కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకులాలను వెయ్యికిపైగా పెంచింది. అంతేకాదు, మైనారిటీల కోసం 200కు పైగా గురుకులాలను స్థాపించి వర్గం విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషిచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో కొత్త పోస్టులను మంజూరుచేసి పటిష్ఠం చేసింది.
గత పదేండ్లుగా గురుకులాల్లో చదివిన విద్యా ర్థులు ఇప్పుడు ఐఐటీయన్లుగా, డాక్టర్లుగా ఎదిగారు. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ రీత్యా చాలామంది విదేశాలకు వెళ్లడం కూడా మనకు అనుభవమే. గురుకుల విద్య కారణంగా అనేక కుటుంబా ల్లో మొదటితరం విద్యార్థులు పైలట్లుగా, సైనికాధికారులుగా రాణిస్తుండటం విశేషం. కేసీఆర్ దూరదృష్టే వారిని ఆ స్థాయికి చేర్చింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి అణగారినవర్గాల కోసం 50కి పైగా డిగ్రీ కళాశాలలను నెలకొల్పిన కేసీఆర్ సర్కార్ వేల మం దిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. పేదలకు అందని ద్రాక్షగా ఉన్న న్యాయవిద్యను సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదలు న్యాయమూర్తులు అవ్వాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ న్యాయ కళాశాలను ఏర్పాటు చేయటం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం.
కేసీఆర్ హయాంలో గురుకులాల్లో అడ్మిషన్లకు ఎంతో డిమాండ్ ఉండేది. నాడు సంక్షేమ గురుకులాలు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాయి. దశాబ్ద కాలంలో గురుకులాలు ఎంతో వైభవానికి నోచుకుని, ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఇది గురుకులాలపై కేసీఆర్ వేసిన చెరగని ముద్ర.
కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ కన్నా ఉన్నత స్థితిలో ఉన్న గురుకులాలు నేడు అగాథంలోకి కూరుకుపోయాయి. సంబంధిత మంత్రులు లేకపోవడంతో వాటి ఆలనాపాలనా కరువైంది. అందుకే ఏడాదిలో దాదాపు 50 మంది విద్యార్థులు మరణించారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి, అసమర్థతకు ఇది నిదర్శనం. వరుస మరణాలు ఇటు తల్లిదండ్రులను, అటు విద్యార్థులను కలచివేస్తున్నాయి. సహచరులు తనువు చాలిస్తుండటంతో విద్యార్థులు కూడా మానసికంగా కుంగిపోతున్నారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో ఏదో ఒక పాఠశాలలో, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవడం, విద్యార్థులు రోడ్లెక్కడం ఆనవాయితీగా మారింది. ఉస్మానియా, కాకతీయ హాస్టళ్లలోనూ ఇదే తంతు. ఈ సంఘటనలపై ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న సమాధానాలు, చేస్తున్న ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయి. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా అర్థమవుతున్నది. అందుకే వారు ‘గురుకులాలకు రేవం త్ గ్రహణం పట్టింద’ని వాపోతున్నారు.
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పర్యటనల్లో భాగంగా పాఠశాలలు, హాస్టళ్లలో శుభ్రత పాటించకపోవడాన్ని గుర్తించి, అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ‘ఆడ లేక మద్దెల ఓడు’ అన్నట్టు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నిందించడం నిర్హేతుకం. ఇది విద్వేషంతో కూడి విష ప్రచారమే.
ఇప్పటికైనా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను గుర్తించాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దాలి. గత కేసీఆర్ ప్రభుత్వంపై విద్వేషపూరిత ప్రసంగాలు, విష ప్రచారాలను మానుకొని, గురుకులాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వ హయాంలో పేరు ప్రఖ్యాతులు గడించిన గురుకులాలను మరింత బలోపేతం చేయాలి. 400 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఇన్ని సమస్యలు వస్తుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట ఒకేచోట 2,500 మంది విద్యార్థులకు మూడు పూటలా ఆరోగ్యకరమైన భోజనం అందించడం ఎం త కష్టమో గుర్తెరగాలి. గత ప్రభుత్వంపై అక్కసుతో గురుకుల విద్యను నీరుగారుస్తూ ఆర్భాటంగా మొదలుపెడుతున్న సమీకృత గురుకుల పాఠశాలలు మరిన్ని సమస్యలకు నిలయాలుగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి, వాటిపై కోట్ల రూపాయలు వెచ్చించడం కన్నా, ఉన్న గురుకులాలను బాగు చేసుకోవడమే మంచిది. ఆ సొమ్ముతో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన, ఉచిత విద్య ను బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు అందించవచ్చు. తద్వారా గురుకులాలకు పూర్వ వైభవం సం తరించుకుంటుంది.
– శ్రీశ్రీ కుమార్