ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యరంగానికి పూర్తిస్థాయిలో జవసత్వాలను రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చుతున్నది. ఐదేండ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఆ రంగంలో స్వయం సమృద్ధి, స్వావలంబనకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. 2016-17లో ప్రారంభించిన ‘చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం’ ద్వారా గడిచిన ఐదేండ్లలో 15 లక్షల మెట్రిక్ టన్నుల చేపలను ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా చెరువు వద్ద అమ్మకాలు, రీటైల్ అమ్మకాలతో రూ.30 వేల కోట్ల విలువైన ఆదాయం మత్స్యకార కుటుంబాలకు దక్కడం విశేషం.
చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం’ ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటుగా ఆ రంగం మీద ఆధారపడిన లక్షలాది మత్స్యకారుల జీవన ప్రమాణాలలోనూ అభివృద్ధి కనిపిస్తున్నది. చేపల వినియోగం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. గడచిన ఐదేండ్లకు సంబంధించిన అభివృద్ధి సూచికలు కూడా ఈ రంగంలోని ఆశావహ పరిణామాలను ధ్రువీకరిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాలు ఇందుకు ప్రధాన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా కొత్తగా ఉనికిలోకి వచ్చిన నీటివనరులు తెలంగాణ మత్స్యరంగంలో బహుముఖాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లుగా రానున్న ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో మత్స్యరంగం 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యం కాదని అర్థమవుతున్నది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రయోగాత్మకంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి, ఐదేండ్లుగా నిరాటంకంగా ‘చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం’ను అమలుపరుస్తున్నది. దీనిద్వారా అద్భుతఫలితాలను సాధించడమేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ మత్స్యకారుల్లో వృత్తిపట్ల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నది. మత్స్యసహకార సంఘాల్లో సభ్యత్వం పొందేందుకు పెరుగుతున్న పోటీ ఇందుకు ఒక సూచీ గా చెప్పవచ్చు. ఈ పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో సుమారు 4 వేల నీటివనరుల్లో 28కోట్ల చేపపిల్లలను వదిలారు. దీంతో దాదాపు రూ.1,356కోట్ల విలువైన రెండులక్షల
మెట్రిక్ టన్నుల చేపలను ఉత్పత్తి చేశారు. కాళేశ్వరం తదితర నీటిపారుదల ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో 2019-20లో ప్రభుత్వం చెరువులు నింపింది. 15,715 చెరువుల్లో 47కోట్ల చేపపిల్లలను వదిలి, మూడు లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయగలిగారు. తద్వారా మత్స్యకారసొసైటీలకు సుమారు రూ. 2,699కోట్ల ఆదాయం వచ్చింది.
గత ఏడాది 17,684 చెరువుల్లో రూ.52కోట్లతో 67 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలి, 3,37,117 మెట్రిక్ టన్నుల చేపలను ఉత్పిత్తి చేయగలిగాము. రూ.4,845కోట్ల ఆదాయాన్ని పొందగలిగాం. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఇప్పటికే గుర్తించిన 28,704 చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల్లో కలిపి సుమారు వందకోట్ల రూపాయలతో దాదాపు 90 కోట్ల చేపపిల్లలను సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. గతంలో ఉప్పునీటి వనరుల్లో మాత్రమే సాధ్యమనుకున్న రొయ్య ల పెంపకాన్ని తెలంగాణలోని స్వచ్ఛమైన జలవనరుల్లో సైతం సాధించవచ్చునని రాష్ట్ర మత్స్యశాఖ నిరూపించింది. 2017-18లో నిర్వహించిన ప్రయోగాత్మక నీలకంఠ రొయ్యల పెంపకం విజయవంతం కావడంతో గడచిన నాలుగేండ్లుగా ఈ కార్యక్రమాన్ని సైతం కొనసాగిస్తున్నారు.
చేపల పెంపకం, అమ్మకంలో మధ్యదళారీ వ్యవస్థతో చెరువుల్లో ఉత్పత్తి చేసిన చేపలకు కిలోకు కేవలం రూ.10 నుంచి రూ.20లకు అమ్ముకున్న మత్స్యకారులు, ప్రస్తుతం సగటున కిలో రూ.70 నుంచి రూ. 90 వరకు అమ్ముకోగలుగుతున్నారు. అంతేకాకుండా గతంలో చేపలను మధ్యదళారీలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జించేవారు.
ఈ కారణంగా ఇక్కడి చేపలు ఈ ప్రాంతం ప్రజలకు అందుబాటులో లేక సముద్రప్రాంతాలకు చెందిన చేపలను దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మేవారు. కానీ, ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం’ ఫలితంగా ఇక్కడి చేపలు ఇక్కడి ప్రజలకు ఆహారంగా అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రారంభంలో పదకొండు జలవనరుల్లో మాత్రమే నిర్వహించిన మంచినీటి రొయ్యల పెంపకాన్ని ఈ సంవత్సరం 81 రిజర్వాయర్లతో కలుపుకుని మొత్తం 200 నీటివనరుల్లో నిర్వహించాలని మత్స్యశాఖ నిర్ణయించింది. 2017-18 నుంచి 2020-21 మధ్యకాలంలో రూ.22కోట్ల 65లక్షల వ్యయంతో సుమారు 12కోట్ల రొయ్యపిల్లలను నీటివనరుల్లో వదిలారు. దీని ద్వారా రూ.1050 కోట్ల విలువైన 40వేల మెట్రిక్ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేయగలిగాం. రాష్ట్రంలోని మంచినీటి జలవనరుల్లో రొయ్యల పెంప కంలో గడిచిన నాలుగేండ్లుగా చేస్తున్న ప్రయోగాలు మంచి ఫలితాలను సాధిస్తుండటంతో ప్రస్తుత సీజన్లో సుమారు రూ.25 కోట్లతో కనీసం 10కోట్ల రొయ్యపిల్లలను పెంచాలని నిర్ణయించారు. ఐదేండ్లుగా అమలుచేస్తున్న ‘చేప పిల్లల పంపిణీ పథకం’ రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, మత్స్యకారుల ఆదాయాలను కూడా గణనీయంగా పెంచగలిగింది. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులు, చిరువ్యాపారులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ‘చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం’ కోసం ప్రభుత్వం మొత్తం ఖర్చు చేసింది రూ.208 కోట్ల 44లక్షలైతే, దీంతో 30వేల కోట్ల భారీ ఆదాయం వచ్చింది. ఇదంతా వృత్తిమీద ఆధారపడిన వారికే దక్కడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ‘నీలి విప్లవం’.!
(వ్యాసకర్త తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)
రంగనాయక సాగర్లో రేపు 6వ విడతగా చేప పిల్లలు వేస్తున్న సందర్భంగా..
పిట్టల రవీందర్