‘అ’ అనే అక్షరం వర్ణమాలికలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే మనుష్యులు చేయగలిగిన, చేసే అత్యాచారాలన్నీ ‘అ’ అక్షరంతోటి మొదలయ్యే పదాలలో వర్ణించవచ్చు. ‘అద్భుతం, అనిర్వచనీయం’ వంటి సకారాత్మక పదాలున్నా ‘అ/అన్’ అనే పూర్వ పోషితాలు (ఇంగ్లీషు పదం ప్రిపోజిషన్, సంస్కృతం నుంచే గ్రహింపబడినది) కొన్ని పదాలకు వ్యతిరేకార్థాలు ఇవ్వగలుగుతాయి. ‘అబద్ధాలు, అన్యాయాలు, అకృత్యాలు, అనర్థాలు, అక్రమాలు, అత్యాచారాలు, అభద్రత, అమంగళం, అరిష్టం, అవరోధం, అరాచకీ యం, అమానవీయం’ ఇంకా ఎన్నో నకారాత్మక పదాలు భాషలో ఉన్నాయి. అయితే, ఇవన్నీ కూడా ప్రోత్సహించే భయంకరమైన చర్యలకు ఆద్యమైన పదం ‘అనృతం’. అంటే అబద్ధం. పైన చెప్పిన నకారాత్మక పదాలకు సంబంధించిన ఆలోచనలు, ఆచరణలు చేసేవారందరూ ఈ అబద్ధపు ముసుగులోనే దాక్కుంటారు.
‘రుతం’ అంటే సత్యం. అందుకే వేద మంత్రాలను రుక్కులు అంటారు. దానికి నకారాత్మక ప్రిపోజిషన్ ‘అన్’ కలిపితే ‘అనృతం’ అవుతుంది. వేదాలు, సనాతన ధర్మం, హిందుత్వం అని పదే పదే వల్లించే బీజేపీకి అసలు ధర్మం అంటే తెలుసా? అధర్మ పాలనే ధ్యేయంగా ప్రవర్తిస్తున్న వారినుంచి ధర్మపాలన ఆశించగలమా? పొద్దున్నే వార్తాపత్రిక తెరిస్తే ఎవరో ఒక బీజేపీ నాయకుడు చేసిన అబద్ధపు ప్రచార ప్రయత్నం కనిపిస్తూనే ఉంటుంది. బీజేపీ కేంద్రంలో చేసే అకృత్యాల సాంద్రత పెరుగుతున్న కొద్దీ, ఈ రాష్ట్ర నాయకుల అబద్ధాల చిట్టాలు, వాటి సాంద్రత పెరుగుతూనే ఉంటాయి. కొత్తగా వచ్చిన గ్రోక్ నరేంద్ర మోదీ పాపాల చిట్టా విప్పుతుంటే, రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ కేసీఆర్‌కు దొంగనోట్ల ముద్రణాలయం ఉన్నదని ప్రకటించేశాడు.
అయితే, అతి సామాన్యుడికి కూడా వచ్చే సందేహం ఒకటి ఉంది. ‘దొంగనోట్ల ముద్రణాలయం’ అనే వసతి ఉన్నాక, వారే ఆరోపిస్తున్నట్టు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తిన్నాడనే నింద ఎందుకు మీదేసుకుంటాడు? రెండు లక్షల కోట్లు తనే ముద్రించుకోవచ్చు కదా? మహారాష్ట్రలో తమ దుష్ట రాజకీయ ఎత్తుగడ పారి షిండే అనే అనామకుడు లొంగినట్టే కవితపై కేసులతోనూ అటువంటి ప్రయత్నం చేసి బొక్క బోర్లాపడి మొహం పగులకొట్టుకున్న మోదీకి ఉద్యమ నాయకుడు, ప్రజాభిమానం చూరగొన్న కేసీఆర్ కొరుకుడు పడటం లేదు. ఉద్యమ విజయంతో ప్రజాభిమానమే కాక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అందరూ తమ ప్రతిభను చాటుకొని ప్రజాసేవ చేశారు. ఇది బీజేపీకి, మోదీ-షా ద్వయానికి మింగుడుపడని విషయం.
కుటుంబపాలన అన్న వివాదం లేపారు. మరి అమిత్ షా కొడుకు, రేవంత్ రెడ్డి సోదరులు చేసిన, చేస్తున్న పనులన్నీ న్యాయబద్ధమా, వారు కుటుంబీకులు కాదా? మనీయే మంత్రంగా చేసుకున్న కుబేరులైన అదానీ, అంబానీ మోదీకి కుటుంబసభ్యుల కంటే ఎక్కువ ఆత్మీయులు కదా! తప్పుడు తీర్పులు ఇచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కేంద్ర బీజేపీ నాయకులను కాపాడిన ఢిల్లీ అన్యాయమూర్తి దగ్గర పట్టుబడినవి ఎవరి ద్వారా వెళ్లిన ఎవరి సొమ్ము? ఈ మధ్యే పుణెలో జరిగిన ఒక యాక్సిడెంట్లో జడ్జి ఇచ్చిన తీర్పు అందరినీ షాక్‌కు గురిచేసింది.
చాలా ధనవంతుడైన ఒక వ్యాపారస్థుడి 17 సంవత్సరాల పుత్రరత్నం మోటార్‌సైకిల్ మీద వస్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగస్థులను తన కారుతో గుద్దితే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. కోర్టుదాకా వెళ్లిన ఈ కేసులో జడ్జి తీర్పు ఈ విధంగా ఉన్నది. ‘ఆ అబ్బాయి 300 పదాలతో యాక్సిడెంట్ మీద వ్యాసం రాయాలని, 15 రోజులు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలని, తాగి డ్రైవ్ చేసినందుకు అతనికి కౌన్సెలింగ్ చేయాలని’ ఆ తీర్పులో ఉన్నది. మూర్ఛపోకండి, వ్యాసం ఇంకా ఉంది. రూపాయి కూడా తన చేత్తో ముట్టుకోకుండా రాజకీయ వ్యవస్థలోనే కాకుండా న్యాయవ్యవస్థలో కూడా అవినీతిని పెంచిన అక్రమం బీజేపీ పాలకులది కాదా? ఇక ఈ పాపాలు లెక్కపెట్టి, బయటపెట్టే యమ ధర్మరాజు ఎలాన్‌మస్క్ చిత్రగుప్తుడి లాంటి గ్రోక్‌ను పంపి కేంద్ర బీజేపీ కూసాలను కదిలిస్తున్నాడు. అది తట్టుకోలేక ఇక ప్రతి రాష్ట్రంలో బీజేపీ నాయకులు తమ తమ బుర్రలకు పదును పెట్టి ఇతర పార్టీ నాయకులను అప్రతిష్ఠ పాలు చెయ్యాలని అవాకులు, చెవాకులు పేలుతున్నారు. ఒకవారం రోజులలో బండి సంజయ్ తన ఆరోపణకు రుజువులు చూపించకపోతే అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టాలి. ఇదీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
ఇక బడే భాయ్ నుంచి అబద్ధాల మంత్రాలు నేర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటికి తన అశ్లీల భాషతో మెరుగులు దిద్దుతున్నారు. సంప్రదాయకంగా ఉమ్మడి ఏపీలో జరిగినట్టు రైతుల, నేతన్నల ఆత్మహత్యలకు తోడు ఇప్పుడు ఆటోవాలాలు, మోసపోయిన నిరుద్యోగులు కూడా అదే బాట పడుతున్నారు. లీక్ చేసిన గ్రూపు పరీక్ష పేపర్ పేరుతో రచ్చ చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు 10వ తరగతి పరీక్ష పేపర్ లీకయితే కిమ్మనరు. బెట్టింగ్‌లో యువత, అత్యాచారాలలో ఆడవారు, నీళ్లు, కరెంటు లేక రైతులు, ఉపాధి తగ్గిపోయి నేతన్నలు, ఇట్లా వివిధ రంగాల వారు ఆత్మహత్యలకు పాల్పడితే, ప్రభుత్వం అస్తవ్యస్తంగా ప్రతిస్పందిస్తున్నది. ‘ఎండలకు పంటలు ఎండిపోయాయన్న’ అమాయకపు ముఖ్యమంత్రి మాటలు, ‘ఆదివారం కాబట్టి ఇంటర్నెట్ లేదన్న’ ఇంకో మంత్రి మాటలకు జనాలు నోట మాట రాక నిరుత్తరులయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండలు కాయలేదా, లేక రైతులందరు ఎండకాలంలో పొలాలు ఇంట్లో దాచుకున్నారా ఎండిపోకుండా? అలాగే మూడో క్లాసు పిల్లవాడిని అడిగినా ఆదివారం కూడా నెట్ కనెక్షన్ ఉంటుందని ఆ మంత్రికి తెలిసేది.
తమ అధికార బలంతో కేంద్ర ప్రభు త్వం, అబద్ధాలతో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతాయనుకుంటే అది జరుగదు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న సామెతకు తోడు ఇంకో నినాదం కూడా ఉంది. ‘రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి’ అని! రామాయణ, మహాభారత చరిత్రలు ఎందుకు చదువాలంటే, అందులో అధర్మానికి పాల్పడినవారి గతి ఏమైందో అర్థం చేసుకోవటానికి! మహా పండితుడు, మహా భక్తుడైన రావణాసురుడి దగ్గరి నుంచి అసూయాపరుడు, అకృత్యాలు చేసిన దుర్యోధనుడి దాకా ప్రతి పాపాత్ముడూ శిక్షింపబడ్డాడు.
ఏదో ఒకటి అనాలని ‘ఎండలకు పంటలెండాయి, వానలకు సామాన్యుల ఇళ్లు కూలాయి’ అని అర్థం పర్థం లేని మాటలూ, ఆరు గ్యారెంటీలు అమలైపోయాయన్న అబద్ధాలు చెల్లే రోజులు ఇక పోయాయి, మత విద్వేషాలు, కులాభిమానాలు రెచ్చగొట్టి ప్రజ ల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించటం ఇక చెల్లదు. అశ్లీల భాష వల్ల మాట్లాడినవారి నోరు మోరీ అవుతుంది కానీ, ఆ వాసన నిజాయితీపరుల చుట్టుపక్కలకు చేరదు. అధికారంతోనో, అబద్ధాలతోనో ఎల్లకాలం ఎవరూ రాజ్యం చేయలేరు. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం’- అంటే సత్యం కాని అనృతం – అంటే అబద్ధం కలకాలం ఉండదు. ‘సత్యు సాధుషు భవం సత్యం’ అంటే సత్యం సత్పురుషుల యందు పుట్టినది అని అర్థం. అదే ‘అబద్ధం అనేది అనర్థదాయకం, ఎవరినీ మెప్పించదు, నిందార్థకం, ఉచ్చరించకూడనిది. అది కలకాలం జీవించలేదు. అంతేకాదు, కాయ పండయి చెట్టు నుంచి రాలి మనిషి చేతిలోకి వచ్చినట్టు, ఈ రాజకీయ అవినీతి, అబద్ధాల అక్రమాలు పండి, రాజకీయరంగం నుంచి గెంటివేయబడి ప్రజలతో శిక్షింపబడతారు.
‘స్వకర్మ ఫ, అదబక్షణే’ అంటే ఎవరికి కర్మ ఫలాలు వారే ఒంటరిగా అనుభవిస్తారు’. అప్పుడు అదానీ, అంబానీ ఆదుకోలేరు, అన్నదమ్ముల రౌడీయిజం చెల్లదు. ఇప్పుడు బీజేపీ నాయకుల అబద్ధాల పాపం కూడా నాయకుడైన నరేంద్ర మోదీ పంచుకుంటాడు. ‘అయిదు ఊళ్ళు, అడగడానికి సిగ్గు లేదా, ఇస్తే ఆ ముష్టి తీసుకుంటారా’ అని ద్రౌపది కోపంగా తన భర్తలను నిలదీస్తున్నప్పుడు కృష్ణుడు ఆమెను ఓదారుస్తాడు. ‘యమ మహిష ఘంటికా నాదము విన తళుకొత్తెడు చిత్తముల్ గల కౌరవులు’ మంచి మాటలు వినరనీ, పాండవులకు భాగం ఇవ్వరనీ, వారి నాశనం దగ్గరలోనే ఉందని ఆయన అభిప్రాయం చెప్తాడు. అలాగే దుర్యోధనుడు వంశ నాశనం కోసం పుట్టినట్టు, నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ అంతానికి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాశనానికీ అవతరించారు. కనుక, ఆ పార్టీల విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరు, కురుక్షేత్ర యుద్ధాన్ని శ్రీకృష్ణుడు కూడా ఆపలేకపోయినట్టు!
రాజకీయ నాయకులు అసమర్థ పాలకులైనప్పుడు పరిస్థితులు చక్కదిద్దటానికి మేధావులు, సామాన్యులే కంకణం కట్టుకోవాలి.
-కనకదుర్గ దంటు ,89772 43484