KRMB | కృష్ణానదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, సంబంధిత ఇతర వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంతో తెలంగాణలో మరోసారి ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 కింద భారత ప్రభుత్వం కేఆర్ఎంబీ పరిధిపై (ఎస్వో 2042 ఈ తేదీ 2021 జూలై 15) ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కృష్ణానదిపై నిర్మించిన దాదాపుగా అన్ని అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని తెలియజేసింది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులపై కూడా ఈ తరహా ఏర్పాటు ఉంది.
కృష్ణా, గోదావరి నదులు రెండింటికీ బోర్డుల ద్వారా నిర్వహణ అనే ప్రత్యేక పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండు రాష్ర్టాల్లో అటుసగం, ఇటుసగం అన్నట్టుగా ఉండటం వల్ల సమస్య కొంచెం తీవ్రంగా ఉంది. అంతేకాకుండా కృష్ణానదికి సంబంధించి కొన్ని సున్నిత పరిస్థితుల వల్ల (ఉదాహరణకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నిర్వహణ, కొత్త ఎత్తిపోతల పథకాలు, వీటి ద్వారా విద్యుత్తు తయారీ) పరిస్థితి సంక్లిష్టంగా తయారైంది. అందువల్ల ప్రస్తుతానికి మనం కృష్ణా ప్రాజెక్టులపైనే దృష్టి సారిద్దాం. అయితే నేడోరేపో గోదావరి ప్రాజెక్టులపై కూడా ఆలోచించాల్సి ఉంటుంది.
గెజిట్ నోటిఫికేషన్ వెలువడగానే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కానీ, తెలంగాణ అందుకు నిరాకరించింది. రెండు రాష్ర్టాల మధ్య నదీజలాల కేటాయింపులు తేలకపోవడాన్ని దీనికి కారణంగా చూపింది తెలంగాణ సర్కార్. నోటిఫై చేసిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల తలెత్తే సమస్యలు ఏమిటి? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది కూడా చర్చనీయాంశమే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సంబంధిత నిబంధనల్లో ప్రాజెక్టుల పూర్తి జాబితా లేకపోవడం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కఠినమైన నియమ, నిబంధనలు చేర్చకపోవడం, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై సందిగ్ధం నెలకొనడం ఈ సమస్యలన్నిటికీ మూలకారణం. చేపట్టాల్సిన చర్యల క్రమాన్ని, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటివాటాల పంపిణీని చట్టం నిర్లక్ష్యం చేసింది. పైగా బోర్డులకు ప్రతిపాదించిన వ్యవస్థాపరమైన ఏర్పాట్లు నిర్వహించాల్సిన కార్యభారంతో పోలిస్తే అరకొరగా ఉన్నాయి.
2014లో బిల్లును రూపొందిస్తున్న సమయంలో ఎదుర్కొన్న అనేక పరిమితుల దృష్ట్యా ఇలాంటి లోటుపాట్లు అనివార్యమే. అయితే సంబంధింత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపి, వివాదాస్పద అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. నిరంతర కృషి ఫలితంగా జరిగిన రెండు అపెక్స్ కమిటీ సమావేశాలతో కొంత పురోగతి సాధ్యమైనప్పటికీ మౌలిక అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నీటి పంపిణీపై నిరంతర, నిర్మాణాత్మక చర్చల ద్వారా చట్టం పరిధిలో శాంతియుత పరిష్కారం కనుగొనడం సాధ్యమే. తమతమ రాష్ర్టాల ప్రయోజనాల పరిరక్షణకు వేర్వేరు రాజకీయ పార్టీలు సమైక్య వైఖరి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రెండు రాష్ర్టాల పరీవాహక హక్కుల పరిరక్షణకు, నిర్వహణాపరమైన సౌలభ్యాన్ని కొనసాగించడానికి విస్పష్టమైన ఏకాభిప్రాయం, వీలైతే విస్తృతస్థాయిలో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడం చాలా ముఖ్యం. సంబంధిత వాస్తవికాంశాల ప్రాతిపదికన తగిన వైఖరి చేపట్టడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. కృష్ణాజలాల పంపిణీపై ఇరు రాష్ర్టాల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధిత భాగస్వాముల విజ్ఞత విశాల దృక్పథంతో కూడిన చర్చలకు దారితీయాలి. అందులో నుంచి వెలుగు ఎక్కువ రావాలి, వేడి కాదు.
ఏ ఒక్క అంశమూ తీవ్రమైన జలవివాదంగా మారకుండా ఉండాలంటే అన్నిటికన్నా ముందుగా చేయాల్సింది రెండు రాష్ర్టాల వాటా నిర్ణయించడం. దీన్ని ఇంతవరకు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు నివేదించడానికి జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు దాదాపుగా తొమ్మిదేండ్లు పట్టింది. నిర్ణీత కాలవ్యవధిలో న్యాయ నిర్ణయం చేయాల్సిందిగా ట్రిబ్యునల్‌కు నొక్కిచెప్పాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉన్నది.
సాధారణ, మిగులు, లోటు సంవత్సరాలకు తగిన రీతిలో కేటాయింపులు జరపాలి. పరీవాహక రాష్ర్టాలు తమకు కేటాయించిన మేరకు వాటాలు వినియోగించుకునేలా చూసేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. నీటి లభ్యత అంచనాలు, ఇతర అంశాల ఆధారంగా అడ్హాక్ కేటాయింపులు జరపడమనేది తాత్కాలిక ఏర్పాటుగానే ఉండాలి. నదీ యాజమాన్య బోర్డుల గత పది సంవత్సరాల పనితీరు గరిష్ఠ పరిష్కారం దిశగా అడుగులు వేసేలా భాగస్వామ్య రాష్ర్టాలకు విశ్వాసం కలిగించలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అంతర్గతంగానూ, రాష్ర్టాల మధ్యన నీటిపంపిణీపై, అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్వహణపై చిత్తశుద్ధితో కూడిన సంప్రదింపులు జరగాలి.
వ్యాసకర్త: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
-శైలేంద్ర జోషి