బీజేపీ 2014 ఎన్నికల ముందు దేశ ప్రజలను ఎన్నో హామీలతో ఊరించింది. అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నవారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్ట బెడుతున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నవారు ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. బీజేపీని అధికారంలోంచి తొలగిస్తే కానీ ఈ దేశానికి పట్టిన పీడ విరగడ కాదని ప్రజలు గ్రహించాలి.
అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ మేక వన్నె పులి లాగా ప్రజల రక్త మాంసాలను పీలుస్తున్నది! పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను అగచాట్ల పాలు చేసింది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. చివరికి వందల మంది సామాన్యుల ప్రాణాలు బలి తీసుకున్నది. ఒక్క రూపాయి నల్ల ధనాన్ని స్వదేశానికి తీసుకురాలేని మోదీ సర్కారు, దేశాన్ని దోచుకుంటున్న బడా బాబుల నల్లధనాన్ని మాత్రం సక్రమ సంపాదనగా మారుస్తున్నది.
అధికారంలోకి వస్తే ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ఆర్భాటంగా చెప్పిన మోదీ సర్కారు ప్రజలతో బ్యాంకు ఖాతాలు తెరిపించింది. ఎనిమిదేండ్లు దాటినా అందులో ఒక్క పైసా పడలేదు! ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పినవారు, ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతున్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లాది మంది అసంఘటిత, సంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకుంటున్న విధానాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి.
ఈ దేశ స్వావలంబనకు కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా అమ్మాలనే ప్రయత్నాలను వేగంగా ముందుకు తెస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే రైల్వేలు, విమానయానం, టెలికాం, ఉక్కు, గనులు, బ్యాంకింగ్, ఎల్ఐసీ, ఓడరేవులు లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరుతో తనకిష్టమైన వాళ్లకు కట్టబెట్టాలని కిందా మీదా పడుతున్నది. బీఎస్ఎన్ఎల్లో లక్ష మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. బలమైన ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యపరిచి ప్రైవేటీకరణ మార్గాన్ని సుగమం చేసుకుంటున్నది. అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ విధిస్తూ ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అనే పరిస్థితి తీసుకు వచ్చింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, రైతులు, ఉద్యోగులు ప్రజల సంఘీభావంతో తీవ్రంగా పోరాడుతున్నారు.
కరోనా సమయంలో ప్రజల ఆర్థిక పరిస్థితి క్షీణించి పోగా, కుబేరుల సంపద అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ, అంబానీ లాంటి వాళ్ళు మొదటి పది స్థానాల్లో చేరిపోయారు. అదానీ ఆస్తి రూ.10,94,400 కోట్లు కాగా, ముఖేష్ అంబానీ ఆస్తి రూ.7,94,700 కోట్లు. 2022 సంవత్సరంలో 1100 మంది భారత కుబేరుల జాబితాలో స్థానం సంపాదించారు. వీరందరి మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లుగా ఐఐఎఫ్ఎల్ హురుల్ సర్వే వెల్లడించింది. వంద రూపాయల కూలి దొరకని పరిస్థితుల్లో సామాన్యుడు ఉంటే, కుబేరులు రోజుకు పదుల కోట్ల సంపద నార్జిస్తున్నారు. మరి మోదీ ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తున్నట్టు?
బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గత ఎనిమిదేండ్లలో ప్రజల హక్కులనే కాకుండా, రాష్ర్టాల హక్కులనూ హరిస్తున్నది. తన మాట వినని ప్రభుత్వాలను కూల దోస్తున్నది. కొన్నింటిని తమకు అనుకూలమైన ప్రభుత్వలుగా మార్చుకుంటున్నది. ఒక సర్వే ప్రకారం దేశంలో వివిధ రాష్ర్టాలలో 250 మంది శాసనసభ్యులను మోదీ ప్రభుత్వం అంగట్లో సరుకులుగా కొనుగోలు చేసే నీచమైన ఒరవడికి శ్రీకారం చుట్టింది! రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉన్న పన్నులు, వ్యవసాయ, విద్యుత్, పారిశ్రామిక, శాంతి భద్రతల అంశాలను కేంద్రం తన హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. స్వతంత్ర వ్యవస్థలైన ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను వంటి కీలకమైన వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని విపక్షాలపై దాడి చేస్తున్నది. న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నది. ప్రతిపక్షమన్నదే లేకుండా చేసే నిరంకుశ పోకడలు పోతున్నది. ప్రతిపక్షాలే ప్రజాస్వామ్యానికి రక్ష! ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఈ రెండు విషయాలను మరిచి వ్యవహరిస్తే ఎంతటి నియంతలకైనా పతనం తప్పదు.
– జూలకంటి రంగా రెడ్డి
(వ్యాసకర్త : సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు)