వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తమదేనన్న విషయాన్ని ప్రభుత్వాలు మరువకూడదు. జాతీయ అటవీ విధానం ప్రకారం.. దేశంలో పచ్చదనం సాంద్రత 33.33 శాతం ఉండాలి. అయితే, 2023 నాటికి మన దేశంలో 20.71 శాతం పచ్చదనం సాంద్రత మాత్రమే ఉండటం ఆందోళనకరం. అంటే, ఇంకా 12.62 శాతం పచ్చదనం ఉండాలి.
Radar Center | పచ్చదనం తగ్గితే కిరణజన్య సంయోగక్రియ తగ్గుముఖం పడుతుంది. తద్వారా వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పెరిగి, ప్రాణవాయువు తగ్గుతుంది. సగటున ఒక పీపీఎం బొగ్గుపులుసు వాయువు పెరిగితే, 2.15 పీపీఎం ప్రాణవాయువు తగ్గినట్టే. గత శతాబ్ద కాలంలో వాతావరణంలో 0.1 శాతం ప్రాణవాయువు తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తునాయి. ఇలాంటి తరుణంలో పచ్చదనాన్ని పెంచాల్సిందిపోయి అభివృద్ధి పేరిట చెట్లను నరకటం ఎంతవరకు సమంజసం?
హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలోని దామగుండం అటవీ ప్రాంతం గురించి ఇటీవల తరచుగా వార్తల్లో వింటున్నాం. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం లో ఉన్న దామగుండం అటవీ జీవ వైవిధ్యంతో కూడుకున్న ప్రాంతం. అరుదైన ఔషధ మొక్కలతో పాటు విలువైన వృక్ష, జంతుజాతులకు ఈ ప్రాంతం నెలవు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం కోసం అరుదైన వృక్షజాతులకు ఆలవాలమైన ఈ అటవీ ప్రాంతాన్ని భారత నౌకాదళానికి కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం ఆందోళనకరం. ఈ ప్రతిపాదన వచ్చిన నాటినుంచీ స్థానికులతో పాటు దేశవ్యాప్తంగా పర్యావరణ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దామగుండం అడవులను రక్షించడానికి ఒక బృందం ఏర్పడింది. వాస్తవానికి రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే కలిగే దుష్ప్రభావాల గురించి దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో పర్యావరణవేత్తలు దశాబ్దకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దామగుండం అటవీ ప్రాంతంలో సుమారు 2,900 ఎకరాల విస్తీర్ణంలో ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అందుకోసం దాదాపు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రం వల్ల సమీపంలోని 20 గ్రామాల్లోని 60 వేల మందికి పైగా ప్రజల జీవనం అతలాకుతలమవుతున్నది. చిన్న, సన్నకారు రైతులు, అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు, పాడిరైతుల జీవనోపాధిపై ఇది ప్రతికూలం ప్రభావం చూపుతుంది. అటవీ నిర్మూలన కారణంగా నేల కోత పెరుగుతుంది. తద్వారా మూసీ, కాగ్నా నదులు ప్రభావితమవుతాయి. ఈ కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్, అటవీ నిర్మూలన ఫలితంగా జరిగే పుప్పొడి కాలుష్యం కారణంగా శ్వాసకోశ రుగ్మతలు వస్తాయి. అంతేకాదు, చారిత్రక బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తీరని నష్టం జరిగే ఆస్కారం ఉన్నది.
రాడార్ కేంద్రాన్ని నెలకొల్పడం వల్ల స్థానికంగా కొన్ని ఉద్యోగాలు రావచ్చు. మొదట్లో నష్టం చాలా చిన్నదిగా కనపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో భారీమూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలైతే చుట్టుపక్కల ప్రాంతం కూడా ఎంతోకొంత అభివృద్ధి చెందుతుంది. అందువల్ల పచ్చదనం మరింతగా తగ్గే ప్రమాదం ఉన్నది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గాలి, నీరు కలుషితమవుతాయి. దీర్ఘకాలిక పరిణామాల వల్ల అనేక జంతుజాలాలు అంతరించిపోతాయి. అంతేకాదు, మూసీ నదికి కన్నీటి బాధలు తప్పవు. నది గొంతు బిగుసుకుపోతుంది. దామగుండం నదీ పరీవాహక ప్రాంతం కావడంతో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరమున్నది. ఆ ప్రాంతంలో ఏ మాత్రం విధ్వంసం జరిగినా దాని ప్రభావం తప్పకుండా హైదరాబాద్ నగరంపై పడుతుంది. వరదలు వచ్చే ఆస్కారమూ లేకపోలేదు.
తెలంగాణలో ప్రస్తుతం 24.06 పచ్చదనం ఉన్నది. అంటే, ఇంకా 9.27 శాతం పచ్చదనం పెరగాలి. అలాంటి తరుణంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలే గాని తగ్గించకూడదు. అడవుల నరికివేత వల్ల భూతాపం పెరుగుతుంది. తద్వారా రుతుపవనాలు ప్రభావితమై నీటి చక్రంలో మార్పులు సంభవిస్తాయి. ఒకే ప్రాంతంలో అసాధారణంగా వర్షాలు పడతాయి. ఇప్పటికే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వివిధ నిర్మాణాల కారణంగా పచ్చదనం తగ్గిపోయింది. నగరం కాలుష్య కోరల్లో ఉక్కిరిబిక్కిరవుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక (2024) ప్రకారం.. హైదరాబాద్లో గాలి నాణ్యత ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నది. వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతున్నది. తత్ఫలితంగా నగరవాసులు గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అభివృద్ధి సాకుతో పర్యావరణాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. ఈ విషయాన్ని పాలకులు గ్రహిస్తే మంచిది.