గడువు ముగిసిపోయి నిరాదరణకు గురవుతున్న గ్రామపంచాయతీలకు నూతన పాలక వ్యవస్థలు ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. మరో మూడు నెలల్లోపు ఎన్నికల తతంగం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ హైకోర్టు జారిచేసిన ఆదేశాలు అమలవుతాయా, లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 30 రోజుల్లోగా వార్డుల రిజర్వేషన్లు పూర్తి చేసి, సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇన్నాళ్లు సర్పంచులు లేక కుంటుపడిన గ్రామపాలన గాడిన పడుతుందా, లేదా అనేది ఎటూ తేలడం లేదు. స్థానిక ఎన్నికల చుట్టూ అనేక ప్రశ్నలు ముసురుకోవడమే అందుకు ప్రధాన కారణం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతో ఇన్నాళ్లు ఏదో ఒక సాకు చెప్పి కాంగ్రెస్ సర్కారు తప్పించుకు తిరిగింది. కానీ, ఇప్పుడు కోర్టు తీర్పును అమలు చేయాలా? సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలా? అని మల్లగుల్లాలు పడుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని అటుఇటు తిప్పి కాంగ్రెస్ గందరగోళంలో పడేసింది. తూతూమంత్రంగా చేసిన కులగణన ప్రామాణికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేరిస్తేనే బీసీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు దక్కుతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన రాగం ఎత్తుకోవడంతో దీనికి ఆమోదం లభించడం కష్టమే. అయితే, బీసీలకు ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో అమలైన 23 శాతానికి కూడా కాంగ్రెస్ సర్కారు ఎసరు పెట్టింది. బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన 42 శాతం నివేదిక చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. 23 శాతం దక్కాలన్నా ఆ మేరకు కొత్తగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. బూసాని కమిషన్ గడువు ముగియడంతో బీసీలకు రిజర్వేషన్లు దక్కడం ప్రశ్నార్థకంగా మారింది. జీవోలతో మొండిగా ముందుకెళ్తే అసలుకే ఎసరు తెచ్చిన గుజరాత్ ఉదాహరణ ఉండనే ఉన్నది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేకుండా గుజరాత్ ప్రభుత్వం ముందుకెళ్లడంతో బీసీ స్థానాలు కూడా జనరల్‌గా మారే ప్రమాదం ఏర్పడింది.
హామీలు అమలు చేయకపోవడం, కేసీఆర్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలూ నిలిచిపోవడంతో ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ పాలన మేలనే ధోరణి అంతకంతకూ మిన్నంటుతున్నది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే గులాబీ గుబాళిస్తుందనే మాటలు బలంగా వినపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు వాయిదా పడాలని చివరి దాకా కాంగ్రెస్ కోరుకునేలా చేసింది ఈ నేపథ్యమే. స్థానిక ఎన్నికలు జరిగితే ఎవరి బలం ఎంతనేది క్షేత్రస్థాయిలో తేలిపోతుంది. ఈ భయం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సమరమంటేనే జంకుతున్నారు. బరిలోకి దిగకముందే ఓటమిని ఒప్పుకొన్నట్టుగా సీఎం రేవంత్ స్థానికానికి దూరం పాటిస్తున్నారు. పార్టీ గెలుపు భారం మంత్రులదే అంటూ చేతులు దులిపేసుకోవడం ఎవరినీ ఆశ్చర్యపరచడం లేదు.