బీఆర్ఎస్ హయాంలో వికాసానికి చిరునామాగా వెలుగొందిన గురుకులాలు నేడు నిర్లక్ష్యం నీడలో నీల్గుతున్నాయి. ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్, లైంగిక వేధింపులకు అవి నెలవుగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత 8 నెలల్లోనే 36 మంది విద్యార్థులు మృతిచెందారు. 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా ఏమీ జరగలేదన్నట్టుగానే సర్కారు వ్యవహరిస్తున్నది. రాజకీయాలకు పోయి విద్యార్థుల బతుకులను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ నేత కేటీఆర్ పదే పదే హెచ్చరిస్తున్నా చెవికెక్కించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులం విద్యార్థి పాముకాటుకు గురై చనిపోవడం విషాదకరం. బాధిత కుటుంబాన్ని కేటీఆర్ స్వయంగా వెళ్లి ఓదార్చడమే కాకుండా గురుకులాల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తామని ప్రకటించటంతో సర్కారులో కదలిక వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ పరువును కాపాడుకునేందుకు మంత్రుల ను తరిమింది. బాధిత కుటుంబాలను కలిసేందుకు వెళ్లిన మంత్రులు హడావుడి చేశారు. కానీ, ఇతర పిల్లల తల్లిదండ్రులు మంత్రులను కలుసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సర్కారు చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. అంతేకాదు, గురుకులాల్లో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ తనిఖీలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనేక గురుకులాల్లో నాణ్యత లేని, గడువు ముగిసిన ఆహార పదార్థాలు పట్టుబడుతున్నాయి. పెద్దాపూర్ ఘటన రేపిన దుమారం సమసిపోకముందే జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురవడం గమనార్హం. కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన మన గురుకుల వ్యవస్థ నేడు ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.
బిడ్డల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని ఆలోచించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల వ్యవస్థను పటిష్ఠపరిచారు. అందులో భాగంగానే గురుకులాల సంఖ్యను వెయ్యికిపైగా పెంచారు. గురుకులాల్లో సౌకర్యాలకూ పెద్దపీట వేశారు. వాటిల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు సన్నబువ్వతో పాటు పోషకాహారాన్ని అందించారు. ఒక్కో విద్యార్థిపై సగటున ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చుచేయడమే అందుకు నిదర్శనం.బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి, వ్యయం వృథా పోలేదు. గురుకుల విద్యార్థులు చదువుల్లో రాణించడమే కాదు, పోటీ పరీక్షల్లో కార్పొరేట్‌కు దీటుగా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లలోనూ తమ సత్తా చాటారు. కానీ, ఇప్పటి కాంగ్రెస్ పాలకులు గురుకులాల నిర్వహణపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇతర రంగాల వలె కేసీఆర్ స్థాపించి నిలబెట్టిన గురుకులాలపైనా కాంగ్రెస్ ఏలికలు శీతకన్ను వేశారు. దాని ఫలితంగానే గురుకులాల పతనం మొదలైంది. దీంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల భవిష్యత్తు డోలాయమానంలో పడింది. ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు. ఇప్పుడు కావాల్సింది కంటితుడుపు చర్యలు కాదు, గురుకులాల వ్యవస్థలో సమూల ప్రక్షాళన. సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించి గురుకులాల పతనాన్ని అడ్డుకోకపోతే బడుగుల చదువులకు తీరని అన్యాయం చేసినట్టవుతుంది.