రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అనుభవించిన ఈ బాధలు మళ్లీ ఇప్పుడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పునరావృతమయ్యాయి. సర్కారు చేతులెత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడచూసినా అన్నదాతల చెప్పులు, పాస్ పుస్తకాల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సరిపడా యూరియా లేదని చెబుతూ అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది.
మన దేశంలో 95 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వీరిపై అధిక భారం పడకుండా ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందించాలి. కానీ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. కొన్నేండ్లుగా దేశంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వాణిజ్య పంటల సాగు కూడా ఎక్కువ అయ్యింది. దాంతో రసాయన ఎరువుల వాడకం గణనీయంగా పెరిగింది. సేంద్రియ సాగును ప్రోత్సహించడంలో భాగంగా పీఎం ప్రణామ్ పథకాన్ని తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ఇచ్చే రాయితీలను క్రమంగా ఎత్తివేస్తున్నది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై రూ.2.54 లక్షల కోట్లు సబ్సిడీ ఉండగా, తర్వాతి ఆర్థిక సంవత్సరంలో దాన్ని రూ.1.75 లక్షల కోట్లకు తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25 శాతం కోత విధించింది. గత యాసంగి పంట సీజన్‌కు సంబంధించి నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి ఎరువుల సబ్సిడీ కింద రూ.51,875 కోట్లను కేంద్రం కేటాయించగా, ఈసారి రూ.22,303 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే 57 శాతం కోత విధించింది. ఈ క్రమంలోనే రాష్ర్టాలకు ఎరువుల సరఫరాను కూడా కేంద్రం తగ్గించింది. అంతేకాదు, వాడకం ఎంత తగ్గిస్తే అంత ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇస్తామని, ఆ మేరకు సబ్సిడీ మొత్తాన్ని ఇతర అవసరాలకు కేటాయిస్తామని ఆశచూపడంతో రాష్ర్టాలు కిక్కురుమనడం లేదు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఇంధన ధరలు అంతర్జాతీయంగా గణనీయంగా తగ్గాయి. టన్ను యూరియా ధర గతేడాది 627 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 330 డాలర్లకు పడిపోయింది. అదే విధంగా డీఏపీ ధర 925 డాలర్ల నుంచి 540 డాలర్లకు తగ్గింది. ఫాస్పారిక్ యాసిడ్, అమ్మోనియా ధరలు ఏడాది వ్యవధిలో 35 శాతం వరకు తగ్గాయి.
అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గాయన్న విషయాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నది. పైగా రికార్డు స్థాయిలో ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ భారాన్ని రైతులపై మోపడం లేదని అబద్ధాలు వల్లె వేస్తున్నది. వాస్తవానికి, ధరలు తగ్గడం వల్ల కలిగే లబ్ధి రైతులకు చేరకుండా కేంద్రం మోసం చేస్తున్నది. రైతులకు చేరాల్సిన ఆర్థిక ప్రయోజనం కేంద్ర ఖజానాకు మళ్లుతున్నది.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు భిన్నం. ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. సాగు రెట్టింపైనా, ఎరువుల వినియోగం రెండింతలైనా ఎక్కడా కొరత లేకుండా చూసుకున్నారు. సీజన్‌కు ముందే ఎరువులను తెప్పించి, వానలు కురవగానే రైతులకు అందించారు. ఎరువులను, విత్తనాలను సకాలంలో అందించి రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలిచారు.
కేసీఆర్ సర్కారు వ్యవసాయ సంక్షేమ చర్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు, భూగర్భ జలాలు పెరగడం తదితర కారణాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. దాంతో ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు, ఎరువుల షాపుల ముందు క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఎరువుల అవసరాలకు, వాస్తవ పంపిణీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. అయితే ప్రభు త్వం బఫర్‌స్టాక్‌ను 3 లక్షల టన్నులకు తగ్గించినట్టు సమాచారం. ఈ ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఉంటే రైతులకు ఇబ్బంది వచ్చేది కాదు. అయితే, కేంద్రం చెప్తున్నట్టు ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం అంత సులువు కాదు.
సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రం ఎరువులను సప్లయ్ చేయడం లేదు. దీంతో ప్రైవేటు డీలర్లను ఆశ్రయించి రైతులు నష్టపోతున్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ డీలర్లు జింక్ లేదా ఇతర రసాయనాలు కొంటేనే యూరియా ఇస్తామని పేచీ పెడుతున్నారు. లేకపోతే ఎక్కువ ధరకు యూరియాను మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టి ఎరువుల కొరతను తీర్చి రైతులను ఆదుకోవాలి.
వ్యాసకర్త: సామాజికవేత్త, విశ్లేషకులు డాక్టర్ మోటె చిరంజీవి ,99491 94327