PV Narasimha Rao | ‘శత వసంత శక పురుషుడు మా బాపు’.. వేల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ సువిశాల భారతావనికి గుండె వంటి సర్వోన్నత అధికార పీఠమైన ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి తెలుగు, దక్షిణాది నాయకుడు తెలుగు తేజం పాములపర్తి వేంకట నరసింహారావు గారు. రాజనీతికి పవిత్ర భాష్యం చెప్పిన విశిష్ట వ్యక్తి మా బాపు. జాతి, మత, కుల, వర్గ, ప్రాంతాతీతమైన విశ్వజనీన దృక్పథం వారిది.
‘ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు ఒళ్లు విరిచి కళ్లు తెరిచి ఓహో అని లేచినాడు’ అంటూ స్వాతంత్య్ర ఉషోదయానికి కవితాత్మకమైన నివాళి అర్పించినవారు మన పీవీ.. తెలంగాణ ఠీవి.
ప్రత్యర్థులను సైతం ఆకర్షించగలిగే బహుముఖ విలక్షణమైన వ్యక్తిత్వం వారిది. బహుభాషా కోవిదుడు. అయినా.. అవసరానికి మించి ఒక్క పదం ఎక్కువ మాట్లాడని మితభాషి. అనేక చిక్కుల్లో ఉన్న దేశాన్ని తొణక్కుండా, బెణక్కుండా గట్టెక్కించిన ‘ఆదర్శ’ ప్రధాని మా బాపు పీవీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్య, వైద్య, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రిగా ఆయా శాఖలలో తనదైన చెరగని ముద్రవేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించి భూ సంస్కరణల ముఖ్యమంత్రిగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని అమలుపరిచారు. జాతీయ స్థాయిలో హోం, విదేశాంగ, రక్షణ వంటి అత్యంత కీలక శాఖల మంత్రిగా దేశానికి సేవలందించారు. ‘మానవ వనరుల అభివృద్ధి’ పేరిట సరికొత్త శాఖకు రూపకల్పన చేసి, అత్యంత ప్రాముఖ్యం కలిగిన శాఖగా దాన్ని నిలిపారు. భారతీయ మేధోసంపత్తిపై అపార విశ్వాసం కలిగిన పీవీ.. అపర చాణక్యుడిగా ప్రపంచ స్థాయిలో రాజనీతిజ్ఞుడిగా ప్రసిద్ధి చెందారు.
రాజకీయ ఒత్తిళ్లు, మతతత్వం, ఉగ్రవాదం వంటి ఎన్నో జఠిల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేండ్ల పూర్తి కాలం నడిపి, భారతదేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచ వేదికలపై వెలిగించారు. అంతేకాకుండా మరో పదేండ్లు కాంగ్రెస్ పరిపాలన కోసం తన అనుంగు శిష్యుడు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానిగా అందించిన అపర బృహస్పతి మా బాపు. జీవితమే ఉద్యమంగా జీవితయాత్ర సాగించిన మా బాపు పీవీ గారి యాదిలో 104వ జయంతి సందర్భంగా నా శత కోటి నమస్కారాలు.
– సురభి వాణీదేవి, రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు