ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారుకు మస్తు కోపమొస్తుందట! మీటింగ్‌లలో ఆయన మాటలను ఆఫీసర్లు అస్సలు పట్టించుకుంటలేరట. మొన్నామధ్య పట్నంలో అద్దగంట వానకే రోడ్లన్నీ చెరువులైనయి. ఎక్కడి జనం అక్కడే ఆగిపోయిన్రు. రోడ్ల మధ్యలోనే ఎవరికీ కనవడకుండా సీఎం తవ్వించిన అని చెప్పుకొంటున్న బావుల్లోకి కూడా నీళ్లు పోలేదేమో! జనాలకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఛీఛీ… ఇదేం అధ్వాన పాలన అని అనడంతో సీఎంకు సుర్రుమన్నట్టుంది. దీంతో ఆఫీసర్లతో మీటింగ్ వెట్టి నా మాటంటే ఇలువలేదా? నేనంటే లెక్కలేదా? ఇట్లయితే ఊకోను చెప్తున్నా… అంటూ ఆయనకొచ్చిన భాషలో ఏదో అన్నరట.
ఆఫీసర్ల మీదికి సీఎం మస్తు సీరియస్ అయిన్రు తెల్సా అని సర్కారోళ్లే మీడియాలో ఇచ్ఛంత్రాలు రాయించుకు న్నరు. గీ ముచ్చట బయటకు రాగానే అది ఎప్పట్లెక్కనే సీఎంకు బూమరాంగ్ అయింది. ప్రతిపక్ష పార్టీలోళ్లు సీఎంను గట్టిగనే అర్సుకున్నరు.అయ్యా.. సారు.. నువ్వు సీఎం సీటు మీద కూసొని రెండున్నరేండ్లయిపాయె.. అధికారులే నీ మాట ఇనకపోతే ఎట్లా అని మండిపడుతున్నరు. ఇదంతా అయ్యేది లేదు పొయ్యేది లేదు కానీ… అని ఫోన్లళ్ల పోరలు కారడ్డమాడుతున్నరు. ఇప్పటి సీఎం.. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఏమన్నరో యాదికుంది కదా. సీఎం అంటే గుంపు మేస్త్రి పాత్ర అని చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నరు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే బిల్డర్ లెక్క బిల్డప్ ఇచ్చుడు కాదు.. సీఎం అంటే జీఎం కాదు! అని జనాలు సురుకులు అంటిస్తున్నరు.

కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తుంటే అన్నం పెట్టకుండానే ఆకలి తీరుస్తాం.. పులి తోక పట్టుకొని పులిపాలు తాగిస్తాం అన్నట్టున్నది. రైతుభరోసా పైసల గురించి ఈ నడుమ వస్తున్న ముచ్చట్లు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక మన రైతన్నలు తలలు పట్టుకుంటున్రు. పోయిన యాసంగిల చూసినం కదా ఏప్రిల్ నెలాఖరు దాటనియ్యం, అందరి ఖాతాలల్లో రైతు భరోసా పైసలేస్తం అని గల్లా ఎగిరేసి సీఎమ్మే రెండు సార్లు ఊదరగొట్టిన్రు. విడతకో మీటింగ్ పెట్టి, మీటింగుకో ఎకరం చొప్పున పైసలు ఇచ్చినట్టు చేసిన్రు. రెండు విడతలు కలిపి రెండెకరాలకే పరిమితం చేసి మొత్తమ్మీద యాసంగి రైతుభరోసా మమ అనిపించిన్రు. మిగతా పైసలకు మంగళం పాడిన్రు. ఇప్పుడు వానకాలం పంటకు విత్తులు షురువైనయి.
కానీ రైతుభరోసా ముచ్చట అతీలేదు గతీలేదు. కాంగ్రెసోళ్లు అందరినీ ఊరిస్తున్నట్టే రైతులను కూడా ఊరిస్తున్రు. ఈ నెల 26న రైతులందరి అకౌంట్లలో పైసలు పడతాయని అనుకూల మీడియాలో చెప్పిస్తున్నరు. అధికారులు లేకుండానే మంత్రులంతా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని దీని గురించి మాట్లాడుకున్నరట. ఈ నెల 30న మధిరల సభ పెట్టాలని, ఆ మీటింగులో ఒక్క ఎకరా ఉన్నోళ్లకు నిధులు ఘనంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అబ్బో.. ఈ ముచ్చట తెల్సిన రైతన్నలు వాగు వచ్చినంత మాత్రాన వరద రాదు.. వీళ్లు సభలు పెట్టినంత మాత్రాన పైసలు రావు అంటూ ముక్కిరుస్తున్నరు. ఇది రైతుభరోసా కాదు, రైతుల ఎదురుచూపు పథకంగా మారిపోయినట్టే కనిపిస్తున్నదని జనం అంటున్నరు.

‘రోలు తే, రోకలి తే, రోలుకాడ నన్నెత్తేయ్’ అన్నట్టే ఉన్నది మంత్రుల ముచ్చట. ఓట్లప్పుడు ఆశల మూటలు నెత్తిన పెట్టుకొని ఊరూరా తిరిగిన్రు. ‘కేసీఆర్ కంటే ఒకటెక్కువ ఇస్తం, డబుల్ ఇస్తం’ అని అర్రాసు పాటలు పాడిన్రు. తీరా కుర్చీల కూసున్నాక చేతులెత్తేసిన్రు. కేంద్రంతో కేసీఆర్ సోపతి చేయలేదని, రాష్ర్టానికి నష్టం జరిగిందని అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెసోళ్లు వితండ వాదన చేసిన్రు. ఇదంతా కేవలం బురదజల్లే ముచ్చటనే. ఎందుకంటే, కేంద్రంతో కేసీఆర్ ఎప్పుడు ఎట్లా ఉండాల్నో అట్లనే ఉన్నరు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సమర్థించిన్రు. కానీ రైతుల మెడకు ఉరితాడు వేసే వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్తు సంస్కరణలను కచ్చితంగా నిలదీసిన్రు. ‘నా ప్రాణం పోయినా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోను’ అని తేల్చి చెప్పిన్రు.
కానీ, ఇప్పటి సీఎం, మంత్రుల ముచ్చట్లు విని రైతులు ముక్కున వేలేసుకుంటున్రు. కేంద్రం కొనుమంటేనే వడ్లు కొంటం.. ఎంతకు కొనుమంటే అంతకే కొంటం.. ఎన్ని కొనుమంటే అన్నే కొంటం అని మాట్లాడుతున్నరు. మరి ఏమయిపాయె గప్పాలు! రేపు కేంద్రం నూకలు తినుమంటే, నూకలే తింటరా సారూ? అని జనాలు ప్రశ్నిస్తున్రు. కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీకి గులాంగిరీల మునిగిపోగా, జనాలు మాత్రం ఒక్కటే మాట అంటున్నరు. ‘కేంద్రం చెప్పినట్టు మీరు ఇనుండ్రి.. ఎన్నికలు ఏవైనా మా మనసు చెప్పినట్టు మేం వింటం’ అని చెప్తున్నరు.

కేసీఆర్ పాలనలో ప్రతిష్ఠాత్మకంగా రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చిన్రు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఆ స్కీమ్ అటకెక్కింది. ప్రభుత్వం ప్రీమియం పైసలు కట్టకపోవడంతో నిరుడు ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో రూ.5 లక్షల చొప్పున 7611 మంది రైతుల కుటుంబాలకు బీమా పైసలను ఎల్ఐసీ ఆపేసింది. బీఆర్ఎస్ నేతలు నిలదీయడంతో సర్కార్ పెద్దలకు సురుకు తగిలి ప్రీమియం కట్టకతప్పలేదు. కానీ కింద పడ్డా తమదే పైచేయి అనుకొనే కాంగ్రెస్ పెద్దలకు జనంలో చిన్న మొఖమైంది. దీంతో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ రైతుబీమా తాము ఆపలేదని, కట్టినం కదా అని అంటున్నరు. కట్టిన్రు సరే.. ఎప్పుడు కట్టాల్సింది.. ఎప్పుడు కట్టిన్రు. ఎలా కట్టాల్సి వచ్చింది?
బీఆర్ఎస్ నిలదీసే వరకు కట్టాలని తెలియదు కానీ.. రోషం మాత్రం పొడుసుకొస్తున్నది మంత్రికి అని రైతులు అనుకుంటున్నరు. బీఆర్ఎస్ గిట్ల ప్రశ్నించకపోతే కాంగ్రెస్ సిపాయిలకు ప్రీమియం చెల్లించే మనసు వచ్చేదా అని ప్రశ్నిస్తున్నరు. మొత్తానికి పథకాల అమలులో కాంగ్రెస్ పిల్లిమొగ్గలు చూస్తుంటే ఏ పథకం ఎప్పుడు ఎత్తిపోతదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనం జరంత పైలంగానే ఉండాలె మరి!

పట్నంలో జాగలను ముగ్గురు నలుగురికి అమ్మే మోసగాళ్లను చూసినం… చూస్తున్నం. కానీ సర్కారే మంది భూమిని అమ్ముకొనే ‘రియల్ ఎస్టేట్ బ్రోకర్’ అవతారమెత్తినట్టు కనిపిస్తున్నది. కారణం ఏంటంటే హైదరాబాద్ రాయదుర్గంలో ప్రభుత్వం ఎప్పుడో ఎస్బీఐకి ఐదెకరాల భూమి అమ్మింది. ఇప్పుడు అదే భూమిని ‘అర్రాస్’ వేసి ఇంకొకరికి అమ్మిపారేసింది! బ్రోకర్లు మోసం చేస్తే ప్రజలు పోలీస్ స్టేషన్‌కో, కోర్టుకో పోతరు. మరి..ముఖ్యనేతలే ఇంతకు తెగిస్తే ఏది దారి?
ఇంకా గమ్మతేందంటే.. ‘మాకు అమ్మిన భూమిని వేరేటోళ్లకు ఎలా అమ్ముతారు.. ఇది అక్రమం’ అని సదరు ఎస్బీఐ వాళ్లు కోర్టుకు పోయిన్రు. దీంతో ముఖ్యనేతకు కోపమొచ్చిందట. ‘మీకు మేము అమ్మిన భూమిని, మళ్లీ మేమే వేరేటోళ్లకు అమ్ముకుంటే తప్పేంది? మా మీదనే కోర్టుకు పోతరా? ఎంత ధైర్యం మీకు! మీ బ్యాంకులోని మా ఖాతాలు క్లోజ్ చేసుకుంటం’ అనే ధోరణిలో బ్యాంకు వాళ్ల మీదనే ఎగిరి దుంకుతున్రట. ‘చేసిందే తప్పు పని.. ఇంక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బ్యాంకునే బ్లాక్మెయిల్ చేయడం ఏందో! ఇగ కాంగ్రెసోళ్ల పనితనం చూసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముసిముసిగా నవ్వుతున్నరు. మాది అమ్ముతాం.. మందిది కూడా అమ్ముతాం అంటే ఎట్లా సార్లూ..!
-ధాము నర్మాల