గౌరవనీయులు శ్రీ కిషన్‌రెడ్డి గారు,
కేంద్ర బొగ్గు గనుల శాఖామాత్యులు
నమస్కారం
తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవసారి పనిచేస్తున్నందుకు అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి సాధించవలసిన కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని తలచి ఈ లేఖ రాస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును సుమారు రూ.80 వేల కోట్లతో చేపట్టి 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించాలని తలపోసిన సంగతి, ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు సమకూర్చే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారికి రెండు లేఖలు కూడా రాసిన సంగతి మీకు తెలిసే ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రాజెక్టు వివరాలు పంపించమని కేంద్ర ప్రభుత్వం గోదావరి బోర్డుకు సూచించినట్టు కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దీన్నిబట్టి చంద్రబాబు నాయుడు గారి లేఖను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టుగా అవగతమవుతున్నది. గోదావరి నదీజలాల్లో తెలంగాణ నీటి హక్కులకు ఈ ప్రాజెక్టు వల్ల భంగం వాటిల్లనున్నదని సాగునీటిరంగ నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు గోదావరి/ కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు గాని, బోర్డులకు గాని సమాచారం అందించకుండానే ఏకపక్షంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకుసాగుతున్నది.
గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 1480 టీఎంసీల నీటిని కేటాయించింది. అందులో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలోనే వివిధ జీవోల ద్వారా కేటాయించబడినాయి. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులైతే ఉన్నాయి కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం కాకపోవడం వల్ల, కొన్ని ప్రాజెక్టులు పాక్షికంగా నిర్మాణమైనందున తెలంగాణ వాస్తవ వినియోగం 200 టీఎంసీలకు మించి లేకుండినది.
తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమానికి సాగునీటి ఆకాంక్షలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయని మీకు తెలియనిది కాదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. తెలంగాణలో వ్యవసాయానికి అనాదిగా ప్రాణాధారంగా ఉన్న మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించింది. మేజర్, మీడియం ప్రాజెక్టుల కాలువల వ్యవస్థలను ఆధునీకరించింది. నదులు, వాగులపై కొత్తగా 1,250 చెక్‌డ్యాంలను నిర్మించింది. చెరువులను, చెక్ డ్యాంలను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది. ఎండకాలంలోనూ చెరువులు, చెక్‌డ్యాంలలో నిండుగా నీటిని సరఫరా చేసింది. ఈ చర్యల ద్వారా రైతాంగానికి రెండు పంటలకు సాగునీటి సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది.
గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నది దిగువ గోదావరి (+-10) సబ్ బేసిన్లోనే. ఈ నీటిని ఎత్తిపోసి ఎగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించడానికి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం (240 టీఎంసీలు), సమ్మక్క సాగర్ (47 టీఎంసీలు), సీతమ్మసాగర్ (65 టీఎంసీ), బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు (12 టీఎంసీలు) ప్రాజెక్టులను రూపకల్పన చేసింది. ఇందులో కాళేశ్వరం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో సూచించినట్టుగా వీటికి కేంద్రం నుంచి అనుమతులు సాధించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారుచేసి కేంద్ర జల సంఘానికి పంపించడం జరిగింది. వీటితో పాటు గెజిట్‌లో పూర్తయినా అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న మరికొన్ని ప్రాజెక్టులకు.. చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్, కడెం లిఫ్ట్, చనఖా కోరాట, మోడికుంటవాగు (ప్రతిపాదనలో ఉన్నది) ప్రాజెక్టుల డీపీఆర్‌లను కూడా కేంద్ర జల సంఘానికి పంపడమైనది. మూడేండ్ల నిరంతర కృషి ఫలితంగా కేంద్రం నుంచి చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్, కడెం లిఫ్ట్, చనాఖ, కొరాట, మోడికుంటవాగు ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) నుంచి అనుమతులు సాధించగలిగాము. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర జలసంఘం అన్ని డైరెక్టరేట్ల నుంచి అనుమతులు సాధించడంలో సఫలీకృతమైనాము. నిరంతర కృషి వల్ల కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అటవీ, పర్యావరణ అనుమతి కూడా సాధించగలిగాం. గోదావరి బోర్డు కూడా టీఏసీ అనుమతి కోసం కేంద్ర జలసంఘానికి సిఫారసు చేసింది. అయితే నెలలు గడుస్తున్నా సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి ఇంకా రాలేదు. అందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఏమిటో ఎవరికి తెలియదు.
అదేవిధంగా సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర జలసంఘం ఇంటర్ స్టేట్ అనుమతి మినహా అన్ని అనుమతులు జారీచేసింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అటవీ, పర్యావరణ అనుమతి కూడా సాధించగలిగాము. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఎన్వోసీ పొందితే తప్ప ఇంటర్ స్టేట్ అనుమతి సాధ్యం కాదు. ఏడాది గడచినా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఎన్వోసీ సాధించలేకపోయింది. భవిష్యత్తులో వరద జలాలను వినియోగించుకునే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక టీఎంసీ నీటిని అదనంగా ఎత్తిపోసే ఖర్చును చేర్చి సవరించిన అంచనా విలువతో అనుమతి కోసం కేంద్ర జల సంఘానికి పంపించడం జరిగింది.
తెలంగాణ ప్రాజెక్టులు నాలుగు. 1.కాళేశ్వరం అదనపు టీఎంసీ కలుపుకొని రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాజెక్టు నివేదిక 2.సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదిక 3.సీతమ్మసాగర్ ప్రాజెక్టు నివేదిక 4.బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు నివేదిక అనుమతుల కోసం కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వీటికి అనుమతులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకొని నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కేంద్ర మంత్రిగా ఉన్న మీరు మీ పరపతిని ఉపయోగించి కేంద్ర జలసంఘం అన్ని అనుమతులు పొందిన సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి జారీ అవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. మీరు చొరవ చూపి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇప్పించగలిగితే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు కూడా అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతుంది.
దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 2014 ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేస్తామని పాలమూరు ప్రజలకు వాగ్దానం చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. తెలంగాణకు కేటాయించిన నికరజలాల నుంచి 90 టీఎంసీల నికర జలాలు పాలమూరు ప్రాజెక్టుకు కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదికను అటు కేంద్ర జల సంఘానికి, ఇటు పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపించడమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నికర జలాల కేటాయింపుల జీవోను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినందున కేంద్ర జల సంఘ అనుమతుల ప్రక్రియను నిలిపివేసింది.
అయితే, పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల సలహా కమిటీ (ఈఏసీ) మాత్రం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని జారీ చేయవచ్చునని మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఏడాది గడిచినా పర్యావరణ మంత్రిత్వ శాఖ మాత్రం పర్యావరణ అనుమతిని పెండింగ్‌లో పెట్టింది. అనేక అడ్డంకులను అధిగమించి సుప్రీం కోర్టు ద్వారా ప్రాజెక్టులో తాగునీటి పనులు కొనసాగించడానికి అనుమతి పొంది, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చి జలాశయాలు, పంప్‌హౌజ్‌లు, పైప్‌లైన్ పనులు 70 శాతం పూర్తిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. పర్యావరణ అనుమతి పొందకుండా సాగునీటి కాలువలు చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పొందడానికి తీవ్రంగా శ్రమించి ఈఏసీ సిఫారసు సాధించగలిగింది. ఏడాది గడచినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ అనుమతి సాధించడంలో విఫలమైంది. సాగునీటి కాలువల నిర్మాణం కోసం పర్యావరణ అనుమతి తప్పనిసరి అని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతిని జారీ చేయించడానికి చొరవ చూపించాలని కోరుతున్నాను.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పైన పేర్కొన్న అంశాలపై మీ అమూల్యమైన సమయాన్ని, పరపతిని వెచ్చించి తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించడంలో మీ వంతు కృషిచేస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ బిడ్డగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఈ గురుతరమైన బాధ్యత మీ పైన ఉన్నదని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.