హోంగార్డులు.. ‘అటెండర్‌కు ఎక్కువ.. పోలీసుకు తక్కువ’. ఉదయం డ్యూటీ ఎక్కితే ఎప్పుడు ఇంటికొస్తాడో తెలియదు. రోజంతా వెట్టి చాకిరి. ‘ఏయ్.. చాయ్ తీస్కరా పో..’ అనే హూంకారంతో వారి దినచర్య మొదలవుతుంది. ‘ఇంటికి వెళ్తా సార్’ అంటే.. ‘అప్పుడేనా.. లంచ్ బాక్స్ కడిగి కార్లో పెట్టు’ అనే వరకూ ఎన్ని పనులు చేస్తుంటారో, ఎన్నెన్ని పనులు చేయించుకుంటారో ఆ నాలుగు గోడలకే ఎరుక. అంత వెట్టిచాకిరి చేస్తున్నా ఈ చిరు ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది.
చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న హోంగార్డులను పట్టించుకున్న దిక్కు లేదు. ప్రభుత్వం ఇలా మారిందో లేదో.. అలా ఇబ్బందుల కొలిమిలో మాడిపోతున్నారు. హోంగార్డులు. ప్రభుత్వం మారిన దగ్గర్నుంచి వేతనాలు సరిగా రాక ఇబ్బందులు పడుతున్నారు. జీతం కోసం ఒక్కోసారి 20వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వస్తున్నది. చెక్బౌన్స్లకుతోడు, ఈఎంఐ డేట్లు ముగిసిపోయి సిబిల్ స్కోర్ పడిపోతున్నది. దీనికి తోడు పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో ఖర్చులు, కిరాణా సరుకులు, పాల డబ్బులు, ఇంటి అద్దెలు, బండికి పెట్రోల్ వంటి వాటికి డబ్బులు సర్దడం చాలా కష్టంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం వారి సంక్షేమానికి పాటుపడకపోవడం విడ్డూరం. ఈ నేపథ్యంలో కొందరు హోంగార్డులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తనువు చాలించడం బాధాకరం.
ఎన్నికల వేళ హోంగార్డులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ప్రజావాణిలో మంత్రి సీతక్కకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రతిరోజూ గంటల తరబడి గొడ్డుచాకిరి చేస్తున్న హోంగార్డులపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఇతర రాష్ర్టాల్లో బందోబస్తు విధులకు హాజరైన హోంగార్డులకు ఇచ్చే డైలీ డ్యూటీ అలవెన్స్‌లు, డైట్ చార్జీలు కట్ చేసి మా పొట్టకొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్క తెలంగాణ మినహా ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల డ్యూటీకి హోంగార్డులు వెళ్తే.. డైలీ డ్యూటీ అలవెన్సులను వారి వేతనంతో కలిపి ప్రోత్సాహకాలుగా ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం కోతలు పెడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హోంగార్డులకు కారుణ్య నియామకాలు రద్దు చేసి పెద్ద షాక్ ఇచ్చింది. 600 మందికి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు ఇవ్వబోమని చెప్పడం మరింత దుర్మార్గం. వెల్ఫేర్ ఫండ్ కింద రూ.20 తీసుకుంటున్నా వాటిని ఎక్కడ వాడుతున్నారో? ఎలా వాడుతున్నారో తెలియదు. ఇటీవల సంభవించిన వరదలకు మాత్రం కనీస సమాచారం లేకుండానే హోంగార్డుల వేతన నుంచి ఒకరోజు జీతాన్ని కట్ చేశారు. అయితే, ఎవరైనా హోంగార్డు చనిపోతే ఆదుకుంటామని ఒకరోజు జీతం ఇస్తామని ముందుకొస్తే మాత్రం అలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇద్దరు కమాండెంట్లు, ఒక అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి ఉన్నా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కమాండెంట్ ఆఫీసుల్లో, ఏడీజీ ఆఫీసుల్లో ఏండ్లపాటు పాతుకుపోయిన వారు.. క్షేత్రస్థాయిలో హోంగార్డుల సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. జిల్లాల్లో హోంగార్డుల సమస్యలపై దర్బార్ ఏర్పాటు చేయడమో, హెల్త్ క్యాంపులు పెట్టడమో, హోంగార్డుల పిల్లల చదువులకు ఏమైనా సాయం చేయడమో వంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు.