలో కునారిల్లిన తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా తక్కువకాలంలో ఎక్కువ పురోగతి సాధించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ భాగస్వామ్యం ముఖ్యమైనది.
కేటీఆర్ ఎంతటి మనసున్న వారో మచ్చుకు ఒకటి.. పార్టీ క్షేత్రస్థాయి నాయకుడికి సాక్షాత్తూ తన జన్మదినం రోజునే ఏఎంసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అట్టడుగున పార్టీ కోసం పాటుపడేవారు ఎవరైనా, ఏ మూలన ఉన్నా తగిన సమయంలో తగిన గౌరవం, గుర్తింపు ఖాయమనే సందేశం ఇచ్చి కార్యకర్తల్లో భరోసా నింపా రు. కేటీఆర్ సామర్థ్యానికి, తీక్షణమైన సూక్ష్మ దృష్టికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో!
తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్. అలాంటి అఖండ బలగం సొంతమైన టీఆర్ఎస్కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మూడు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న కేటీఆర్.. నిజమైన ప్రజానేత. బంగారు తెలంగాణ భవిష్యత్ ఆశాకిరణమైన ఆయన నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయనటం లో సందేహం లేదు.(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
–దుర్గాప్రసాద్ ఇల్లెందుల
94408 50384