‘బాగా నమ్మిస్తేనే మోసం చేయడం అల్కగైతది. నమ్మకమనేది లేకపోతే మోసమనేదే ఉండదు’ అని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నాడు. అందులో భాగంగానే మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి బీసీలను నమ్మించి నట్టేట ముంచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ గారడీ విద్యలు ప్రదర్శించిన ఆయన నేడు తడిగుడ్డతో బీసీ ప్రజల గొంతు కోశారు. కులగణన, సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్‌లు, జీవోలు అంటూ వెనుకబడిన వర్గాలను మైమరిపించి, ఆశలు కల్పించిన ఆయన ఆఖరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. బడుగులకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ చివరికి తన రెండు చేతులూ ఎత్తేసింది. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం కాదు కదా, కనీసం 20 శాతం కూడా రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది.
వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన మాటను మంట గలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని నలుగురిలో నవ్వుల పాల్జేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ పాలకులు చేసిన ధర్నాల డ్రామా వట్టిదేనని తేటతెల్లమైంది. సర్వే, అసెంబ్లీలో బిల్లులు, జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరుతో గత రెండేండ్లుగా రేవంత్ ప్రభుత్వం ఆడిన నాటకం బట్టబయలైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బడుగుల ఓట్లను కొల్లగొట్టింది. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపే కులగణన జరిపి, సమగ్ర సర్వే చేసి, బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతుల లెక్కలు తీసి, చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిక్లరేషన్ అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ హామీని నెరవేర్చడం కంటే ఎగ్గొట్టడంపైనే రేవంత్ ప్రభుత్వం ఆది నుంచి ఎక్కువగా ఆసక్తి కనబరిచింది. తీరా రెండేండ్ల విలువైన సమయాన్ని వృథా చేసి ఇప్పుడు ‘మేము మా శాయశక్తులా ప్రయత్నించాం. కానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేకపోయాం’ అని చెప్పడం శోచనీయం. ఇదిలా ఉంటే పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం, మళ్లీ మాకే ఓట్లు వేయండి అని అడగడం సిగ్గుచేటు. పైగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే ఆర్థికసంఘం నిధులు కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పడం విడ్డూరం. బీసీల ఆత్మగౌరవం కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక సంఘం విడుదల చేసే నిధులు ఎక్కువయ్యాయా?
వాస్తవానికి రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాము అనుకున్నది సాధించింది. బీసీలను మోసం చేయాలనుకున్నది, చేసింది. బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా అడ్డుకోవడంలో విజయం సాధించింది. గతంలో ఉన్న రిజర్వేషన్లు కూడా దక్కకుండా చేయడంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది.
రాష్ట్రంలో 12,735 గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. ఈ లెక్కన 2,404 గ్రామపంచాయతీలు బీసీలకు దక్కాయి. ఈసారి రాష్ట్రంలో 48 గ్రామపంచాయతీలు పెరిగాయి. అయినప్పటికీ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన సీట్లు 2,176 మాత్రమే. గతంతో పోలిస్తే 228 గ్రామపంచాయతీలు బీసీలు కోల్పోయారు. మొత్తంగా చూసుకుంటే వెనుకబడిన వర్గాలకు 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కాయి.
ఇక జిల్లాల వారీగా చూసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో బీసీలకు 3 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కడం గమనార్హం. మహబూబాబాద్‌లో 3 శాతం, ఆదిలాబాద్‌లో 4 శాతం, ఆసిఫాబాద్‌లో 5 శాతం, మంచిర్యాలలో 7 శాతం, ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లా ఖమ్మంలో 9 శాతం రిజర్వేషన్లు మాత్రమే రేవంత్ ప్రభుత్వం కల్పించింది. సీఎం రేవంత్ సొంత జిల్లా వికారాబాద్‌లో 18 శాతం రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు దక్కాయి. ఇక బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో 23 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే, ఈ జిల్లాలో గతంతో పోలిస్తే 8 గ్రామ పంచాయతీలు బీసీలకు తక్కువగా కేటాయించడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో బీసీలకు 10 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు దక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే మరి దారుణం. ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించలేదు. అంతేకాదు, రాష్ట్రంలోని 27 మండలాల్లో బీసీలకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సొంత జిల్లాలోని కన్నాయిగూడెం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియోజవర్గంలోని పాలకవీడు మండలంలో ఒక స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడం మా బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ తుంగలో తొక్కడంతో బీసీలకు అన్యాయం జరిగింది.
దీన్నిబట్టి వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదని అర్థమవుతున్నది. అందుకే, రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ ప్రభుత్వం మొదటినుంచి వివాదాస్పదం చేసింది. డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండానే బీసీ కమిషన్‌కు సర్వే బాధ్యతలను అప్పగించింది.
ఆ తర్వాత కూడా సర్వేలో ఎన్నో తప్పులు దొరికాయి. సొంత పార్టీ నేతలే సర్వే ప్రతులను తగలబెట్టడం అందుకు ఉదాహరణ. దీంతో ఆ నివేదిక ప్రజలకు ముందుకు రాలేదు. సరైన విధానాన్ని పాటించకుండా బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోలు అంటూ రిజర్వేషన్ల అంశాన్ని ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు తిప్పింది. చివరికి చేతులెత్తేసి పార్టీ కోటా ఇస్తామంటూ తప్పించుకున్నది. ఈ నేపథ్యంలో నమ్మించి బీసీలను వంచించిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే)
– గంగుల కమలాకర్