అమెరికా ఉద్యోగానికి రాజ ద్వారం వంటి హెచ్-1 బీ వీసా చిక్కుల్లో పడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసా ఫీజును ఉన్నపళంగా ఇరువై రెట్లకు పైగా, అంటే లక్ష డాలర్లకు పెంచడం ఒకరకంగా భారతీయ నిపుణులకు అమెరికా తలుపులు మూసివేసే చర్య కిందకు వస్తుందని చెప్పవచ్చు. ట్రంప్ భారత్‌పై అస్ర్తాలు సంధించడం ఇదే మొదటిసారి కాదు. రెండో విడత అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మెడలు వంచే చర్యలు చేపడుతున్నారు. హెచ్-1 బీ వ్యవహారం ఆ పరంపరలోనిదే అయినప్పటికీ కొంచెం భిన్నమైంది. ఇతర దేశాలపైనా దీని ప్రభావం ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకించి భారతీయులను లక్ష్యంగా చేసుకొని ప్రయోగించిన అస్త్రమనేది పైకి తెలిసిపోతూనే ఉన్నది.
ఎందుకంటే హెచ్-1బీ వీసా లబ్ధిదారుల్లో సింహభాగం భారతీయులే. కంపెనీ వ్యాపారం, పరిమాణం బట్టి 2,000 నుండి గరిష్టంగా 5,000 డాలర్ల వరకు చెల్లిస్తున్న ఫీజును లక్షకు పెంచుతూ జారీచేసిన ఫర్మానా భారతీయ ఆశావహులకు దడ పుట్టించి, చెమటలు పట్టించి, పరుగులు పెట్టించింది. ఈసరికే హెచ్-1బీ వీసా మీద ఉద్యోగాలు చేస్తున్నవారు గందరగోళానికి, భయాందోళనకు గురయ్యారు. సెలవుపై ఉన్నవాళ్లు, ఉద్యోగాలు కాపాడుకోవడానికి అమెరికాకు పరుగులు తీశారు. వారి తత్తరపాటు ఫలితంగా విమానాలు ఆలస్యం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. భారతదేశంలో వృత్తి విద్యను అభ్యసించేవారు లేదా అమెరికాలో పై చదువులు చదివి అక్కడే ఉద్యోగం సంపాదించాలని ఆశించేవారికి హెచ్-1 బీ అనేది నిన్నటిదాకా ఓ అందమైన కల. ట్రంప్ ఫర్మానాతో అది పీడకలగా మారింది.
అమెరికా ప్రభుత్వం ఈ క్యాటగిరీలో 2004 నుంచి ఏటా 85 వేల వీసాలు జారీ చేస్తున్నది. ఈ కోటాలో 72 శాతం భారతీయులే సొంతం చేసుకుంటారు. ఎన్నారైలు పంపిన డాలర్ భారతీయ ఆర్థికవ్యవస్థకు ఊతమిస్తున్నది. జీడీపీలో అది 3 శాతం వరకు ఉంటుంది. 2023లో ఎన్నారైలు రూ.12,500 కోట్ల డాలర్లు పంపారు. భారతీయ ఆర్థికవ్యవస్థకు, కోట్లాది కుటుంబాలకు ఇది జీవనాధారంగా మారింది. ఇప్పుడా డాలర్ల ప్రవాహానికి అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదమున్నది.
ఫీజు పెంపు తీవ్ర గందరగోళానికి దారితీసిన నేపథ్యంలో ట్రంప్ సర్కారు పాతవారికి ఫీజు పెంపు ఉండదని, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని వివరణ ఇచ్చింది. హెచ్-1 బీ వీసాదారుల్లో 60 శాతం మంది వార్షిక వేతనం లక్ష డాలర్ల లోపే ఉంటుంది. అలాంటివారి వీసా కోసం లక్ష డాలర్లు చెల్లించమంటే కంపెనీలు ఎక్కడి నుంచి తెస్తాయి? కంపెనీలు వారిని ఎంచుకోవాలంటే ఒకటికి రెండుసార్లు అలోచించాల్సిందే. దీంతో ఇక విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు, హెచ్-1 బీ వీసా గురించి మరిచిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఫీజు పెంపు వల్ల ‘మానవీయ విపరిణామాలు’ ఎదురవుతాయని బేలగా చెప్పడం మోదీ ప్రభుత్వం గత పదేండ్లుగా అనుసరిస్తున్న దౌత్య విధానాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నది. ఎంతో దూరదృష్టి, చాకచక్యం అవసరమయ్యే దౌత్యనీతిని వ్యక్తిగత ప్రచార సాధనంగా మార్చడం, ‘విశ్వగురు’గా ఊదరగొట్టుకోవడం అనేవి ఏ మాత్రం ఫలితాలివ్వకపోగా ప్రతికూలంగా పరిణమించడాన్ని మనం చూస్తున్నాం. మోదీ ఖరీదైన అంతర్జాతీయ పర్యటనలు సాధించిందేమీ లేదు. కరచాలనలు, కౌగిలింతలు, ఫొటోలు దిగడాలు దౌత్యం కాదు. ఇవాళ దక్షిణాసియాలోని ఇరుగు పొరుగు దేశాల మధ్యన ఇండియా ఏకాకిగా మిగిలింది.
శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్.. ఇలా ఒక్కొక్క దేశమే దూరమవుతున్నది. మనకిప్పుడు మిగిలిన మిత్రదేశం తాలిబన్ల పాలనలోని అప్ఘానిస్థాన్ మాత్రమే. చాప కింద నీరులా చైనా ప్రభావ పరిధి పెరిగుతూ భారత్ స్నేహ సంబంధాలు నానాటికీతీసికట్టుగా తయారయ్యాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే, ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని గతంలో మోదీతో ప్రచారం చేయించుకున్న ట్రంప్ ఇప్పుడు భారత్‌ను నానారకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. 50 శాతం ప్రతీకార టారిఫ్ విధించడం పెద్ద సమస్యే. ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు ప్రభుత్వాలు చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలి.
గతంలో అణుఒప్పందాల కోసం అమెరికాతో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జరిపిన లోతైన సంప్రదింపులు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. కానీ ట్రంప్ టారిఫ్ లు బాదినప్పుడు ప్రధాని మోదీ చర్చలు జరిపేందుకు బదులుగా చైనా, రష్యాలకు దగ్గరైన భావన కల్పించడంతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు. దాని ఫలితమే ప్రస్తుత పరిణామాలు. అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు వాణిజ్యమే కీలకం. అసలైన అర్థంలో ఏ దేశమూ మరో దేశానికి మిత్రదేశం కాదు, శత్రుదేశమూ కాదు. స్వీయ ప్రయోజనాలే సర్వోన్నతమైనవి. దీర్ఘకాలిక దృష్టితో దౌత్య విధానాలు రూపొందించుకొని, ప్రత్యామ్నాయాల గురించి కేంద్రం ఆలోచించకపోతే హెచ్-1 బీ తరహా విఘాతాలు ఎదురవుతూనే ఉంటాయి.