మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో గురువారం పరమపదించారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు క్యాబినెట్లో ఆర్థికమంత్రిగా మన్మోహన్సింగ్ దేశ చరిత్రలో తనదైన, చెరగని ముద్రవేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో మౌనంగా, ఎలాంటి ప్రచారాలు, ఆర్భాటాలు లేకుండా దేశ గతిని మార్చారు. ఆరు దశాబ్దాల పాటు దేశానికి అనేక స్థాయుల్లో సేవ చేసిన మన్మోహన్‌సింగ్‌కు ప్రతి భారత పౌరుడు రుణపడి ఉంటాడు.
Manmohan Singh | ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న మన్మోహన్సింగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పాఠాలు బోధించి ఎందరినో ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్దారు. అంతేకాదు, వాణిజ్య పరిశ్రమల శాఖకు సలహాదారుగా ఉంటూ, ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా సేవలందించారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళికా సంఘం డిప్యూ టీ చైర్మన్‌గా కూడా ఎనలేని సేవలు చేశారు. దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఎన్నడూ పదవుల కోసం వెంపర్లాడలేదు. మన్మోహన్‌సింగ్‌కు ఉన్న పరిజ్ఞానం, అనుభవాలను చూసి పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రి పదవి కూడా ఆ తరహాలో వచ్చిందే. ఏ పార్టీలో వీసమెత్తు సభ్యత్వం కూడా లేని మన్మోహన్‌సింగ్‌కు దేశ ఆర్థికమంత్రి పదవి దక్కడం విశేషం.
మన దేశం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయం అది. ఆపత్కాలంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్సింగ్.. ప్రమాదపుటంచున ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను తన మేధోసంపత్తితో గాడిలో పెట్టారు. తద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కింది. లైసెన్స్ రాజ్యానికి తెరదించి సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ఆయన ఆర్థిక రంగానికి జవసత్వాలు అందించారు. అప్పటి ప్రధాని పీవీ సహకారంతో ఆర్థికమంత్రిగా మన్మోహన్సింగ్ చేపట్టిన చర్యల కారణంగా విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు వెల్లువలా వచ్చాయి. దాంతో దేశం అతివేగంగా అభివృద్ధి చెందింది. రోజూ 16 గంటల పాటు పనిచేసే మన్మోహన్‌సింగ్‌కు అలుపు, అలసట అనేవే తెలియవు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవ చేసిన ఆయన ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు. 2004లో మొదటిసారి ప్రధానమంత్రి పదవిని అలంకరించిన ఆయన 2004-09 మధ్యకాలంలో ప్రజారంజక పాలనను అందించారు. తద్వారా ప్రజామోదం పొంది 2009లో మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన రష్యా, అమెరికాలతో మన దేశ సంబంధాలు ఏ మాత్రం చెక్కుచెదరకుండా కాపాడటం మన్మోహన్సింగ్ చతురతకు నిదర్శనం.
అలాగే సర్వశిక్షా అభియాన్, పనికి ఆహారం, సమాచార హక్కు లాంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. మౌనాన్నే తన బలంగా చేసుకొని, ప్రతిపక్షాల విమర్శలను మెట్లుగా మలుచుకొని ఉత్తమ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా సేవలందించిన ప్రాతఃస్మరణీయుడు మన్మోహన్సింగ్. ఆయన అస్తమయం భారతావనికి తీరని లోటు.
(మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళిగా..)
– సురభి వాణిదేవీ శాసనమండలి సభ్యురాలు