IMD alert : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీచేసింది.
వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో పేర్కొన్నది. వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.