జల ఖడ్గంతో అడుగులేస్తూ
గొంతులు తడిపే భాగ్యానికి
చేతులు కలుపుతూ సాగాలి
తడి ఆరిన బతుకుల్లో
చైతన్యం ఒంపుతూ కదలాలి
నీరుగారిన జీవనాల్లో
కన్నీరును తుడిచిపెట్టాలి
ఒక వంతు పోరాటం
మరో తంతు ఆరాటమై
పదును తగ్గిన కాల్వలకు
అదును చూసి పదును పెట్టాలి
జల ఉద్యమ వెలుగు రేఖలై
ప్రతి మనిషి ముందుకెళ్లాలి
పోరాటపు పటిమతోటి
పంటల గొంతును తడపాలి
ఎండిన నేలకు చేదోడుగా
ఉద్యమ స్ఫూర్తితో భుజం తట్టి
తడి నింపుతూ ఊపిరి కావాలి
జలం కోసం జనం కదిలి
ఏకస్వరమై ఏకమై ప్రతిఘటిస్తూ
జలం హక్కు నినాదమై
సంఘటితమై సాధించుకోవాలి
అక్షర యజ్ఞానికి
సిరాతో ఆజ్యం పోస్తూ
కవనాలతో మమేకమౌతూ
మనసులోని భావాలు
కెరటాలై ఉవ్వెత్తున ఎగరాలి
జల ఖడ్గం పదును తీరులో
సామరస్యం ఉప్పొంగిపోవాలి
అక్షరాలతో కవన యుద్ధం చేయాలి
మనసును కదిలించే కావ్యానికి
వెలుగు నింపుతూ వెళ్లాలి
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636