రైతన్నలను కేంద్రం మరోమారు దగా చేసింది. ధాన్యం సేకరణ ఇప్పటి వరకూ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుండగా.. దాన్నించి పక్కకు తప్పుకోవటానికి మోదీ సర్కారు నిర్ణయించటం సాగు రంగంలో ప్రైవేటీకరణకు తలుపులు తెరవటమే. ధాన్యం సేకరణ ప్రక్రియలోకి ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానిస్తామని కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి ప్రకటించటం దీనికి తొలిమెట్టుగా భావించాలి. గిట్టుబాటు ధర లేక, ప్రధానికి లేఖ రాసి మరీ మహారాష్ట్రకు చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న రోజే కేంద్రం ఇటువంటి రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోవటం దేశంలో నెలకొన్న దుస్థితితోపాటు ప్రభుత్వ దుర్నీతిని వెల్లడిస్తున్నది.
ఏడాదిపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడిన తర్వాత వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నది. ఆ సమయంలో వారికి ప్రధాని స్వయంగా క్షమాపణ చెప్పటమేగాకుండా మద్దతు ధర విషయంలో హామీ ఇస్తామని, వారి ఇతర డిమాండ్లను కూడా సానుకూలంగా పరిశీలిస్తామని ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది జరిగింది. ఆ ఎన్నికల తర్వాత కేంద్రం తిరిగి తన అసలు నైజాన్ని ప్రదర్శించటం ప్రారంభించింది. రైతుల డిమాండ్లపై కమిటీ పేరుతో కాలయాపన చేసింది. ఆ కమిటీలో తమకు తగిన ప్రాతినిధ్యం కూడా లేకపోవటంతో సంయుక్త కిసాన్ మోర్చా దానిని బహిష్కరించింది. అయినప్పటికీ ప్రభుత్వ ధోరణి మారలేదు సరికదా రైతులను మరింత ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు తీసుకున్నది. తాజా ప్రకటన దీంట్లో భాగమే.
వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అందులోనూ తమకు కావలిసిన వారికి అప్పనంగా అప్పగించాలని మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందువల్లనే రైతుల సమస్యలను గాలికి వదిలేసి, వ్యవసాయాన్ని భారంగా మార్చే పనిని చేపట్టింది. తద్వారా రైతులు తమకుతామే సాగును వదిలిపెట్టే పరిస్థితి తీసుకురావాలన్నది వారి లక్ష్యం కావచ్చు. విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటర్లకు కరెంటు మీటర్లు తెచ్చే ప్రతిపాదనను కూడా ఈ కోణంలోనే చూడాలి. ఈ ముప్పేట దాడిని రైతులు తమంతటతామే ఎదుర్కొనలేరు. ఢిల్లీలో జరిగిన ఉద్యమం దీనినే నిరూపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాలతో సమావేశమయ్యారు. ఇతర వర్గాల ప్రజానీకంతో కలిసి రైతులు ఉద్యమించాలని, చట్టసభల్లోకి కూడా రావాలని సీఎం వారికి సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అవలంబించిన పోరాటం, పార్లమెంటరీ రాజకీయాల కలబోతగా ఉద్యమాన్ని నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. రైతన్నలు ఈ వెలుగులో ముందడుగు వేయాలి. దేశ వ్యవసాయరంగం కార్పొరేట్ శక్తుల బారిన పడకుండా పరిరక్షించుకోవాలి