గత రెండేండ్లుగా తెలంగాణలోని రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో దాదాపు 793 మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజూ తెలంగాణలోని ఏదో ఒక మూలన రైతులు ఆత్మహత్యకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. తెలంగాణ తొలిముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతుల సంక్షేమం కోసం, వారిని దేశంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టడం కోసం అనేకమంది రైతు నిపుణులతో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకున్నారు. రైతులకు రుణవిముక్తి కల్పించడం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధును (వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం) రైతుల అప్పుల భారాన్ని తగ్గించి, పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ పథకం అమల్లో విజయవంతం కావడంతోపాటు స్వల్ప కాలంలోనే ప్రపంచదేశాల దృష్టిని, ఎంతోమంది ఆదరాభిమానాలను చూరగొన్నది. ఐక్యరాజ్యసమితి ప్రశంసలను సైతం పొందింది. ఇలాంటి పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. వ్యవసాయ సంక్షోభానికి రైతు బంధు పథకం సరైన పరిష్కార మార్గమని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు కూడా గుర్తించారు. ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొనే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం తీసుకొచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతుబంధు పథకం పేరును తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు భరోసాగా మార్చి పెట్టారు. ఎకరాకు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత ఆ మాట మార్చారు. రైతులకు భరోసా లేకుండా చేశారు. ఈ రెండేండ్ల పాలనలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు సరికదా రైతు భరోసాలో కోతలు పెట్టారు. రెండేండ్లలో నాలుగు దఫాలుగా రావలసిన డబ్బులు సరిగా రైతు ఖాతాలో జమ చేయలేదు.
కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎన్నికలు వస్తేనే రైతులు గుర్తొస్తారు. రైతు భరోసా గుర్తొస్తుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల కంటే ముందు రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని నానా హడావుడి చేశారు. కానీ డబ్బులు వేయలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా రైతు భరోసా ఊసే లేదు. రేవంత్‌రెడ్డికి రైతు సంక్షేమం కంటే రాజకీయాలు, ఓట్లే ముఖ్యం. ఇవాళ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బుల కోసం రైతన్నలు ఎదురుచూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ రెండేండ్ల పాలనలో రైతుల సంక్షేమం కోసం ఏ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు.