ఐదు దశాబ్దాల కిందట అనంతుల మదన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి దశ ఉద్యమం గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1968-69లో ఆయన తొలి తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారనే విషయాన్ని నేటి యువత తెలుసుకోవాలి. మదన్ మోహన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ గడ్డ స్మరించుకోవాలి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన అనంతుల మదన్ మోహన్ 1932, నవంబర్ 16న జన్మించారు. మదన్ మోహన్ తండ్రి చక్రపాణి నిజాం హయాంలో కరీంనగర్ జిల్లాలో నాయబ్ తహశీల్దార్‌గా (డిప్యూటీ ఎమ్మార్వో) పనిచేశారు. కొండపాకలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన మదన్ మోహన్, వరంగల్‌లో మెట్రిక్యూలేషన్, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ, ఓయూలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 1955-1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యేసరికి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ సమకాలీన రాజకీయాలను అధ్యయనం చేస్తుండేవారు.
అయితే, 1956 నవంబర్ 1న నాటి నెహ్రూ ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంలో కలిపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు నాటి సీమాంధ్ర పాలకులు. తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురవడంతో తెలంగాణలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేధావులు, యువకులు, సామాజిక కార్యకర్తల నేతృత్వంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) ఏర్పడింది. యువకుడు, విద్యావంతుడు, మేధావి, న్యాయవాది అయిన అనంతుల మదన్ మోహన్ టీపీఎస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.
ఏప్రిల్ 5న సికింద్రాబాద్‌లో రాష్ట్ర సమైక్యతను కోరుకుంటూనే తెలంగాణకు రక్షణ ఇవ్వాలని బహిరంగసభ నడిపిన కమ్యూనిస్టులకు, తెలంగాణవాదులకు (టీపీఎస్) మధ్య గొడవ జరిగింది. మదన్‌మోహన్‌తోపాటు నాటి విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణవాదుల అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 11న హైదరాబాద్‌లో సామూహిక సత్యాగ్రహం జరిగింది. మరోవైపు శాసనసభ్యుడిగా చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన ఆర్నెళ్ల పాటు పోటీ చేయకూడదని 1968 ఏప్రిల్ 26న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటికే మదన్మోహన్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమం సమర్థంగా నడుస్తున్నది. కానీ, ఆ ఉద్యమానికి చెన్నారెడ్డి నాయకత్వం వహించాలన్న ఒక వర్గం కుట్రల ఫలితంగా మదన్ మోహన్ టీపీఎస్ పగ్గాలను వదులుకున్నారు.
1969లో టీపీఎస్ నేతృత్వంలో ఉద్యమం ఉధృతం కాగా, పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థులు చనిపోయారు. దీంతో ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత 1970లో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి మదన్మోహన్ 20 వేల మెజారిటీతో, ఖైరతాబాద్ నుంచి నాగం కృష్ణారావు 15 వేల మెజారిటీతో గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం సాధించగలమనే నమ్మకాన్ని టీపీఎస్‌కు ఈ విజయం అందించింది. ఆ తర్వాత మదన్మోహన్ 1971 నుంచి 1985 వరకు వరుస గా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, భవనం వెంకట్రామ్, టి.అం జయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిల హయాంలో మద న్ మోహన్ వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించా రు.
మదన్ మోహన్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌లో జేఎన్టీయూ స్థాపితమైంది. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌సీలు) ఏర్పడ్డాయి. అంతేకాదు, దాదాపు 10 నుంచి 12 వేల మందికి ఆయన వివిధ శాఖల్లో కొలువులు ఇప్పించారు. సిద్దిపేటలో 220 కేవీ సబ్‌స్టేషన్, టీవీ రిలే స్టేష న్, నెహ్రూ యువ కేంద్రాలు, మిల్కీ చిల్లీ సెంటర్, ఇందిరా మహిళా డిగ్రీ కాలేజీలను ఆయన ఏర్పాటు చేశారని సిద్దిపేట ప్రాంతవాసులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. కొండాపూర్ పీహెచ్‌సీకి తన తండ్రి స్మారకంగా రెండెకరాల భూమిని ఆయన విరాళంగా ఇచ్చా రు. 1990లో ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గా, 1989లో పీసీసీ జనరల్ సెక్రెటరీగా, ఏఐసీసీ మెంబర్‌గా (శాశ్వత ఆహ్వానితుడిగా) సేవలందించా రు. 1994లో చివరిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1998లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర స్టేట్ ఇంచార్జిగా పనిచేశారు.
రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించిన మదన్మోహన్ 2004, నవంబర్ 1న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టం. ఆ పోరాటంలో 369 మంది యువకులు, తొలి తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో క్రియాశీల నాయకుడైన మదన్ మోహన్ నిత్య స్మరణీయులు.
నాడు ఉద్యమాన్ని నడిపించిన నేతలు, యువకులు, విద్యార్థులే ఆ తర్వాతి కాలంలో దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఆ పోరాటం భవిష్యత్తు కొనసాగింపునకు, స్వరాష్ట్ర కల సాకారమయ్యేందుకు భూమికగా నిలిచింది. అది విస్మృత చరిత్ర కాదు. ఆ చరిత్రను నేడు మనందరం మననం చేసుకోవాలి. (మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చేతుల మీదుగా తొలి తెలంగాణ ఉద్యమ నేత మదన్ మోహన్ విగ్రహావిష్కరణ నేడు జరుగుతున్న సందర్భంగా..)
-వెంకటకిషన్ ఇట్యాల ,99081 98484