సాగు తప్ప మరేమీ రాని అమాయకం ఒకవైపు, వాగుడు తప్ప మరేమీ రాని మాయకత్వం మరోవైపు. సాలంతా కష్టాలు వాళ్లవి, సీజనల్‌గా తప్పించుకొని తిరిగే తీరు వీళ్లవి. ఆకలి తీర్చేందుకు తీవ్ర ఆత్రుతతో కడుపు కట్టుకునే దైన్యం అతడిది, అక్కర కోసం అడ్డూఅదుపూ లేకుండా పోజులు కొట్టి గట్టెక్కే ఆరాటం ఇతడిది. ఐదు వేళ్లు నోట్లోకి పంపడానికి నిత్యం పోరాటం చేసే కర్షకుడిని తరతరాలుగా ‘మద్దతు ధర’ అంటూ ఊరిస్తూ, ఆఖరికి మద్దతివ్వకుండా ఆటపటిస్తున్న కాంగ్రెస్ నేతల కుటిలం పై‘చేయి’ సాధిస్తూనే ఉన్నది.
అటు సాగును వదులుకోలేక.. ఇటు చేసే దేం లేక ఆఖరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న వైకుంఠపాళిలో పాముకు బలవుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్న అన్నం దొరకని అన్నదాత తీరు దయనీయం. తాజాగా రాష్ట్రంలో పంట కోతలు మొదలైనా మళ్లీ అదే కథ పునరావృతమయ్యే ప్రమాద ఘంటికలు కనిపిస్తుండటం బాధాకరం. రైతన్న స్థితిని అలాగే సాగేలా చేస్తున్న తీరు ప్రస్తుత పాలకుల చేతగానితనమే తప్ప, మరేమీ కాదు.
మద్దతు అనే పదం వినడానికి ఎంత సొంపుగా ఉంటుందో గానీ, ఆచరణలో మాత్రం దానికి ఏ మాత్రం మద్దతు దొరకని దైన్యం. రికార్డుల్లో రాయడానికి, ప్రసంగాల్లో చెప్పుకోవడానికి, వాగ్దానాల్లో వినిపించడానికి తప్ప దాని ఊసే లేని దయనీయం. మ్యానిఫెస్టోల్లో తాటికాయంత అక్షరాలతో ‘మద్దతు’ను తీర్చిదిద్దిన నైపుణ్యం ముందు, దిగుబడి అమ్మే వేళ మాత్రం పొంతనలేనంత దూరంలో నిలుపుతున్న పాలకుల నేర్పరితనం ముందు అన్నీ దిగదుడుపే. ఎంతసేపు వీళ్లపై వాళ్లు.. వాళ్లపై వీళ్లు దుమ్మెత్తిపోసుకోవడం, తీరా సరుకు తీసుకునే యాళ్లకు నానా యాగీ చేసి అన్నదాత నుంచి అగ్గువకు తీసుకుని అంతా బతకనేర్చి, ఆయనను అతి సులువుగా నష్టపెట్టడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోతల సమయం ఆసన్నమైంది. మార్కెట్లకు మక్కలు, పత్తి చేరుకుంటుండగా.. కొద్ది రోజుల్లో వరి కోతలూ షురూ కానున్నాయి. అయినా ఏర్పాట్లు శూన్యంగానే ఉండటం బాధాకరం. తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దయనీయ దుస్థితి ఏనాడూ లేదు.
సత్తూ బతుకుతా సాగుచేసిన అన్నదాతకు ఈసారి కూడా మద్దతు విషయంలో షరామామూలే అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడపాదడపా నాయకుల ముచ్చట్లు.. సర్కార్ల ఆటలు చూస్తాంటే రైతు రందికే సచ్చే దుస్థితి దాపురించింది. వానలు బాగా పడి సాగు ఆగమాగమైన తరుణంలో కిందామీదపడి ఎలాగోలా నెట్టుకొచ్చారు రైతన్నలు. ఆయిటికి ముందే కాలం అయి పొతం గాని దుక్కులు, అప్పటికప్పుడు ఏగిరమేగిరంగా సాగు చేసిన అన్నదాతకు మొట్టమొదట్లనే చాలీచాలని విత్తనాల లొల్లి స్వాగతం పలికింది. పంట ఎదుగుతున్న వేళ ఎరువుల కోసం లొల్లి. అంతా సాధించి పంట చేతికందడానికి కొద్ది రోజులు ఉన్నదనగా అవసరమైన యూరియా కోసం మళ్లో తీవ్రమైన లొల్లి. ఇన్ని లొల్లుల నడుమ ఎవుసం కూసి కాకుండా కష్టపడ్డ కర్షకుడు ఎట్లనోతీరుగా పంట దిగుబడి తీశాడు. కనీసం ఇప్పుడు అమ్ముకొని అప్పులైనా కడ్దామనుకున్న తరుణంలో మద్దతు ధర ఎక్కిరిస్తుండగా, ప్రభుత్వాల ఉదాసీనత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
మక్క రైతుకు దిక్కుమొక్కు లేకుండా ఉన్నది. ఇప్పటికే మార్కెట్లకు పంట దిగుబడి తరలుతున్నది. సీజన్ ఎప్పుడు ప్రారంభమైతది?.. అప్పటి వరకు అన్నీ సిద్ధం చేసుకోవాలనే సోయి లేని యంత్రాంగం ఇంకా మొద్దునిద్ర వీడలేదు. లేదంటే ఇంత దౌర్భాగ్యం ఎట్ల దాపురిస్తది?
ఇగ పత్తి రైతుది మరో గోస. సెప్టెంబర్‌లోనే మార్కెట్‌కు కొత్త పత్తి చేరింది. పగబట్టిన కాలంలో కూడా తెల్లబంగారాన్ని ఒడిసిపట్టుకొని తరలించారు రైతులు. ఇప్పటికీ అటు సీసీఐ కొనుగోళ్లు మొదలుపెట్టక.. వానలకు తేమ శాతం తగ్గక.. ఇంట్లో పెట్టుకుని నల్లబడుతుంటే కాపాడలేక.. మరెక్కడా నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేయని పాలకులను ఏమీ అనలేక అగ్గువసగ్గువకు అమ్ముకొని మరింత అప్పుల్లోనే కూరుకుపోవడం ఆ ఒక్క పత్తి రైతుకే చెల్లుతుంది.
ఎడతెరిపి లేని వానలకు కుప్పలుపోసిన మక్కలు మొలకలొస్తున్న దయనీయంతో రైతులు పరేషాన్ అవుతున్నరు. అదీకాక మద్దతు ధర ఇంకా అందని ద్రాక్షగానే ఊరిస్తున్నది. మార్క్‌ఫెడ్ కేంద్రాలకు దిక్కులేదు. ‘అవ్వెప్పుడు వస్తయి సారూ..’ అని అడిగితే ‘గవర్నమెంట్‌కు అనుమతి కోసం పంపినం.. ఆదేశాలు రాగానే కేంద్రాలు పెట్టుడే’ అని పెద్దసార్లు సెలవిస్తున్నారు. పైగా ‘మేం అదే పనిలో ఉన్నా’మని చావుకబురు సల్లగా చెప్తూ చేతులు ముడుచుకున్న వాళ్ల తీరు అత్యద్భుతం.
సందట్లో సడేమియాలాగా ప్రైవేట్ వ్యాపారులు, దళారులు తమ పాచికలు విసురుతూ అందిన కాడికి క్యాష్ చేసుకుంటున్నారు. రైతును తామే కాపాడుతున్నట్టుగా; కష్టమైనా, నష్టమైనా తాము కొంటూ వారిని ఆదుకుంటున్నామన్నట్టుగా కలరిస్తూ నిండాముంచే పనిలో బిజీగా మారుతున్నారు. ఆ మాటకొస్తే ఆ దందాగాళ్లనూ తప్పుపట్టేది లేదు గానీ, రైతు కంటి గోస చూస్తే అనాల్సిన పరిస్థితి. ‘గవర్నమెంటోళ్లే కొంటే ఈ పరిస్థితి ఎందుకుంటదీ?’ అనే వారి వాదన కూడా సరైనదే కావొచ్చు గానీ, అంతా కలిసి ముంచుతున్నది ఆ అమాయకుడినే. పాపం.. అటు ప్రకృతి పగబట్టి.. ఇటు ప్రభుత్వాలు ఇబ్బందిపెట్టి.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారులు మూసుకుపోతాయేమో అన్న గందరగోళం.
‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అనో, లేదంటే తన గాచారం గింతే, తన తలరాత గంతే అనుకునో దళారని తెలిసినా.. అమ్ముకుని నెత్తికి చుట్టుకున్న తువాలతో కంటి నుంచి కారుతున్న నీటిని ఎవరికీ కనిపించకుండా తుడుచుకుంటున్నడు. వచ్చిన ఆ నాలుగు పైసలు ఏం చేయాలి..? మిగతా బాకీ మరెట్లా తీర్చేది భగవంతుడా..? అంటూ తన దారిన తాను మౌనంగా సాగుతున్న ఆ బక్కప్రాణి బతుకును పాలకులు పెంచుతున్నట్టా, తుంచుతున్నట్టా? సర్కార్ నిర్లక్ష్యంతో, మార్క్‌ఫెడ్ ఉదాసీనతతో ఇప్పటికిప్పుడు మక్క రైతుకు సాగు ఖర్చులేమో గానీ, ఎకరాకు కనీసంగా పదిహేను, పదహారు వేల నష్టం రావడం చూస్తే రైతన్న ఎంతటి గోతిలో ఉన్నాడో తెలుసుకోవచ్చు. మరి మక్కకు మద్దతు ఏమైనట్టు? మ్యానిఫెస్టోల్లో చేర్చిన ఆ పెద్దలు ఏం చేస్తున్నట్టు..?
ఇగ పత్తి రైతుది మరో గోస. సెప్టెంబర్‌లోనే మార్కెట్‌కు కొత్త పత్తి చేరింది. పగబట్టిన కాలంలో కూడా తెల్లబంగారాన్ని ఒడిసిపట్టుకొని తరలించారు రైతులు. ఇప్పటికీ అటు సీసీఐ కొనుగోళ్లు మొదలుపెట్టక.. వానలకు తేమ శాతం తగ్గక.. ఇంట్లో పెట్టుకుని నల్లబడుతుంటే కాపాడలేక.. మరెక్కడా నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేయని పాలకులను ఏమీ అనలేక అగ్గువసగ్గువకు అమ్ముకొని మరింత అప్పుల్లోనే కూరుకుపోవడం ఆ ఒక్క పత్తి రైతుకే చెల్లుతుంది. అందుకే ఎవరినీ ఏమీ అనలేక గత రెండేండ్లలో వందల సంఖ్యలో అదే పత్తి మందుకు తమను తాము అర్పించుకున్నవారి సంఖ్యే పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమకు అనుకూలంగా లేవని జిన్నింగ్ వాళ్లు, తేమ తాలూకు తకరాలు, దూది, గింజల గందరగోళం… మధ్య ఇక పత్తి రైతు పరిస్థితి ఆ ‘పచ్చపురుగు’కే తెలియాలి.
రేపోమాపో వరి కోతలు మొదలవబోతున్నాయి. కల్లాలు లేవు, మార్కెట్లో ఏర్పాట్లపై ఇప్పటికే సర్కార్ ఆదేశాలైతే ఇచ్చింది గానీ, ఎక్కడిదాకా వచ్చాయో ఆ వానదేవుడికే తెలియాలి. గతంలోనే కొనుగోళ్లు జరగక, మద్దతు ధర పలకక, రోడ్లపై రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబోసి రోజు పొద్దున్నే నేర్పుతూ, సాయంత్రం కుప్పచేస్తూ, వానెప్పుడొస్తదో, వడ్లెప్పుడు అమ్ముడుపోతయో అని వరదల్లో కొట్టుకుపోతున్న వడ్లను కుప్పలు చేసుకోలేక అన్నదాత ఆగమాగం అయ్యిండు. ఇప్పుడు మళ్లా తరుణం వచ్చింది.
ఓ వైపు ఇంకా వెనక్కి వెళ్లని వర్షాలు, మిల్లర్లతో సాగుతున్న అధికారుల మంతనాలు, కొందరు మిల్లర్లను కొన్ని సెక్షన్ల యంత్రాంగం రాచిరంపాన పెడ్తున్న తంతు, టార్గెట్లు, రవాణా, కానరాని కొనుగోలు కేంద్రాల తీరుతెన్నులు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో సమస్యలు. రాష్ట్రంలో పండే వడ్ల గింజలన్ని ఈ సమస్యల నడుమ కొనుగోళ్లు ఎలా సాగుతాయో, అన్నదాతలకు మద్దతు దక్కుతుందో, లేదో? రోడ్లపైనే నెలల తరబడి దిక్కుమొక్కు లేకుండా పడిగాపులు పడాల్సిన దయనీయం తప్పుతుందో, లేదో..? అనే సవాలక్ష సవాళ్లు స్వాగతం పలికే తరుణం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది.
రాజకీయం కోసం రైతును వాడుకోకుండా, పగవారిపై కోపం అన్నదాతపై తీయకుండా, అన్నం పెట్టే ఆ అమాయకపు జీవిని బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై తప్పకుండా ఉంటే తప్ప, అన్నదాత బుక్కెడు బువ్వ నిమ్మలంగా తినలేడనేది కాదనలేని సత్యం. సర్వేజన సుఖినోభవంతులో సర్వులూ ఉంటున్నారు గానీ, ఆ సాగుదారు ఉన్నాడో, లేదో తెలియడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు చూడాలో అని ముందుతరం అటువైపు మొహం చాటేయకుండా ఉత్సాహంగా సాగేలా చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపైనే ఉన్నది. మద్దతును అపహాస్యంగా కాకుండా, పద్ధతిగా కొనుగోళ్లు జరిగేలా చూడాల్సిన అవసరం పాలకులకు తప్పనిసరిగా ఉంది.
– రాజేంద్రప్రసాద్ చేలిక 99858 35601