తొలి దశ ఉద్యమం ముగిసిపోయిన తర్వాత 1990 నుంచి మళ్లీ ఉద్యమ వెలుగులు మెరిశాయి. మొదట్లో భాషా ప్రేమికులు పీవీ నరసింహారావు,కాళోజీ నారాయణరావు లాంటి నాయకులు, ఇక్కడ కమ్యూనిస్టులు. తెలుగువారు, ఆంధ్రవారు కలిస్తే ఆ భాష సంపన్నమవుతుందని, తెలుగు జాతికి బలం పెరుగుతుందని ఆశించారు. కానీ, మొదటిరోజు నుంచే ఆంధ్రావారి మోసపూరిత ప్రవృత్తి అర్థమైంది.
కాలం గడిచినకొద్దీ ఆంధ్ర నాయకుల ఆగడాలు పెరగడం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో ఏ బెదురు లేకుండా తెలంగాణకు, ప్రజలకు పూర్తిగా అన్యా యం చేయటంతో స్థానికులు నిరాశ, నిస్పృహల్లో మునిగారు. శాసనసభలో తెలంగాణ సభ్యుల మాట చెల్లదు. బయట చూస్తే ప్రభుత్వ సహకారంతో అన్నీ ఆంధ్ర వ్యాపారాలు, సంస్థల పెత్తనంలోనే సాగటం! ఆ క్లిష్ట సమయంలో కొందరు మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి స్థాయిలో వారు నిరసన తెలుపడం మొదలుపెట్టా రు. వివక్షను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు చేశా రు. పౌరసంఘాలు ఆవిర్భవించాయి. తెలంగాణ భాష ను, సంస్కృతిని ఎగతాళి చేసిన వారిమీద అక్కడక్కడ దాడులు కూడా మొదలయ్యాయి. 1969లో టీపీఎస్ నాయకుడు చెన్నారెడ్డికి కుడి భుజంగా పనిచేసి, 14 ఎం పీ సీట్లలో 11 సీట్లు ఆ పార్టీ గెలవటానికి కృషిచేసిన ఆనందరావు తోట 1971-1993 మధ్య కూడా చాలా విస్తృతంగా మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యానికి పాటుపడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిసి పల్లె, పట్టణాల ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర అవసరాలపై చైతన్యపరిచారు. ఆంధ్రవారి సోపతి అరవ వారితో కాబట్టి వారిని కూడా ‘ఇడ్లీ, సాంబార్ గోబ్యాక్’ వంటి నినాదాలు విస్తృతంగా వాడారు.
1969లో మొదటి ఉద్యమకాలంలో ఆంధ్ర కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణ శ్రీ) ఒక్క మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రమిస్తే, అది ‘దక్షిణ పాకిస్తానం’ అవుతుందనీ, ఇక్కడి భాష ‘తౌరఖ్యాంధ్రం’గా మారుతుందనీ ఆయన బాధ! దానికి బాసిరి సాంబశివరావు అనే ఆయన తన కవిత ద్వారా చక్కటి సమాధానం ఇచ్చారు. కానీ, ఆనందరావు తోట అంతటితో తృప్తి పడకుండా, జయశంకర్ గారిని తీసుకొని ఆంధ్రలో కరుణశ్రీ ఇంటికి వెళ్లి మూడున్నర గంటలు ఆయనతో వాదించి వచ్చారు. (తోట, జయశంకర్ ఇద్దరూ ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. తోట ఇంగ్లీషు లెక్చరర్ అవబట్టి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ జయశంకర్ ఎకనామిక్స్ తెలుగు మీడియం వారికి బోధించాల్సిన అవసరంతో తెలుగు బాగా నేర్చుకున్నారు.) వారిద్దరూ కరుణశ్రీతో వాదనలో ఆంధ్ర భాషలోనే ఉర్దూ పదాలు ఎక్కువగా ఉంటాయని అక్కడున్న ఆంధ్ర పత్రిక పేపర్లో ఆ రోజే వచ్చిన వార్త ‘పది మంది ఖైదీలు జైలు నుంచి పరార్’ అన్నది చూపించి మరీ వాదించారు.
శ్రీశ్రీ, ఆరుద్ర వంటి కవులు పద్యాలలో ఉపయోగించిన కైఫియత్, మస్కా వంటి ఉర్దూ పదాలు కలిసి ఆంధ్ర భాష ఎప్పుడో ‘తౌరఖ్యాంధ్రం’ అయిపోయిందనీ, ఇంకా ఇప్పటికీ ఒక్క ఉర్దూ పదం లేని స్వచ్ఛమైన తెలుగు తెలంగాణ పల్లెలలో మాట్లాడతారని కూడా వారికి చెప్పారు. పైగా ఆంధ్రవారు చక్కటి ఉర్దూ భాషను తప్పుగా పలకటమే గాక, అర్థాలు కూడా మార్చేస్తారని గట్టిగా వాదించారు. ‘ఖూన్’కి ‘ఖూనీ’ అనీ, ‘ముద్దయీ’ (సాక్షి)ని నేరస్థుడు అంటారనీ, అలాంటి చాలా ఉదాహరణలతో అంత గొప్ప కవి గారినీ నోట మాట లేకుండా చేశారు. తర్వాతికాలంలో జయశంకర్ తన ప్రసంగాలలో ఒక మాట చెప్పేవారు. ‘ఆంధ్రా వారికి అవి ఉర్దూ పదాలు అనీ, అవి ఎలా వాడాలీ అని తెలియదు. ఆ సంగతి తమకు తెలియదన్న విషయం కూడా వారికి తెలియదు’ అని! జయశంకర్ ప్రారంభించి పూర్తిచేయలేని పుస్తకాలలో ‘ఆంధ్రంలో ఉర్దూ భాష’ కూడా ఒకటి!
1993 జూలైలో ఆనందరావు మరణం తర్వాత జయశంకర్ ఉద్యమ భారం తన మీద వేసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రారుగా 1982 వరకు, తర్వాత సీఫిల్ రిజిస్ట్రారుగా 1991 వరకు, కేయూ వీసీగా 1994 డిసెంబర్ వరకూ పనిచేయాల్సి రావటంతో, అంతవరకు తెలంగాణలో వివిధ రంగాలకు జరిగిన అన్యాయాల మీద విస్తృతంగా రచనలు చేశారు. ప్రభుత్వ గణాంకాలతోనే జరిగిన అన్యాయాలు, చూపిన వివక్షను ఎండగట్టారు. 1995 జనవరి నుంచి పూర్తిగా ఉద్యమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. విద్యావంతుల వేదిక, ఐక్య వేదిక వంటి సంస్థల ద్వారా ప్రజా చైతన్యానికి చాలా గట్టిగా కృషిచేశారు. 1995 నుంచీ టీఆర్ఎస్ ఆవిర్భావం దాకా ఆయన చాలా తపన పడ్డారు. తన సమయాన్నం తా మీటింగ్లు, రచనల ద్వారా ప్రజా చైతన్యానికి కృషి చేశారు. అంతవరకు కొందరు యువ నాయకులు పార్టీ లు స్థాపించినా అవి ఎక్కువ కాలం నిలవలేదు. ఉద్యమానికి మూడు పార్శాలుంటాయని జయశంకర్ చెప్పేవా రు. మొదటిది ప్రజా చైతన్యం, వారు పాల్గొనడం, రెండవది అన్యాయాలని నిరూపించే సాక్ష్యాలు గట్టిగా చెప్పగలగడం అయితే మూడవది లేకుండా ఏ ఉద్యమం ఫలించదు. అది ఒక రాజకీయ నాయకుడు ప్రజ్ఞ, ధైర్యం కలిగి ప్రజా చైతన్యం చేయగలిగి ప్రాంతానికి ఉన్న సమస్యలకు పరిష్కారం చూపగలిగేవాడు కావాలనీ, రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించగలిగే సమర్థత ఉన్నవాడై ఉండాలనీ జయశంకర్ పదే పదే చెప్పేవారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2001, ఏప్రిల్ 27న జరిగింది. అదొక చారిత్రక ఘట్టం. ఒక మాతృభూమి ప్రేమికుడు, ధైర్యం, ప్రజ్ఞ, పట్టుదల, త్యాగబుద్ధి ఉన్న నాయకుడు పార్టీ స్థాపించటమే కాకుండా, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ఉద్యమంలో సకలజనులు పాల్గొనేటట్టు చేశాడు. రాజకీయ ఒడిదుడుకులు, కుటిల ఆంధ్ర నాయకుల కుట్రలు, అవమానాలు ఎదుర్కొని ఆ కుట్రలను భగ్నం చేసి, పద్నాలుగేండ్లు శ్రమించి, స్వరాష్ట్రం సాధించారు. ఆయనే ప్రపంచానికి తెలిసిన కేసీఆర్. వారి పేరు తెలంగాణ చరిత్రలో ప్రజలను ప్రేమించిన పాలకుల పట్టికలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ ప్రజలు వారికెప్పుడూ రుణపడి ఉండాలి.
అయితే, ఆంధ్ర నాయకుల కుట్రలు అంతటితో ఆగిపోయాయని ప్రజలు ఆనందపడనక్కరలేదు. ఈ పార్టీ కూడా మఖలో పుట్టి పుబ్బలో మాయమవుతుందని పదే పదే నవ్వారు. అప్పటిదాకా డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని కోపంతో పార్టీకి రాజీనామా చేసి, ఏమీ తోచక పార్టీ పెట్టాడనీ, అది ఎక్కువ కాలం నిలవదని, తమ కుతంత్రాల మీద గట్టి నమ్మకం ఉన్న ఆంధ్ర నాయకులు పదే పదే వల్లించారు. కానీ తర్వాతి కాలంలో కేసీఆర్ చేసిన రాజీనామాలు, కేంద్ర మంత్రి పదవి కూడా తృణప్రాయంగా వదిలిన తీరు, తన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు ఇప్పించిన ధైర్యం, సాహసం, మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఆయనకు ముందుకంటే ఘన విజయం లభించటం తెలంగాణ చరిత్రలో మరుపురాని ఘట్టాలు. ఈ సంఘటనలన్నీ నిశితంగా గమనిస్తే, తమ శ్రేయోభిలాషులు ఎవరో, రాష్ర్టానికి తెలంగాణ ప్రజలకు శత్రువులెవ్వరో తెలుస్తుంది.
-కనకదుర్గ దంటు
89772 43484