రాష్ట్రంలో కృష్ణా నది సుమారు 61 శాతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనే ప్రవహిస్తున్నది. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభీ నదులు. అపారమైన నీటి వనరులు. మరోవైపు రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన ఎర్ర, నల్లరేగడి నేలలు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేట్ 1935 నుంచే అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. 174 టీఎంసీలను ఒడిసి పట్టి, కేవలం గ్రావిటీతోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు చేసింది. అనుమతుల కోసం పొరుగునున్న అప్పటి మైసూర్, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. ఒప్పందాలు చేసుకున్నది. ప్రాజెక్టుల పనులకు నడుంకడుతున్న తరుణంలోనే విలీనం పేరిట ఊహించని వంచనకు గురైంది. వద్దని వారించినా, నదీజలాల్లో హక్కు కోల్పోతామని మొత్తుకున్నా వినకుండా తేనె పలుకులతో నాటి కాంగ్రెస్ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది. అది తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరుకు శాపంలా మారింది.
విలీనం వల్ల రాష్ట్ర ఉనికితోపాటు ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించే అవకాశాన్ని హైదరాబాద్ స్టేట్ కోల్పోయింది. ఉమ్మడి ఏపీలో వివక్షకు గురై ఉన్న పరీవాహకం మేరకు కూడా కేటాయింపులు లేక అల్లాడిపోయింది. విలీనం నాటి బాసలన్నీ నీటిమూటలయ్యాయి. హైదరాబాద్ స్టేట్ ప్రణాళికలన్నీ అటకెక్కాయి. కనీసం కాగితాలపైన సైతం లేకుండా కనుమరుగయ్యాయి. వారేమైనా కొత్తవి కట్టారా? అంటే అదీ లేదు. పైపెచ్చు మొత్తంగా కృష్ణానే చెరబట్టే కుట్రలను అమలు చేశారు సీమాంధ్ర పాలకులు. అదొక ‘ఒడువని ముచ్చట’. 60 ఏండ్ల పాలనలో చేసిన కుట్రలు.. తుంగలో తొక్కిన హామీలను మాటల్లో చెప్పలేం. ఇక నీళ్ల దోపిడీకి అంతే లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ దుర్భర దుస్థితిని చూసి బచావత్ ట్రిబ్యునలే చలించిపోయి జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు కేటాయించడమే కాదు, ఆ జలాలను అక్కడ మాత్రమే వినియోగించాలని ఉమ్మడి ఏపీ సర్కారుకు షరతులు పెట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. కృష్ణా ప్రధాన నదితో తుంగభద్ర, అటు తర్వాత భీమా నదులు రెండు కూడా వచ్చి ఆ ప్రాజెక్టు ఎగువన కలుస్తాయి. నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. అదీగాక శ్రీశైలం ప్రాజెక్టు 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాగా, దాదాపు 160 టీఎంసీలను వినియోగించుకునే అవకాశముంది. ఇది ఉమ్మడి పాలకులకు తెలియనిది కాదు. కానీ, తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించే ప్రాజెక్టులన్నింటినీ అసలే అనేక చిక్కుల్లో ఉండి, నీటిని నిల్వ చేయని స్థితిలో ఉన్న జూరాల కేంద్రంగానే ప్రతిపాదించారు. కల్వకుర్తి మినహా రాజీవ్ భీమా లిఫ్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు అన్నీ జూరాల నుంచే ప్రతిపాదించారు. కారణం ఒక్కటే తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదనే కుట్ర. అందుకే తెలంగాణ ఏర్పాటు నాటికీ ఆ ప్రాజెక్టులనూ పూర్తి చేయలె. మరొకవైపు కృష్ణమ్మ గట్టునున్న మన నోళ్లు కొట్టి వందల కిలోమీటర్ల దూరంలోని చెన్నై నగరవాసుల దూప తీర్చే మాటున శ్రీశైలం ప్రాజెక్టుకు పొక్క కొట్టారు. 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలమూరు జిల్లాకు చంద్రబాబును మించిన ద్రోహానికి తలపెట్టారు. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులను సెకండ్ ప్రయారిటీ జాబితాలో చేర్చి నిధులను కేటాయించలేదు.
పెన్నా బేసిన్‌లోని ఏపీ ప్రాజెక్టులను మొదటి ప్రయారిటీగా తీసుకుని నిధుల వరద పారించి పనులను పరుగులు పెట్టించారు. అనేక కుట్రలతో, అనైతికంగా ఏర్పాటైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్నీ 44 వేల క్యూసెక్కులకు పెంచారు. మళ్లీ అందులోనూ మరో కుట్ర. హెడ్‌రెగ్యులేటర్ కెపాసిటీని భవిష్యత్తులో 88 వేల క్యూసెక్కులకు పెంచుకునేందుకు అనువుగా కెనాల్ బెడ్ లెవల్‌ను ఆనాడే 32 మీటర్ల నుంచి ఏకంగా 78 మీటర్లకు పెంచడంతో పాటు, లైనింగ్ లేని కెనాల్‌ను ప్రతిపాదించారు. వీటికి అదనంగా హంద్రీనీవా, గాలేరు నగరి సుజల స్రవంతి, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్‌లను శ్రీశైలం ఆధారంగానే పెట్టి కృష్ణాను కొల్లగొట్టారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా బేసిన్లోనే ఉన్న మహబూబ్ నగర్లో నీటి నిల్వ సామర్థ్యం అన్ని ప్రాజెక్టులు కలిపి 20 టీఎంసీల కంటే తక్కువే. కానీ, నీటిలభ్యత లేని, కృష్ణా బేసిన్‌పైనే ఆధారపడిన పెన్నా బేసిన్లో మాత్రం నీటినిల్వ సామర్థ్యం 300 టీఎంసీలకు పైగానే అంటే నీటి దోపిడీ ఏ రీతిన కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. 1500 క్యూసెక్కులతో మొదలై మొత్తం కృష్ణా నదినే మళ్లించే స్థాయికి ఏపీ దోపిడీ కొనసాగిందనేందుకు ఇదే తార్కాణం.
ఉమ్మడి పాలకుల కుట్రలను, సాగిస్తున్న జలదోపిడీని నిలదీసింది కేసీఆరే. కృష్ణా జలాల్లో నీటి కోసం పాలమూరు బిడ్డల కోసం ఉద్యమించారు. జలసాధన ఉద్యమం చేపట్టి ఊరూరా ప్రజలను చైతన్యవంతులను చేశారు. అలుపెరగని పోరాటం సలిపారు. ఇక గతిలేని పరిస్థితుల్లో 2013లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాటి కాంగ్రెస్ సర్కార్ ఆమోదం తెలిపింది. అక్కడా మరో మెలిక. ఎప్పుడూ లేనివిధంగా ఆ ప్రాజెక్టు జీవోను కూడా సీజీజీ (సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్)తో వెట్టింగ్ చేయించాలని షరతు పెట్టి టెండర్ల ప్రక్రియను అడ్డుకుంది. ఉద్యమనేతగా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప పాలమూరుకు మోక్షం తప్పదని వివరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఉద్యమ హామీ మేరకు స్వరాష్ట్రంలో మొట్టమొదటగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
ప్రాజెక్టును పూర్తిగా రీడిజైన్ చేశారు. వరద జలాల ఆధారంగా ఉమ్మడి పాలకులు ప్రాజెక్టును ప్రతిపాదిస్తే దానికి 90 టీఎంసీల నికర జలాలు కేటాయించారు. ఆయకట్టును 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షలకు పెంచారు. ప్రాజెక్టు ప్రధాన పనులను పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను మాత్రమే తవ్వాల్సి ఉంది. అంతేకాదు మహబూబ్ నగర్లో నీటినిల్వ సామర్థ్యాన్ని ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే 67 టీఎంసీలకు పెంచారు. మరికొన్ని రిజర్వాయర్ల సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. చెరువులు, చెక్‌డ్యాముల నిర్మాణం, ప్రాజెక్టుల అనుసంధానం వంటి బహుముఖ వ్యూహాలను అమలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి చెరువుల కింద అదీ ముక్కుతూ మూలుగుతూ 2 లక్షల ఎకరాలకు మించి సాగు చేయలేని దుస్థితి నుంచి పాలమూరులో 12 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారు.
వలసలన్నీ వాపస్ వస్తున్న తరుణంలో మళ్లా కాంగ్రెస్ వచ్చింది. ‘పాలమూరు’ మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. 18 నెలలుగా ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు పండబెట్టింది. కాలువల టెండర్లు రద్దు చేసింది. పాలమూరుకు మరోమారు తీరని విద్రోహాన్ని కాంగ్రెస్ తలపెడుతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించిన ఏపీ ఇప్పుడు గోదావరినీ తరలించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. టెండర్లను పిలిచేందుకు సిద్ధమైంది. నిధులు సాయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు భరోసా ఇస్తున్నది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం చోద్యం చూస్తున్నది. 60 ఏండ్ల పాటు చేసిన ద్రోహాన్ని సరిదిద్దుకోకుండా మళ్లీ ఇప్పుడు అదే రీతిన ద్రోహాన్ని తలపెడుతున్నది. పొరుగు రాష్ర్టాన్ని చూసైనా ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని ఎత్తిపోసుకోవాలని, నిల్వ సామర్థ్యం పెంచుకోవాలనే సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నది. రాజకీయాలకు పాలమూరును పణంగా పెడుతున్నది. ఈ ప్రాంతంవాడే ద్రోహం తలపెట్టడం అత్యంత విషాదం. హస్తం పార్టీ తీరుతో పాలమూరుకే కాదు.. నల్లగొండ జిల్లా డిండికి, హైదరాబాద్ తాగునీటికి భవిష్యత్తులో ముప్పు వాటిల్లనున్నది.
పాలమూరు బిడ్డలుగా ఇప్పుడు మేం అడుగుతున్నదొక్కటే. పాలమూరు జిల్లా బిడ్డలు ఈ దేశ పౌరులు కారా? ఇక్కడ కరువు లేదా? తాగునీటి తండ్లాటలు వినిపిస్తలేవా? సాగునీరందక నోళ్లు తెరచిన బీళ్లు కండ్లపడుతలేవా? మాకెందుకివ్వరు నీళ్లు, నిధులు? ఎంతకాలమీ జలదోపిడీ? ఎందుకు మాకీ శిక్ష, మాపై వివక్ష? ఇక సహించేది లేదు. మౌనం వహించేది లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలె. ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించాలె. పాలమూరు పచ్చదనం కోసం కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలను అమలుచేయాలి.
ఇక పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో పెన్నా బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లించినట్లయితే కృష్ణాలో ఏపీ తన వాటా వదులుకోవాలి. పోతిరెడ్డిపాడును బంద్ పెట్టాలి. అక్రమంగా పెట్టిన లిఫ్ట్‌ను తొలగించాలె. ఆ జలాలను కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టులకు న్యాయబద్ధంగా కేటాయించాలి. లేదంటే జలహక్కుల రక్షణకు, సాధనకు కేసీఆర్ స్ఫూర్తితో నాడు రాయలసీమ ప్రాజెక్టును నిలువరించినట్లే బనకచర్లను అడ్డుకుంటాం. బరిగీసి కొట్లాడుతాం. ప్రాంతేతరుడైనా, ప్రాంతం వాడైనా సరే తరిమికొడుతాం. అందులో భాగంగానే కృష్ణాజలాల సాధనకు ఉద్యమనేత కేసీఆర్ గర్జించిన ఆర్డీఎస్ వేదికగానే జలహక్కుల రక్షణకు జంగ్ సైరన్ మోగిస్తున్నాం. పాలమూరు బిడ్డలు కదలిరావాలి. భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలె.
– గవినోళ్ల శ్రీనివాస్ 89198 96723