ఉమ్మడి పాలనలో పంటలు ఎండిపోయి, అప్పులపాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇప్పుడు తెలంగాణ గడ్డపై అప్పు మాఫీ కాలేదని రైతు ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. రైతుల్లో పంట రుణమాఫీ ఆశలు రేపిన ప్రస్తుత ప్రభుత్వం ఒక అమాయకుడి చావుకు కారణమైంది. రుణమాఫీ వైఫల్యానికి ఈ మరణం తాజా తార్కాణం. రైతు తన సూసైడ్ నోట్లో ‘బ్యాంకులో రుణమాఫీ కానందుకు ఆత్మహత్య’ అని స్పష్టంగా రాశాడు.
తల్లి కొడుకులు విడివిడిగా బ్యాంకు అప్పు తీసుకున్నారు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరి పేర్లున్నా ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు. తన రేషన్ కార్డులో తల్లి పేరు ఉన్నందువల్లే తనకు మాఫీ లభించలేదని ఆయన బాధపడ్డాడు. ఇక వచ్చే అవకాశం లేదని తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ ఆత్మాహుతి పట్ల ప్రభుత్వం కనీసం సానుభూతి ప్రకటించిన దాఖలాల్లేవు.
గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి ఒకే విడతగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏప్రిల్ 15 నాడు ప్రకటించారు. అదే గనుక జరిగితే ‘తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీలో నిలబడను’ అని బీఆర్ఎస్ నేత హరీష్రావు సవాల్ విసిరారు. దాంతో రుణమాఫీ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైంది. నిజానికి హరీష్రావు ఈ మాట అని ఉండకపోతే ‘రైతు భరోసా’ లాగే రుణమాఫీ పట్ల కూడా వాయిదాల పర్వమే కొనసాగేది. మొత్తానికి ఏదో ఒత్తిడి కారణంగా రుణమాఫీ తెరపైకి వచ్చింది. బ్యాంకుల నిర్వహణా కార్యాలయాల నుంచి పంట రుణ బకాయిల లెక్కలు తీసుకున్నారు. రైతులు బ్యాంకులకు చెల్లించవలసింది రూ.41 వేల కోట్లు అని చెప్పారు. అంతకాదు రూ.39 వేల కోట్లేనని సర్ది చెప్పారు.
చివరికి రూ.31 వేల కోట్ల మీద నిలబడ్డారు. జూలై 19 నాడు మొదలైన మాఫీ సొమ్ము విడుదల మూడు విడతలుగా ఆగస్టు 15 నాటికి పూర్తయింది. ప్రతిసారి ‘32.5 లక్షల రైతులకు రూ.31వేల కోట్ల రుణ మాఫీ’ అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇప్పటివరకు విడుదల చేసిన సొమ్ము మాత్రం రూ.18 వేల కోట్లు మాత్రమే. అంటే ఇంకా 40 శాతం సొమ్ము పంచవలసే ఉన్నది. రూ.2 లక్షలపైన ఉన్న బకాయిని రైతు స్వయంగా చెల్లించిన తర్వాతే మాఫీ సొమ్ము ఖాతాలో జమవుతుందనే మెలిక ఎందుకో అర్థం కాదు. వ్యవసాయమంత్రి ఎప్పుడు మాట్లాడినా 22 లక్షల మందికి ఒకే విడతలో రూ.18 వేల కోట్లు జమ చేశాం. అయితే వివిధ కారణాల వల్ల కొందరి రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. సక్రమంగా వారి ఖాతాల్లోకి బదలాయించేలా చర్యలు చేపట్టామని చెప్తున్నారు.
రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు, ఉద్యోగులే ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని అంటున్నారు. కుటుం బ నిర్దారణ కాని ప్రతి ఒక్కరి నుంచి సమాచారం తీసుకొని, వాటిని సరిదిద్దేలా చూస్తున్నాం. ఇప్పటికి 2.65 లక్షల మంది వివరాలు సేకరించామన్నారు. ఈ తతంగమంతా ఎప్పుడు పూర్తవుతుందో, సర్కార్ ఇవ్వాలనుకున్న రైతులకైనా లాభం కలుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఎటుతిరిగి రూ.18 వేల కోట్ల గురించి తప్ప మంత్రిగారు మరో మాట ఎత్తడం లేదు. రూ.31 వేల కోట్లలో మిగిలిన రూ.13 కోట్లు ఎప్పుడు, ఎవరి ఖాతాల్లో వేస్తారో చెప్పడం లేదు.
మాఫీ రూ.31 వేల కోట్లు చేశామని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో స్పష్టత లేదు. బ్యాంకులు ఇచ్చిన వివరాల ప్రకారం అంత మొత్తం అవసరమవుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ వివరాలను దాచిపెడుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీల ప్రకారం బ్యాంకులు అందించిన రైతుల పేర్లు, బకాయిలు బయటపెట్టాలి.
రుణమాఫీ రూ.31 వేల కోట్లు చేశామని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో స్పష్టత లేదు. బ్యాంకులు ఇచ్చిన వివరాల ప్రకారం అంత మొత్తం అవసరమవుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ వివరాలను దాచిపెడుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీల ప్రకారం బ్యాంకులు అందించిన రైతుల పేర్లు, వారి బకాయిలు ప్రభుత్వం బయటపెట్టాలి.
అప్పుడే న్యాయంగా రుణమాఫీ రావలసిన రైతుల వివరాలు తెలుస్తాయి. బ్యాంకుల వారీగా ఆ సొమ్మును విడుదల చేస్తే రైతు ఖాతాల్లో జమవుతాయి. కుటుంబానికి ఒకరికే, రేషన్ కార్డులో ఒక పేరుకే, పింఛన్ వస్తే కట్, రేషన్ కార్డులో ఉద్యోగి ఉంటే ‘నో’ అనే దాపరికపు అడ్డంకుల వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయి. విడుదల చేసిన సొమ్ములో కూడా వందల కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరడం లేదు. ఎంత మిగిలితే అంత లాభం అన్నట్లుగా రోజుకో పిట్టకథ చెప్తూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రూ.18 వేల కోట్లు కూడా రైతులకు దక్కేట్లు లేదు.
రుణమాఫీ 60 శాతం మాత్రమే అయింది. అందరికి అందేలా రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ బాధితుల కోసం ఒక ఫోన్ నంబర్ ప్రకటించింది. చాలా కాల్స్ వచ్చాయన్నారు. ఆందోళనకు దిగుతామని కూడా అన్నారు. ఇంతవరకు దాని ఊసు లేదు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఖమ్మం జిల్లాలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఓ డ్రామా లాంటి ధర్నా చేపట్టారు. మంత్రి తుమ్మల వచ్చి ఏదో హామీ ఇవ్వగానే జెండాలు దించేశారు. రైతు ఆత్మహత్య పట్ల తన వేదనను ప్రకటించిన హరీష్రావు మాటలు రైతులను రెచ్చగొట్టేలా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పోలీసుల దాకా వెళ్లాయి. రుణమాఫీ బూటకంపై ఎవరు నోరెత్తినా ఊరుకొనేది లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
రాహుల్ని రప్పించి రైతు డిక్లరేషన్ వేదికపై వరంగల్లో ‘రుణమాఫీ విజయయాత్ర’ ఏర్పాటుచేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. అరకొర మాఫీతో పార్టీ పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఆయన దాకా వెళ్లి ఉండవచ్చు. మాఫీ కోసం కేటాయించిన రూ.31 వేల కోట్ల లెక్క తేల్చాలని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది.
– బి నర్సన్ 94401 28169