ఏనాటిదో నల్లమల! ఎత్తయిన గుట్టలు, దట్టమైన మట్టలు, పుట్టల పుట్టుక ఎప్పటిదో? గుట్టల సానువుల నడుమ సుడులు తిరిగే కృష్ణమ్మ ఈ అడవిలోకి ఎప్పుడొచ్చి చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా పెద్దపులి ఇక్కడ మాత్రం ఉనికి కాపాడుకుంటూ ఎన్నేళ్లుగా నల్లమలను ఏలుతున్నదో? ఏదు, పులి, పూరేడు, అడవికోళ్లలో తమ పూర్వీకుల ఆత్మీయ స్పర్శను తడుముకుంటూ చెంచోళ్లు ఈడికి ఏనాడొచ్చారో? జీవరాశితో కలిసి చెట్ల తొర్రల్లో నివసించే ఆదిమ తెగలు తొర్రల నుంచి పెంట మీదకి ఎప్పుడొచ్చారో?
ఎక్కడా దొరకని దివ్యౌషధం సరస్వతి ఆకు అక్కడే ఎందుకు పుట్టిందో? దాన్ని చెంచుల కంట పడకుండా ఈ అడవి ఎందుకు దాచిపెట్టిందో? లోకంలో ఎక్కడా లేనన్ని ఖనిజ నిధి నిక్షేపాలు అడవి తల్లి భూగర్భంలో ఎప్పుడొచ్చి ఒదిగిపోయాయో? ఆ తల్లి గర్భం మీద ఏ ఘడియన దుష్టకన్ను పడిందో? ఆదిమ మానవుని అస్తిత్వం మీద ఈ రాజ్యం ఎప్పుడు పగబట్టిందో? చెంచుల నామరూపాలు చెరిపేయాలని కపటపు కత్తులను ఎప్పటినుంచి పాలకులు నూరుతున్నరో?
బహుశా.. అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, యురేనియం తదితర ఖనిజ సంపదలను తవ్వి తరలించుకుపోవడం మొదలవుతుందేమో..! రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మూకుమ్మడి దూకుడు చూస్తుంటే అదెంతో దూరం లేదనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో కృష్ణా నదికి దిగువన ఉన్న రెండు పెంటల చారిత్రక ఆనవాళ్లను చెరిపేసింది.
దోమలపెంటను బ్రహ్మగిరి, ఈగల పెంటలను కృష్ణగిరిగా పేర్లు మార్చుతూ అధికారిక గెజిట్ విడుదల చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కృష్ణమ్మకు ఎగువన ఉన్న సుండిపెంట, సదరంపెంట పేర్లు తుడిచివేయటానికి సిద్ధమైంది. ఇందుకోసం ఆయన ఏకంగా మంత్రివర్గ ఉప సంఘమే వేసిండు. కాకుంటే చంద్రబాబు గుట్టు మనిషి. మర్మం అంత సులువుగా బయటపడదు. అభ్యంతరాలున్న ఊర్ల పేర్లు మార్చుకోవటానికి అని కమిటీని నియమించిండు. ఈ కమిటీ అంతిమ లక్ష్యం సుండిపెంట, సదరంపెంట పేర్లు మార్చడమే.
పని నిరాటంకంగా సాగటానికి పాలకులు వ్యూహాత్మకంగా అసత్య ప్రచారాన్ని, అబద్ధపు వాదనను తెరమీదికి తెచ్చారు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఈ రెండు పెంటలకు బ్రహ్మగిరి, కృష్ణగిరి అనే పూర్వ నామాలుండేవనే వాదన ప్రచారంలోకి తీసుకువచ్చారు. విచిత్రం ఏమంటే కృష్ణానదికి ఆవలి దిక్కు ఆంధ్రలో ఉన్న సుండిపెంట పూర్వనామం కూడా కృష్ణగిరి అనే పేరే ఉందట. ఇప్పుడు అదే ప్రచారం జరుగుతున్నది. వాస్తవిక చారిత్రక ఆధారాల ప్రకారం సా.శ 375-713 మధ్యకాలంలో విష్ణు కుండినులు శ్రీశైలం పడమర ప్రాంతాన్ని ఏలినట్టు శ్రీశైల స్థల మహాత్యం అనే ప్రాచీన కావ్యం చెప్తున్నది.
విష్ణుకుండినుల వంశానికి చెందిన 4వ మాధవ వర్మ కాలంలో సలేశ్వరాన్ని రుద్రకుండం, మల్లెల తీర్థం జలపాతాన్ని విష్ణు కుండం, లొద్ది మల్లయ్య సెలను బ్రహ్మకుండం అని పిలిచినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. ఇంతకుమించి జనావాసాలకు వైష్ణవ నామాలున్నట్టు నల్లమల చరిత్రలో లేదు. దీన్ని తెలంగాణకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు భిన్నూరి నరసింహశాస్త్రి (బీఎన్ శాస్త్రి) ధ్రువీకరించారు. ఇందుకు ఆయన మాధవ వర్మ రచించిన ‘జనాశ్రయఛందోవిచ్ఛితి’ గ్రంథ అంశాలను ఉటంకించినట్టు చరిత్రకారులు చెప్తారు. శాలివాహన శకానికి ముందు వెయ్యేండ్లు, తర్వాత వెయ్యేండ్లు తీసుకున్నా.. దోమలపెంట, ఈగలపెంటలకు కృష్ణగిరి, బ్రహ్మగిరి అనే పూర్వ నామాలు లేనే లేవని చెప్తున్నారు. పైగా శ్రీశైల క్షేత్రం మల్లయ్య స్థావరం.
ఇక్కడి అణువణువూ శివనామ స్మరణమే. వైష్ణవ ఆరాధన లేని చోట కృష్ణగిరి, బ్రహ్మగిరి అని నామకరణం చొప్పించటం వెనుక చెంచుల ఉనికిని సజీవ సమాధి చేసే పన్నాగం దాగి ఉన్నదని సామాజిక శాస్త్రవేత్తల అనుమానం.
పెంటలు చెంచుల జనావాసాలు. చెంచు పరిభాషలో పెంట అంటే బయలు భూమి. ద్రవిడ భాషకు మూల మాతృక. నాలుగైదు గుడిసెలు దూరం దూరంగా పొందిస్తే అదో పెంట. ఆకలి తీర్చే జల, జంతు, వృక్షాది భౌతిక క్రియాశీలక ప్రభావాన్ని బట్టి ఆ పెంటకు పేరు పుట్టి స్థిరపడుతుంది. దోమలపెంట అని పేరు అట్లా వచ్చిందే. కృష్ణానది ఒడ్డుకు కాస్త దూరంగా ఉండే పెంట అది. రోడ్డు మార్గం లేనప్పుడు చెంచులు మిరాశీ తీసుకొని భక్తులను దోనెలలో నది దాటించేవారట. దోనెల ప్రయాణం అక్కడి విశిష్టత. దోనెలు నడిపే చెంచులు నాలుగు గుడిసెలు వేసుకున్నారు.
అట్లా అది దోనెలపెంటగా నామం స్థిరపడ్డది. 1960 దశకంలో శ్రీశైలం డ్యాం నిర్మాణం కోసం పొరుగు ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు, దోనెలపెంటను ఆవాసంగా చేసుకున్నారు. వారి ఉచ్ఛారణలోని ధ్వని ఉత్పత్తి మార్పుతో అది దోమలపెంటగా నామ రూపాంతరం చెందింది. అట్లాగే దీనికి ఆనుకొనే ఉన్న ఎలగుంతల పెంట నాగరిక మానవ సాంగత్యంతో ఈగలపెంటగా మారినట్టు చెంచు జనపదంలో ఉన్నది. కృష్ణా నదిలో పట్టిన చేపలు ఎలగుంతలపెంటలోనే విక్రయాలు జరిగేవి. చేపల వాసనకు ఈగలు ముసిరేవట. అట్లా ఎలగుంతలపెంట ఈగలపెంటగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
తెలుగు రాష్ర్టాల్లో విస్తరించిన నల్లమలలో 338 చెంచు పెంటలు, వేరుబడ్డ తెలంగాణలో 169 పెంటలున్నాయి. కానీ, పాలకుల దృష్టి నాలుగు పెంటల మీద పడటానికి బలమైన కారణం ఉన్నది. శ్రీశైల యాత్ర స్థలంలో ఉన్న ఈ పెంటలు చెంచు అస్తిత్వపు పునాదులు. చెంచుల ఉనికి బయటి ప్రపంచానికి తెలియజెప్పే దీపస్తంభాలు.
దేశం నలుమూలల నుంచి వచ్చే తీర్థవాసీలు, దేశ దేశాల నుంచి అరుదెంచు ప్రవాసీలు ఈ మూడు పెంటలను దాటిపోయే మల్లన్న దర్శనం చేసుకోవాలి. ఆ సందర్భంలో ఆకర్షణ స్వభావంతో ఉన్న ‘పెంట’ అనే పేరు మీదికి దృష్టివెళ్లడం, చర్చ జరగటం, చెంచుల ఉనికి, జీవన గతులు, బహుళజాతి సంస్థల ప్రయత్నాలు, పాలకుల కుట్రలు బహిర్గతం కావటం అతి సాధారణ చర్య. అట్లా నల్లమల చెంచు అస్తిత్వం విశ్వవ్యాప్తమైంది. వారిమీద అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు జరిగాయి. స్వచ్ఛంద సంస్థలు తరలివచ్చాయి. ఆపద వచ్చినప్పుడు వారికి ప్రజా సంఘాలు తోడు నిలబడ్డాయి.
నల్లమలలో లక్ష ఎకరాల సాగు భూమి ఉన్నదని, ఈ భూమిని అభివృద్ధి చేసి చెంచులను వ్యవసాయం వైపు మళ్లించాలని 1941లో లండన్ వర్సిటీకి చెందిన మనూజ శాస్త్ర ఆచార్యుడు, సామాజిక శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ ప్రతిపాదించారు. చెంచులు వ్యవసాయ మెళకువలు నేర్చుకొని, వ్యవసాయం మీద పట్టు సాధించేవరకు నల్లమల అటవీ భూములను పశువుల మేతకు కేటాయించి, చెంచులను పశువుల కాపరులను చేయాలని సూచించారు. హైమన్‌డార్ఫ్ సూచనను నిజాం స్టేట్ 1942 మార్చి 1న ఆమోదించింది. అడవి మధ్యలోని మైదాన భూములను చెంచులకు రిజర్వ్ చేస్తూ ఫర్మానా జారీచేసింది. ఈ ఉత్తర్వులతో సాగుకు అనుకూలంగా ఉన్న లక్ష ఎకరాల భూమి చెంచుల అధీనంలోకి వెళ్లిపోయింది. ఇదంతా అడవి నుంచి చెంచులను తరలించే పాలకుల ఆలోచనలకు విఘాతం కలిగించింది.
అయినా.. ఆదివాసీ చెంచుల మీద రాజ్యం ఆగి ఆగి దాడులు చేస్తూనే ఉన్నది. ప్రజలను, ప్రజా సంఘాలను ఏమార్చే ఎత్తుగడలు వేస్తూనే ఉన్నది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది. మొదట పోలీసు బలగాలు అడవిలోకి చొరబడ్డాయి. అన్నలు, ఆదివాసీల హననం జరిగిపోయింది. తర్వాత పులుల సంరక్షణ కోసమంటూ చెంచుల వెంట పడ్డారు. మూడో దశలో బహుళజాతి కంపెనీల హెలికాప్టర్లు అడవి మీద ఎగిరాయి. కింది నుంచి బోరు మిషన్లు అడవిలోకి చొరబడ్డాయి. అగో.. అప్పుడు కానీ పాలకవర్గాల మర్మం బయటపడలేదు. డిబీర్స్ కంపెనీ హెలికాప్టర్లు వజ్రాల శోధన, మరో బహుళజాతి బోరు మిషన్లు యురేనియం ఖనిజ నిక్షేపాల పరిశోధన కోసమే ఈ విధ్వంసం అని.
ఇప్పుడూ అటువంటి కుట్రే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. చెంచులు అనే భావాన్ని సమాజ దృష్టి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నది. చెంచులు, వారి జీవనగతుల మీద చర్చకు అవకాశం లేకుండా పెంటల పేర్లు తొలగిస్తున్నది. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భుజం మీద తుపాకీ పెట్టి చెంచుల అస్తిత్వాన్ని కాల్చి పారేస్తున్నది. దోమలపెంట, ఈగలపెంట, సుండిపెంట, సదరంపెంట పేర్లు మార్చటం ద్వారా చెంచుల అస్తిత్వాన్ని సజీవ సమాధి చేస్తున్నది. పుట్టిన చోటనే చెంచులను పరాయిలను చేయటమే కాదు, ఇప్పుడక్కడ చెంచులే లేకుండా చేశారు. చెంచేతర జనులను నింపేశారు.
పెంట అంటేనే హీనభావం చొప్పించారు. పెంట అంటే ఆయా పెంటల జనులకు అప్రతిష్టగా ఉన్నదని, పెంట పేరు బయటికి ఉచ్ఛరించాలంటేనే నీచం అనిపిస్తుందనే వినతులు స్వీకరించారు. ఇదే ప్రాతిపదికన
రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సాధికారికంగా పెంటల పేర్లు తొలగిస్తున్నారు.
మరోవైపు పట్టాభూముల్లో సేద్యాన్ని నిర్మూలిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం కింద చెంచులకు 7,380 ఎకరాల్లో పట్టా ఉన్నది. తెలంగాణలో ఇది 2 వేల ఎకరాల పైచిలుకు ఉన్నది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మరో 1,000 ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. కోర్ ఏరియాలో ఉన్న పట్టా భూముల సాగును అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్ లాంటి యంత్రాలతో భూమి దున్నుకోవటానికి అటవీ అధికారులు అనుమతించటం లేదు. ఎడ్లతోనే భూమి దున్నుకోవాలనే షరతులు పెట్టారు.
ఎడ్ల కొనుగోలు సామర్థ్యం లేక భూమి పడావు పడుతున్నది. తుప్పలు, పొదలు పెరుగుతున్నాయి. మరో రెండేండ్లు గడిస్తే చెట్లు విస్తరించే అవకాశం ఉన్నది. అప్పుడు అటవీ శాఖ ఆయా భూములను స్క్రబ్ అడవులుగా డిక్లేర్ చేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది. అటవీ శాఖ ఉద్దేశ్యం కూడా అదే. పోడు భూముల్లో, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పనిదినాలు కల్పించాలని, కనీసం 15 రోజుల పని దినాల కూలీ అడ్వాన్స్‌గా ఇవ్వాలని గిరిజన చట్టాలు చెప్తున్నాయి. కానీ, పాలకులు చెంచులకు ఉపాధిహామీని నిలిపివేశారు.
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ)ను దశలవారీగా నిర్వీర్యం చేస్తున్నారు. నల్లమల చెంచుల కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ అవసాన దశలో ఉన్నది. అటవీ అధికారికే బాధ్యతలు అప్పజెప్పారు. చెంచులది గాజు తెరల వెనుక జీవితం. రాష్ట్ర ప్రభుత్వాలే వారిని అర్థం చేసుకోవాలి. ఐటీడీఏకు పునర్జీవం పోయాలి. చెంచు జన జాతులకు అండగా నిలబడాలి. నామ సంస్కరణ తప్పు కాదు. కానీ, చెంచుల అస్తిత్వం, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పేర్ల మీద పునరాలోచన చేయాలని ఆశిద్దాం.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు