రోమ్ తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షలు చేసి అభినవ నీరో అనిపించుకున్నారు రేవంత్.నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని అనేక ప్రాంతాలు, కాలనీలు ఇప్పటికీ నీళ్లలోనే నానుతున్నాయి. ఒకవైపు మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం, మరోవైపు పరిపాలన తెలియని, బాధ్యత లేని కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేయడంతో నగరవాసులు నరకం చూస్తున్నారు.
చినుకు పడితే చాలు నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై ఎక్కడ హోల్ ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ జామ్ అయి చీమలదండులా వాహనాలు బారులుతీరుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఐటీలో బెంగళూరుతో పోటీపడ్డ మన హైదరాబాద్.. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ విషయంలో బెంగళూరును మించి కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్లైఓవర్లపై స్విమ్మింగ్ పూల్‌లు, జలపాతాలు, వాటర్ ఫౌంటెయిన్లు దర్శనమివ్వడం వింత గొల్పుతున్నది.
వాన నీటిలో నగరం నానుతుంటే రేవంత్ మాత్రం ఏసీ రూముల్లో కూర్చొని మూసీపై సమీక్ష చేయడం విడ్డూరం. మూసీ ఒడ్డున ఉన్న పేదల గుడిసెలు పీకేసి, అక్కడ ఐకానిక్ టవర్లు నిర్మించాలని, అందుకు తగ్గ డిజైన్లు రూపొందించాలని అధికారులకు హుకుం జారీచేయడం ఆయనకే చెల్లింది. హిమాయత్ సాగర్‌లోని గాంధీ సరోవర్ వద్ద గేట్ వే ఆఫ్ హైదరాబాద్‌ను నిర్మించాలని, ఓఆర్ఆర్కు ఒకపక్క ఎకో థీమ్ పార్కు, బాపు ఘాట్ పరిసరాలను వరల్డ్ క్లాస్ జోన్‌గా తీర్చిదిద్దాలని స్కెచ్‌లు గీస్తూ.. నగరాన్ని వరద ముంచుతున్నా ఆ పట్టింపే లేదన్నట్టుగా చేసిన ఈ సమీక్షతో రేవంత్, నీరోను మించిపోయారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల పెంపునకు ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగా ఎస్ఆర్డీపీ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద నగరంలో 47 అభివృద్ధి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కారు చేపట్టింది. రూ.5,937 కోట్లతో 42 ఫ్లైఓవర్లు, ఆర్వోబీల నిర్మాణాలను చేపట్టగా, 36 ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో జూ పార్కు, శిల్పా లే అవుట్ ఫేజ్- 2 ఫ్లైఓవర్లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి.
శాస్త్రీపురం, ఫలక్‌నుమా ఆర్వోబీలు, ఐఎస్ సదన్ స్టీల్ బ్రిడ్జి, ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, వాటి పురోగతిని సర్కార్ పట్టించుకోవడం లేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. అందుకే పైవంతెనలపై మోకాళ్ల లోతు నీళ్లను చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. డ్రైనేజ్‌ను సరిచేయకుండా పైవంతెనలకు పొక్కలు పెట్టడం ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి. వడ్డించిన విస్తరిలా ఉన్న ఇలాంటి మౌలిక సదుపాయాలను కూడా రేవంత్ ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు.
గత ప్రభుత్వం ఎంతో ఉన్నతమైన ఆలోచనతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తుత సర్కారు ముందుకు తీసుకెళ్లి ఉంటే, నగరంలో నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు.. హైడ్రా రాకతో ఇతర శాఖల పాలనా యంత్రాంగం పడకేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వరదపై సమీక్షించకుండా మూసీలో మునకలేసి మురికి అంటించుకోవడానికి కమీషన్లు, కాసుల వెంట పరుగులు తీసే రేవంత్ సర్కారు ఉత్సాహం చూపడం ఏ మాత్రం ఆశ్చర్యపరచడం లేదు.
(వ్యాసకర్త: రాష్ట్ర మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే)
– గంగుల కమలాకర్