Bigg Boss 20 | బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో సెలబ్రిటీల ఎంట్రీలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. తాజాగా ప్రారంభమైన ‘బిగ్ బాస్ 20’ సీజన్ కూడా భారీ అంచనాలతో మొదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్లో ఊహించని కంటెస్టెంట్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. రింగ్‌లో ప్రత్యర్థులకు పంచ్‌లతో సమాధానం చెప్పిన ఈ ఛాంపియన్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో 105 రోజుల పాటు హౌస్‌మేట్స్‌తో కలిసి ఉండబోతున్నారు. దీంతో ఈ సీజన్లో మేరీ కోమ్ జర్నీ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మేరీ కోమ్ బిగ్ బాస్‌లోకి రావడం మాత్రమే కాకుండా.. ఆమె కుమారులు కూడా ఈ ఎంట్రీని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఆమె కుమారులు రెచుంగ్వర్, ఖుప్నేవర్ బిగ్ బాస్ సెట్‌కు వచ్చి తమ తల్లికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు మేరీ కోమ్ తన వ్యక్తిత్వంలోని విభిన్న కోణాల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. తల్లిగా తనకు ఒక బాధ్యత ఉందని, అదే సమయంలో స్పోర్ట్స్‌పర్సన్‌గా రింగ్‌లో విజయం సాధించాలనే పట్టుదల తనలో మరో కోణమని ఆమె పేర్కొన్నారు.ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకులు తనలో ఇప్పటివరకు చూడని మరిన్ని కోణాలను చూస్తారని మేరీ కోమ్ చెప్పడం విశేషం.మేరీ కోమ్ ఎంట్రీని మరింత స్పెషల్‌గా మార్చేందుకు హోస్ట్ సల్మాన్ ఖాన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మేరీ కోమ్ కోసం ప్రత్యేక వీడియో మెసేజ్ పంపించారు.
మేరీ కోమ్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక.. బిగ్ బాస్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లను సరదాగా హెచ్చరించారు. మేరీ ఇచ్చే నాకౌట్ పంచ్ చాలా బలంగా ఉంటుందని, ఆమె హౌస్‌లోనూ తన అసలైన వ్యక్తిత్వంతోనే ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రియాంక చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా ఈ వీడియో ద్వారా మరోసారి గుర్తుకు వచ్చింది. ప్రియాంక చోప్రా, మేరీ కోమ్ మధ్య సాన్నిహిత్యానికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. 2014లో మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేరీ కోమ్’ బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించారు.దర్శకుడు ఒముంగ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకున్న ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం’ అవార్డును కూడా అందుకుంది.
ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుండటంతో.. ప్రియాంక పంపిన స్పెషల్ మెసేజ్ మేరీ కోమ్ బిగ్ బాస్ ఎంట్రీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, మేరీ కోమ్ పేరు భారత క్రీడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆమె ఆరుసార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో పాటు 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాన్ని అందుకున్నారు. క్రీడారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2020లో పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇంతటి ఘనమైన క్రీడా నేపథ్యం ఉన్న మేరీ కోమ్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పోరాటంలోకి అడుగుపెట్టారు. బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థి కదలికలను అంచనా వేసి పంచ్‌లు ఇచ్చే ఆమె.. బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం భావోద్వేగాలు, టాస్కులు, సంబంధాలు, అభిప్రాయ భేదాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.