ప్రతి భాషలోనూ వివిధ స్థాయులు ఉంటాయి. మానవుడు పుట్టి, పెరుగుతున్నప్పుడు రకరకాల భాషా స్థాయుల ప్రభావానికి గురవుతాడు. సరిగ్గా పలకలేని స్థితిలో పిల్లలు తమ ముద్దు మాటలతో పెద్దవారిని మురిపిస్తారు. పెద్దయ్యాక కూడా ఎవరైనా కొన్ని అక్షరాలు పలకలేదనుకోండి, వారి భాష వలన వారే హేళనకు గురవుతారు. ‘క’ పలకలేని పెద్దవాడు కూడా ‘కోడి కొక్కొరకో’ అనమంటే ‘తోడి తొత్తొరోతో’ అంటాడు, వెక్కిరింతకు బలవుతాడు.
పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ కుటుంబంలోని ఇతర వ్యక్తులు మాట్లాడే భాషా స్థాయే వారికి అలవడుతుంది. విద్యాగంధం లేని కుటుంబాలలో సాధారణంగా చిన్న పిల్లలు ఇంటి బయట కూడా తమ స్థాయిలో ఉన్నవారితోనే కాలం గడుపుతారు. ఇంట్లో కూడా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులుంటే ఆ కింది స్థాయి భాషే వారికి స్థిరపడుతుంది. ఆ స్థాయి పెరిగి, భాషలోని అభ్యంతరకరమైన పదాలు, అసభ్యకరమైన భావాలు వేరు చేసి చూడాలంటే వారికి భాషా సంస్కారం ఉన్న మనుషులతో స్నేహం కానీ, పాఠశాలలో ఇతర విద్యార్థులను చూసి నేర్చుకునే చురుకుతనం ఉంటేనూ, పెద్దవుతున్న కొద్దీ సమాజంలో సంస్కారం ఉన్న సజ్జనులతో తిరగడం కానీ జరిగితే వారికి సంస్కారవంతమైన భాష పట్టుబడే అవకాశం ఉంటుంది. లేకపోతే యాభై ఏండ్లు దాటినా, గౌరవప్రదమైన పదవులు సంపాదించినా, కనిష్ఠస్థాయి భాషలోనే వారు మాట్లాడతారు.
ఈ రకంగా పెరిగే స్థాయులను బట్టి ఏ భాషలోనైనా నాలుగు రకాలు ఉంటాయి. 1. కేవలం తమ కుటుంబ భాష, తమ స్థాయిలో ఉన్నవారి భాష మాత్రమే మాట్లాడే వీరిది కిందిస్థాయిలో ఉండిపోయే దానిని ‘శ్లాంగ్’ అంటారు. ఇది తెలియనివారి ముందు, చాలామందిలో ఉన్నప్పుడు మాట్లాడకూడని స్థాయి, 2. కుటుంబంలో శ్లాంగ్ మాట్లాడేవారి పిల్లలు కూడా చాలామంది చదువు మొదలుపెట్టినప్పటి నుంచి, అభ్యంతరకర పదాలు, అసభ్య భావాలు కలిగించే పదాలు, ఉపాధ్యాయుల శిక్షణలో వదిలేసి చుట్టుపక్కల వారికి సిగ్గు, బాధ కలిగించని భాష నేర్చుకుంటారు. ఇంట్లో వారి భాషే వాడినా, బయటివారి దగ్గర కాస్తా మర్యాదగా మాట్లాడతారు. ఇది కొద్దిగా ఫార్మల్ – అంటే నియంత్రించబడిన భాష అవుతుంది, 3. చాలా కొద్ది మందికి చదువుతో పాటు భాష మీద పట్టు సాధించాలనే కోరిక కలిగి, ఆ పరిస్థితికి, చుట్టూ ఉన్న మనుషులకు సరిపోయే భాష వాడి సంస్కారవంతుడన్న ముద్ర సమాజంలో సంపాదిస్తారు. ఇది పూర్తిగా నియంత్రించబడిన ఫార్మల్ భాష. పైస్థాయికి చెందినది, 4. విశ్వవిద్యాలయస్థాయికి వెళ్లి పూర్తిగా సభలలో, సెమినార్లలో మాట్లాడవలసి వచ్చినప్పుడు సరైన పదాలు, క్లిష్టమైన వాక్యాలు, జాతీయాలు, సందర్భోచితంగా ఉపయోగించగలిగిన దానిని పాండిత్య భాష, ఎకడమిక్ భాష అంటారు. ఇది అన్నింటికంటే పైస్థాయిది. ఇన్ని స్థాయు ల్లో భాషను వాడవచ్చు అనికూడా చాలామందికి తెలియదు. అయితే భాష మనిషికి ఉన్న ఒకే ఒక ఆయుధం. జంతు ప్రదర్శనశాలలో కాక మనిషిని బయట ఉంచగలిగినది భాష ఒక్కటే! అదొక్కటే మనిషికి, మృగానికి ఉన్న తేడా!
నాగరిక ప్రపంచంలో నివసిస్తున్నామని అనుకుంటున్న మనం పదే పదే ఈ భాషా స్థాయుల్లో వ్యత్యాసాల వలన మనసులు ఎందుకు కష్టపెట్టుకుంటున్నాము? ఎందుకంటే భాషా సంస్కారం లేనివాళ్లు, అది అవసరం కూడా లేదనుకునే మూర్ఖులు ధనం ఉపయోగించి వివిధ రంగాలలో, ముఖ్యంగా రాజకీయాలలోకి వస్తున్నారు కనుక, నాయకులుగా ఉంటున్నారు కనుక.
తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పబ్లిక్‌లో మాట్లాడే భాషా స్థాయి గురించి ఒక జీవో తేవాలని ప్రకటించగానే, దానికి విపక్షాలు, సోకాల్డ్ మేధావులు స్పందించిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. వారు అన్నదేమిటంటే.. ‘ఎవరి గురించైనా, ము ఖ్యంగా గౌరవనీయ పదవుల్లో ఉన్నవారి గురించి, మాట్లాడేటప్పుడు భాషా స్థాయి కూడా గౌరవప్రదంగా ఉండాలనీ, నీచస్థాయి పదాలు వాడినా, ఆధారాలు లేకుం డా కువిమర్శలు చేసినా శిక్షలు విధించాలనీ అన్నారు. ఇందులో అభ్యంతరకరమైనదేమీ లేదు. అయితే విపక్షాలు- బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, జేఏసీ నాయకుడిగా ప్రభుత్వం చేసే ప్రతి పనినీ వక్రీకరించి విమర్శించే ప్రొఫెసర్ కోదండరాం, ఇతర మేధావులమని అనుకునేవాళ్లు చేసిన విమర్శలు, కామెంట్లు విచిత్రంగా ఉన్నాయి. భాష మంచిది వాడాలంటే విమర్శ చేయకూడదని అర్థమా? లేక తాము తమ అక్కసు వెళ్లగక్కడానికి కిందిస్థాయి భాష మాత్రమే బాగుంటుందని వారి అభిప్రాయమా?
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏదైనా, ఎట్లాగైనా మాట్లాడవచ్చని అర్థమా? గౌరవప్రదమైన భాషలో, వ్యక్తిగత దూషణలు లేకుండా విమర్శించే హక్కు ఉంటుంది కదా! డీమానిటైజేషన్, జీఎస్టీలాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు రాని కోపం గౌరవంగా మాట్లాడమంటే రావడం వింత కదా! త్రికరణ శుద్ధి అన్న పదం బహుశా వీరికి తెలియదేమో! అంటే భావం, మాట, ప్రవర్తన! మనిషి లోపలి భావాలు అతను చెప్తే కానీ ఎవరికీ తెలియవు. కొన్నాళ్లు పోతే కానీ ప్రవర్తన అర్థం కాదు. మనిషి మాట ఒక్కటే అతని వ్యక్తిత్వాన్ని వెంటనే ప్రతిబింబించేది. అతని సంస్కారం ఇతరులకు తెలిసేది భాష వలననే. ‘యూ ఆరే ఫూల్’ అన్నా ‘యూ ఆర్ నాట్ వెరీ వైజ్’ అన్నా అర్థం ఒక్కటే. కానీ ఫూల్ అనేది నకారాత్మక పదం, వైజ్ అన్నది సకారాత్మక పదం. రెండింటికీ ఎదుటివారి ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. ఒక భాషావేత్త అంటాడు ‘పాజిటివ్ లాంగ్వేజ్ గెట్స్ పాజిటివ్ రిజల్ట్స్, నెగటివ్ లాంగ్వేజ్ గెట్స్ నెగెటివ్ రిజల్ట్స్’ అని!
ఆ మధ్య అటువంటి ఒక మేధావే రాసిన ఒక పుస్తకం శీర్షికే దుమారం లేపింది. ‘కోమటోళ్లు-సామాజిక స్మగ్లర్స్’ అని దాని టైటిల్. దానికి బదులు ‘మోసపోయిన బహుజనులు’ అని పెట్టినట్టయితే ఎక్కువమంది చదివేవారు కదా ఆ పుస్తకం! భాష అనేది మనిషికి ఉన్న ఒకే ఒక వరం. మనిషి శరీరం, తెలివి పెరిగినట్టే భాషా స్థాయి కూడా పెంచుకుంటే సామాజిక గౌరవం, వ్యక్తిగత ఆదరం పెరగడమే కాకుండా వారు తమకంటే చిన్నవారికి ఆదర్శ పురుషులవుతారు.
అవమానం కూడా చాలా తెలివిగా చేయొచ్చు. ఒక సన్న సందులోంచి వెడుతున్న ఒక రచయితకు, లావుగా ఉండి అడ్డంగా నుంచున్న మనిషి ఎదురయ్యాడు. పైగా ‘పూల్స్‌కు నేను దారి ఇవ్వను’ అన్నాడు పరుషంగా, రచయిత పక్కకు జరిగి ‘నేను ఇస్తాను, మీరు వెళ్లవచ్చు’ అన్నాడు చిరునవ్వుతో. ‘కూరలో ఉప్పెక్కువైందా’ అని అడిగిన భార్యకు ‘లేదు, నేనే రెండు వంకాయలు తక్కువ తెచ్చాను’ అని చెప్పే తెలివైన భర్త ఎక్కువ సుఖపడతాడు కదా! ‘నాకీ చీర బాగుందా అడిగిన భార్యకి’, ‘నీకే చీరైనా బ్రహ్మాండమే, చీరకే అందం వస్తుంది’ అనే భర్త ఈ భాషా సంస్కారం లేని మేధావుల కంటే తెలివైన వాడు కదా! ఎప్పుడో చదువుకున్న పద్యాలలోంచైనా నీతి ప్రవర్తన నేర్చుకోవాలి కదా!
‘నొప్పింపక, తానొవ్వక’ మాట్లాడేవాడికి సమాజంలో అత్యంత గౌరవం ఉంటుంది. దీనికి పెద్ద తెలివి, ప్రజ్ఞ, మేధ అవసరం లేదు. మనిషిగా ఆత్మగౌరవం ఉంటే చాలు, ఎదుటివారికి గౌరవాన్నివ్వాలని సోయి ఉంటుంది. ఈ గౌరవం కేవలం భాష ద్వారానే వ్యక్తపరచగలం. ఇక భావ సంస్కారం కూడా లేనివారిని జన్మనిచ్చిన బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. వారికి తమ భావాలు, ఆలోచనలు, అభిప్రాయాలు తప్పని, వాటిని ఇతరుల ముందు అనకూడదనీ కూడా తెలియనంత అమాయకులు. ఇది గుర్తించటానికి వారికి ఇంకొన్ని జన్మలు పోవాలి.