e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home ఎడిట్‌ పేజీ అబద్ధాలకు ఆచరణే జవాబు

అబద్ధాలకు ఆచరణే జవాబు

ఉద్యమపార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర సాధన తర్వాత పూర్తి స్థాయి రాజకీయపార్టీగా రూపుదిద్దుకున్నది టీఆర్‌ఎస్‌. ఉద్యమపార్టీగా పదమూడేండ్లు, రాజకీయపార్టీగా ఏడేండ్ల కాలాన్ని పూర్తిచేసుకున్నది. టీఆర్‌ఎస్‌ అంటే కేసీఆర్‌, కేసీఆర్‌ అంటే టీఆర్‌ఎస్‌ అనేంతగా రాష్ట్ర ప్రజలతో మమేకమైంది. తన 20వ ప్లీనరీ సమావేశాలను ఘనంగా జరుపుకొన్నది. పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికకావటం ముదావహం.

ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణలో అనేక అసత్య ప్రచారాలు సాగాయి. తెలంగాణలో కరెంట్‌ ఉండదని, పరిశ్రమలన్నీ ఏపీ కి వెళ్ళిపోతాయనీ, తినడానికి బియ్యం కోసం ఆంధ్రా మీద ఆధారపడాల్సి వస్తుందని భయాందోళనలు రేకెత్తించారు. తెలంగాణ వారికి పరిపాలన చేతకాదనీ.. ఒకటా రెండా ప్రజలను ఎంతగా భయపెట్టాలో అంతకన్నా ఎక్కువగానే క్షుద్రమీడియా విషప్రచారం చేసింది. ఇంకా విచిత్రమేమంటే.. ఆరునెలల తర్వాత మళ్ళీ ఆంధ్రాలో కలిపేయండి అని తెలంగాణ ప్రజలే ఉద్యమం చేస్తారని పచ్చ పత్రికలు నానా దుష్ప్రచారం చేశాయి. ప్రజల మెదళ్లలో విషాన్ని నింపటానికి చంద్రబాబు పక్షపాత పత్రికలు నానా తంటాలు పడ్డా యి. అంతటితో ఆగాయా? ఆంధ్రా, తెలంగాణ అనునిత్యం ఘర్షణ పడుతాయని, తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రావారిని తరిమేస్తారని కథలు అల్లి ప్రజల మధ్య విద్వేషాలు పెంచటానికి విఫల ప్రయత్నాలు చేశాయి.

- Advertisement -

ఏడేండ్ల తర్వాత ఒకసారి పునశ్చరణ చేసుకుంటే.. పైన చెప్పిన భయాలలో, చేసిన దుష్ప్రచారాల్లో ఏ ఒక్కటైనా నిజమైందా? బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చేవారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిందా? కరెంట్‌ పోతున్నదా? బియ్యానికి కరువొచ్చిందా? తెలంగాణ, ఆంధ్రావారు ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టుకున్నారా? తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పటికీ తెలంగాణ వారు గొడవ చేశారా? ఒక్క కుటుంబమైనా తెలంగాణ నుంచి ఆంధ్రా వెళ్లిపోయిందా? ఆంధ్రా మూలాలున్న ఏ ఒక్క పరిశ్రమైనా ఇక్కడినుంచి తరలిపోయిందా? లేదు. ఇదేదీ జరగకపోగా.. మునుపటికన్నా మరింత సురక్షితంగా ఉన్నామని భావించే స్థితి నేడు తెలంగాణలో నెలకొన్నది.

రాష్ట్ర సాధనే లక్ష్యమని నాడు ప్రకటించిన కేసీఆర్‌.. తెలంగాణలో స్థిరపడిన ఏ ప్రాంతం వారైనా తెలంగాణవాళ్లేనని, ఎలాంటి వివక్షత ఉండదని స్పష్టంచేశారు. దానికి తగ్గట్లే రెండు రాష్ర్టాల మధ్య చిచ్చు రేగేవిధంగా ఎప్పుడూ కేసీఆర్‌ మాట్లాడలేదు. ఆంధ్రలో కూడా టీఆర్‌ఎస్‌ శాఖను ప్రారంభించాలని కొందరు కోరినా ఆయన పట్టించుకోలేదు. ‘మన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందాం, వేరే రాష్ట్ర రాజకీయాలు మనకు అనవసరం’ అని స్పష్టం చేయటం కేసీఆర్‌ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. మరి అప్పటి ఆంధ్రా సీఎం అలాంటి రాజనీతిజ్ఞతను ప్రదర్శించారా? అడుగడుగునా తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. కోట్లు ఎరవేసి ఒక ఎమ్మెల్సీ ఓటును కొనటానికి కుట్ర చేశారు. తన వెనుక మీడియా ఉన్నదన్న అహంకారంతో ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. చంద్రబాబు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా ఉన్నట్లయితే తెలంగాణలో టీడీపీ ఇంకా బతికి ఉండేదేమో? రాజకీయాల్లో చంద్రబాబు కన్నా కేసీఆర్‌ సీనియర్‌. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలకు, నేతలకు గండిపేట ఆశ్రమంలో రాజకీయ తరగతులను నిర్వహించిన ఘనత కేసీఆర్‌ది.చంద్రబాబు హయాం లో ప్రవేశపెట్టిన జన్మభూమి, నీరు-మీరు, శ్రమదానం లాంటి అనేక పథకాలను రూపొందించింది కేసీయారే అంటారు! ఎవరో శ్రమ పడితే దాని ఖ్యాతిని తన జేబులో వేసుకునే మనస్తత్వం చంద్రబాబుది!

తెలంగాణ ప్రజల అవసరాల పట్ల నిబద్ధత ఉన్న నేతగా కేసీఆర్‌.. కరెంటు సమస్యను మొదటి ఏడాదిలోనే పరిష్కరించా రు. వ్యవసాయం మీద దృష్టి పెట్టి మొదటి నాలుగేండ్లలోనే ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించి పెట్టారు. ‘వ్యవసాయం దండుగ’ అన్న చోట అది పండుగైంది. సాగునీటి ప్రాజెక్టుల వల్ల పాతాళగంగ సైతం పైకి వస్తున్నది. ఇక సంక్షేమ పథకాలకు లెక్కే లేదు. పారిశ్రామికరంగం గొప్పగా పుంజుకున్నది. ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. గత ఏడేండ్లుగా తెలంగాణ మీద పచ్చ పత్రికలు ఎంత దుష్ప్రచారం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆంధ్రావారు కూడా ఆ ప్రచారాన్ని నమ్మటం మానేయటం గమనార్హం.

ఆధ్యాత్మిక రంగంలో కూడా కేసీఆర్‌ కృషి అద్వితీయమైనది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన అనేక ప్రాచీన ఆలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. యాదాద్రి తెలంగాణకే తలమానికంగా రూపొందింది. సుమారు రూ.1200 కోట్ల భూరివ్యయంతో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. అనేకం గత వైభవాన్ని చాటుతున్నాయి. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావటం, గోదావరి, కృష్ణా పుష్కరాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించటం కేసీఆర్‌ ఆధ్యాత్మికతకు నిదర్శనం.

ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సుఖసంతోషాలతో విలసిల్లుతున్నది. అభివృద్ధి సాధనలో ఆయనకు సంతృప్తి అనే మాట కు తావు లేదు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం మరింత వేగంగా దూసుకొనిపోవాలని, దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థితికి చేరుకోవాలని కోరుకుందాం.
(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

ఇలపావులూరి మురళీ మోహనరావు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement