అన్నదాతల యోగక్షేమాల కోసం అహరహం తపించిన కేసీఆర్ పాలనలో బాగుపడిన సాగు నేడు తిరోగమిస్తున్నది. కయ్యాలమారి కాం గ్రెస్ పాలనలో సేతానం ఆగమాగమైతున్నది. పంటసాయం, రుణమాఫీ, జలసిరి, కొనుగోళ్ల దూకుడుతో వెలిగిపోయిన రైతుల పదేండ్ల ప్రాభవం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఒక్క ఏడాదిలోనే అడుగంటింది. సర్కారు చేయూత కానరాక, సాగు సరిగా సాగక సేద్యం విలవిలలాడుతున్నది. ధాన్యపు సిరులతో ధగధగలాడిన పంట పొలాలు మరు భూములుగా మారుతున్నాయి. కాంగ్రెస్ కల్లబొల్లి హామీలతో మోసపోయిన రైతు గోసపడుతున్నాడు.
అన్నివైపులా సమస్యలు చుట్టుముట్టడంతో అన్నదాత మనసు చెడి ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు. అన్నపూర్ణగా విశ్వవీధుల్లో వినతులందుకొన్న గడ్డ మీద రైతన్నల మృత్యుఘోష మిన్నంటుతున్నది. కాంగ్రెస్ 400 పైచిలుకు రోజుల పాలనలో రోజుకో రైతు బలవన్మరణానికి బలవుతున్నాడు. మరో ‘రైతు ఆత్మహత్య’ అనేది పత్రికల్లో నిత్యశీర్షిక లా మారింది. కాంగ్రెస్ మోసకారి పాలన అమల్లోకి వచ్చిన 2023 డిసెంబర్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఏడాది పాలన పూర్తయిన 2024 డిసెంబర్లో ఆ సంఖ్య 45కు పెరగడం దేన్ని సూచిస్తున్నది?
అసమర్థతతో, అనాదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల మరణానికి కారణమవుతున్నదనేది అక్షర సత్యం. డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి. దేవుళ్ల మీది ఒట్టును తీసి గట్టున పెట్టారు. కౌలు రైతు సాయం అతీ గతీ లేకుండాపోయింది. రుణమాఫీ దారుణ పరిహాసమైంది. అరకొరగా అమలుచేసి చేతులు దులిపేసుకున్నారు. రూ.2 లక్షల లోపు రుణాలమాఫీ పూర్తి చేసినట్టు సర్కారు గొప్పలు చెప్పుకున్నది. కానీ, ఆచరణలో 40 శాతం మందికి కూడా పూర్తికాకపోవడం కఠోర సత్యం. మరోవైపు భరోసా నయవంచనైంది. పెంచుతామన్న పంట సాయం పెంచకపోగా వానకాలం మొత్తానికే ఎగ్గొట్టడంతో రైతు రుణభారం కింద నలిగిపోయాడు. పగలతో, సెగలతో ప్రాజెక్టులను పండబెడితే కళకళలాడిన నీటవనరులు వెలవెలబోతున్నాయి. చెరువులు వట్టిపోయి భూగర్భ జలాలు లోలోతుల్లోకి జారిపోతున్నాయి. వీటన్నిటి ఫలితంగా నీళ్లందక పొలాల గొంతులెండుతున్నాయి. పంట కొనుగోళ్లలో జాప్యంతో పరిస్థితి మరింతగా దిగజారింది. బోనస్ బోగస్ అయ్యింది. అప్పులు కుప్పలయ్యాయి. ఆశలు అడుగంటాయి.
సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రైతు మరణమే మేలనుకునే స్థితికి చేరుకున్నాడు. ఇందుకు బాధ్యత వహించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన సర్కారు మాత్రం మొద్దు నిద్ర నటిస్తూ బుకాయింపులతో, అసత్య ప్రచారాలతో కాలయాపన చేస్తుండటం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ఆరుగాలం అరిగోస పడి పంటలు పండించి, ఆకలి తీర్చే రైతుల ఓపిక నశిస్తున్నది. అయితే ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావనేది రైతులు గుర్తెరగాలి. మాటతప్పిన సర్కారు మెడలు వంచాలి. హమీలను సాధించాలి. ఆత్మ బలిదానాలతో హృదయం లేని సర్కారులో పరివర్తన వస్తుందని ఆశించలేం. హామీల అమలుకు అడుగడుగునా నిలదీయడం, పోరాటం చేయడం ఒక్కటే మార్గం.