Congress | ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారింది. తాము గెలవటంతో ప్రజలకు నిర్బంధాలు తొలగిపోయి స్వేచ్ఛ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారు. కానీ, తనవైపు నుంచి ఆయన అవే పాత అబద్ధాలు మళ్లీ మళ్లీ చెప్తూ, వాటిని ప్రజలు ఇప్పటికీ నమ్మేట్టు వారిని మేధో నిర్బంధం, లేదా బ్రెయిన్ కండిషనింగ్, థాట్ కంట్రోలింగ్ చేయజూస్తున్నారు. అటువంటి మేధో నిర్బంధంతో ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత, తమ హామీల అమలులో వైఫల్యాలు జరిగినా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు అవే అబద్ధాలతో మేధో నిర్బంధపు టెక్నిక్‌ను వారిపై కొనసాగిస్తున్నారు.
అబద్ధాలు ఏమిటన్న దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. అందులో కొన్ని సాక్షాత్తూ ఐదుగురు మంత్రుల సమక్షంలో గత శుక్రవారం నాడు, మీడియా సాక్షిగా బయటపడ్డాయి. అది జరిగింది మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వారు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు. ప్రాజెక్టు నిర్మాణంలో ఒక భాగం దెబ్బతినటం, అందుకు ఇంజినీరింగ్ లోపాలు కారణం కావటమన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. దానిపై ఒకవైపు దర్యాప్తులు, మరొకవైపు మరమ్మతులు అన్నవి జరగాల్సిందే. కానీ, దీనంతటిలో అవినీతి జరిగిందా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ముందుకువచ్చింది.
మళ్లీ ఈ ప్రశ్నలో మూడు ఉప ప్రశ్నలున్నాయి. ఒక ప్రాజెక్టుకు సహేతుకంగా కాగల ఖర్చును బాగా పెంచి చూపి ఆ అదనపు సొమ్మును కైంకర్యం చేయటం ఒక తరహా అవినీతి. ఇట్లా అంచనాలు పెంచటం గానీ, ఎస్టిమేట్-ప్రొక్యూర్-అండ్ కన్స్ట్రక్ట్ తరహా సరికొత్త విధానాలు తెచ్చి కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు నిర్మాణానికి ముందే భారీగా అడ్వాన్సులు ఇస్తూ అందులో కమీషన్లు తీసుకోవటం గానీ, తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఎంత విచ్చలవిడిగా జరిగేవో అందరికీ తెలిసిన విషయమే. ఈ తరహా అవినీతి ఏమైనా కాళేశ్వరంలో జరిగిందా అన్నది మొదటి ఉప ప్రశ్న. ఇది జరిగి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన న్యాయ విచారణ ముందు ఆధారాలు చూపి రుజువు చేసే అవకాశం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. నిజమని తేలితే బాధ్యులను శిక్షించాలి.
ఇక రెండో ఉప ప్రశ్న పైన అన్నట్టు ఖర్చు అంచనాలు, కమీషన్ల సంగతి ఎట్లున్నా యథాతథంగా నిర్మాణంలోనే ఏదైనా అవినీతి జరిగిందా అన్నది. అంచనాలు, కమీషన్లలో అవినీతి జరిగినా చివరికి ప్రాజెక్టు బాగానే ఉండవచ్చు కూడా. అట్లాంటివి అనేకం ఉన్నాయి. కనుక, మేడిగడ్డలో ఈ రెండో తరహా అవినీతి ఏమైనా జరిగిందా? పనులకు చార్జీలు మొత్తంగా వసూలు చేసినా పనులు నాసిరకంగా, ఉద్దేశపూర్వకంగా జరిగాయా? అన్నది రెండో ఉప ప్రశ్న. ఇది కూడా న్యాయ విచారణలో తేల్చవలసిన విషయం.
చివరి ఉప ప్రశ్న, కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టికి బదులు మేడిగడ్డ వద్దకు అనవసరంగా మార్చి నిధులను దుర్వినియోగం చేసిందా, వృథాగా వ్యయం చేసిందా? అనేది. అట్లా మార్చటంలోనూ అవినీతి ఉందంటే అనవచ్చు, ఆ విషయమూ న్యాయ విచారణకు పెట్టదలచుకుంటే పెట్టవచ్చు. అది కొత్త ప్రభుత్వపు స్వేచ్ఛ. కానీ, ఈ విధంగా ప్రాజెక్టు ప్రదేశాన్ని మార్చటమన్నది మౌలికంగా సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటిది. ఈ ప్రశ్నలన్నీ మున్ముందు ఎట్లా తేలుతాయన్నది చూద్దాం. అయితే తుమ్మిడిహట్టి సాంకేతికంగా సరైన ప్రదేశం కాదని మొన్న మంత్రుల ఎదుటనే ఇంజినీర్లు చెప్పటం గమనించాలి.
వాటినట్లుంచితే, కాంగ్రెస్ చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రచారాలలో కొన్ని అబద్ధాలైనట్టు ఈ పాటికే తేలిపోయిందన్నది ఇక్కడ గుర్తించాల్సిన తక్షణాంశం. ఆ మాట ఐదుగురు మంత్రుల సమక్షంలో, సాక్షాత్తూ కాళేశ్వరం సాక్షిగా, మీడియా సాక్షిగా, గత శుక్రవారం నాడు స్పష్టమైంది. అక్కడ మంత్రుల ఎదుటనే ఇంజినీర్లు చెప్పిందేమిటి? మొత్తం మూడు టీఎంసీల ప్రాజెక్టుకు కలిపి అంచనా వ్యయం రూ.1,27,872.28 కోట్లు. అందులో ఇప్పటికి జరిగిన ఖర్చు రూ.93,872.7 కోట్లు మాత్రమే. అటువంటప్పుడు రూ.93,872 కోట్ల ఖర్చులో, లక్ష కోట్ల అవినీతి ఎట్లా సాధ్యం? రాహుల్‌గాంధీ మొదలు, రేవంత్‌రెడ్డి నుంచి కాంగ్రెస్ నాయకులంతా, ఎన్నికల సమయం పొడవునా, రాత్రింబవళ్లు, హైదరాబాద్ నుంచి పల్లెటూరి వరకు, చేసిన ఆరోపణ ఇదే కదా? అదెట్లా సాధ్యమని కేసీఆర్ తదితర బీఆర్ఎస్ నేతలు గణాంకాలతో సహా ఎంత వివరించినా కాంగ్రెస్ తన గోబెల్స్ ప్రచారాన్ని మానుకోలేదు. దాని ప్రభావం ప్రజలపై కొంత పడింది. కాంగ్రెస్‌కు కలగాల్సిన లాభం కలిగింది. ఇప్పుడు ప్రభుత్వ ఇంజినీర్లే మంత్రుల సమక్షంలో చెప్పిందేమిటి? అందుకు తమ స్పందన ఏమిటో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చెప్పాలి.
ఎన్నికల తర్వాత అధికారానికి వచ్చినంక అయినా కాంగ్రెస్ ఈ ప్రచారం ఆపకపోవటం ఆశ్చర్యకరం. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అధికారిక లెక్కలు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అందుబాటులో ఉండేవే. అయినప్పటికీ ముఖ్యమంత్రి మొదలుకొని అందరూ వాటిని ఉపేక్షించి, అవే అబద్ధాలు ఇంకా చెప్తూ పోవటంలోని ఉద్దేశం ఏమనుకోవాలి? మరింత విపరీతం ఏమంటే ఈ శుక్రవారం నాడు మేడిగడ్డ వద్ద ఇంజినీర్లు వింటుండగా కూడా వారు తిరిగి అబద్ధాలాడారు. నిజాలు ఏమిటో ఇంజినీర్లు ప్రకటించిన తర్వాత సైతం తమను తాము సవరించుకోలేదు. ఇది అబద్ధాలకు పరాకాష్ఠ. ఇంత అలవోకగా అబద్ధాలాడుతూ, ఇంత అలవోకగా ఆరోపణలు చేసే పార్టీ, ప్రభుత్వ నేతల ఏ మాటలనైనా ప్రజలు విశ్వసించగలరా?
ఇటువంటి తీరునే కాళేశ్వరానికి సంబంధించిన మరొక రెండు అంశాలలో గమనించండి. అసలు ఆ ప్రాజెక్టే వృథా అని, దానికింద ఒక్కటంటే ఒక్క ఎకరానికైనా నీళ్లివ్వలేదన్నది కాంగ్రెస్ నేతలు మొదటినుంచి చేస్తున్న ప్రచారం. ఇందులో నిజమెంత? తిరిగి స్వయంగా ఇంజినీర్లు అదేచోట చెప్పిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు కొత్తగా 98,570 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇదిగాక కొన్ని లక్షల ఎకరాల స్థిరీకరణ ఇవే నీళ్ల వల్ల జరిగింది. అందువల్లనే పంటలు ఇంత సమృద్ధిగా పండుతున్నాయి. మరొక విషయం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చటాన్ని గురించి. నీటి లభ్యత, మహారాష్ట్ర అభ్యంతరాలు, కేంద్ర జల సంఘం సూచన, వ్యాప్కోస్ అధ్యయనాల దృష్ట్యా ఈ మార్పు తప్పనిసరి అయిందని లోగడనే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వివరణలను కాంగ్రెస్ వారు రాజకీయ కారణాలతో కొట్టివేశారు సరే. కానీ, ఇప్పుడు ఆ వివరణలు శుక్రవారం రోజున నేరుగా ఇంజినీర్ల నోటి నుంచి వచ్చినా పెడచెవిన పెట్టడం బాధ్యత గల వారు చేసే పనేనా? ఇదంతా నిజాయితీ గల పని అవుతుందా? పైగా, తిరిగి తుమ్మిడిహట్టి వద్దే నిర్మిస్తామని మళ్లీ వాదిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కూడా కేసీఆర్ అసలు ప్రయత్నించనే లేదని వారు మరొక వ్యాఖ్య చేయటం కూడా ఆశ్చర్యం కలిగించింది. కేసీఆర్ ప్రభుత్వం ఆ మేరకు పలుమార్లు కేంద్రాన్ని కోరటం గురించి గతంలో తరచూ వెలువడిన వార్తలు మనందరికీ గుర్తున్నాయి. ఇదంతా మంత్రులకు నిజంగానే తెలియదా? ఇప్పుడా విషయం అదే శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రకటిస్తూ, కేంద్రానికి కేసీఆర్ రాసిన లేఖల ప్రతులను కూడా చూపారు.
ఇది గమనించినప్పుడు, ప్రస్తుత జల వనరుల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి వెనుకటి ఉదంతం ఒకటి గుర్తుకొస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగపై తలపెట్టిన చనాఖా-కొరాట ప్రాజెక్టు చిరకాలంగా పెండింగులో ఉండేది. కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్రతో నీటి ఒప్పందం జరుగకపోగా కేసీఆర్ స్వయంగా ముంబై వెళ్లి అందుకు ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి సంతకాలు తీసుకున్నారు. ఆ వార్త వెలువడిందే తడవు ఇక్కడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తాము అధికారంలో ఉండగానే ఎప్పుడో ఒప్పందం చేసుకున్నామని గట్టిగా వాదించారు. కేసీఆర్ ముంబై నుంచి బేగంపేటలో దిగుతూనే తమ ఒప్పంద ప్రతిని పైకెత్తి చూపుతూ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గనుక వారి ఒప్పందం నిజమైతే దానిని తెచ్చి చూపితే తాను అటునుంచి అటే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేయగలనని సవాల్ విసిరారు. అందుకు ఉత్తమ్ నుంచి జవాబు లేదు. తర్వాత అయినా క్షమాపణ కాకున్నా, కనీసం ఉప సంహరణ లేదు. ఒప్పందం మాట నిజం కాదని కొద్దిరోజులకు జానారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖలో ఉత్తమ్ అధ్యక్షతన మరొక అబద్ధాల అధ్యాయం మొదలవుతున్నదనుకోవాలేమో.
నిజానికి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిండా నెల రోజులైనా పూర్తికాలేదు. మొదటి బడ్జెట్‌కు గానీ, వారు పెట్టుకున్న వందరోజుల గడువుకు గానీ, సాధారణంగా అందరం అనే హనీమూన్‌కు గానీ ఇంకా తగినంత సమయం ఉన్నది. అటువంటప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయటం తొందరపాటు అవుతుంది. ముఖ్యమంత్రికి గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం లేదు. పలువురు ఇతర మంత్రులకు కూడా. అందువల్ల వారంతా తగిన సమయం తీసుకొని బాధ్యతగా పాలిస్తూ, ఓపికగా, నేర్పుగా వ్యవహరిస్తూ విషయాలు తెలుసుకోవాలి. సంయమనం చూపి ప్రతిపక్షాలను కూడా కలుపుకొనిపోతూ వారి సహకారాన్ని పొందాలి. కానీ, జరుగుతున్నదేమిటి? వారి ప్రతి ఒక్క మాటా, చేతా కోరికోరి కొరివితో తల గోక్కున్నట్టే, ప్రతిపక్షాలను అబద్ధాలతో కావాలని రెచ్చగొడుతున్నట్టే సాగుతున్నది. కనుక వారు తగు పరిణతి చూపటం వారికే మంచిది. పరిపాలనకు, రాష్ర్టానికి కూడా.
కాంగ్రెస్ నేతలకు అబద్ధాల నాయకులు అని మాత్రమే కాదు, అధికారం కోసం అమలు చేయలేని హామీలిచ్చి, వాటిని అమలు చేయలేక అప్పులంటూ, శ్వేతపత్రాలంటూ తడబడుతున్నారనే మాట రావటం ఇప్పటికే మొదలైంది. ఉదాహరణకు నిరుద్యోగ భృతి రూ.4000 ఇవ్వగలమని మ్యానిఫెస్టోలో ప్రకటించి, తాము ఆ మాట అననే లేదంటూ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వాదించటం. దీన్నిబట్టి నిరుద్యోగులకు, ప్రజలకు కలుగుతున్న అభిప్రాయమేమిటి? ఇట్లా చెప్పాలంటే అనేకం ఉన్నాయి. అవి అందరూ ఎత్తి చూపుతున్నవే. రెండు హామీలను ఇప్పటికే అమలు చేశామన్న ప్రచారం మరొక అబద్ధం. మహాలక్ష్మి, చేయూత అనే రెండింటిలో మొత్తం ఐదు అంశాలు ఉండగా, రెండు మాత్రం అమలై ఇంకా మూడు మిగిలే ఉన్నాయి. అవి మున్ముందు అమలు కావచ్చుగాక. కానీ, ఇప్పటికే అయ్యాయన్న ప్రచారం ఇంకొక అబద్ధమవుతున్నది. లంకె బిందెలున్నాయనుకొని వస్తే ఖాళీ కుండలున్నాయన్న ముఖ్యమంత్రి వ్యాఖ్య మరొక వింత. అప్పులకుప్ప అని కొన్ని నెలల పాటు ప్రచారంతో హోరెత్తించినవారు, లంకెబిందెలు ఉంటాయని ఎట్లా అనుకున్నారు?
హామీల అమలులో తడబాట్లు, వైఫల్యాలు ఒక ఎత్తు. కానీ ప్రజలకు పదేపదే అబద్ధాలు చెప్పటం మరొక ఎత్తు. అది కూడా ఇన్నిన్ని అబద్ధాలు, ఇంత అలవోకగా, ఇన్నిన్ని సార్లు చెప్పటం. అధికారానికి వచ్చినంక కూడా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిభాషలో చెప్పాలంటే ఇదంతా తనకు గానీ, తన ప్రభుత్వానికి గానీ ‘శోభ’నివ్వదు. ‘శోభా నహీఁ దేతా’ అనేది వాస్తవానికి ఉత్తరాది ప్రయోగం. అది ఎంతో ఉదాత్తమైనది. మరి అటువంటి పరిభాషను ఉపయోగించే ఆయన అందుకు తగినట్టు మాట్లాడటం, వ్యవహరించటం ఉచితం కాబోదా? తనకు ఇతరత్రా లోగడ నుంచి కూడా ‘శోభ’ను ఇవ్వనివిధంగా మాట్లాడుతారని, వ్యవహరిస్తారనే పేరున్నది. ఫలితాలు వెలువడినంక ఒకచోట తను, ఇంకా అంతకుముందు వలె మాట్లాడాలని ఆశించవద్దంటూ సహచరులతో అనటం చూశాం కూడా. మరి ఆయన మారిన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనంతటికి మూల కారణం, అధికార ప్రయోజనాల కోసం ప్రజలకు అబద్ధాల ద్వారా మేధో నిర్బంధం, బ్రెయిన్ కండిషనింగ్ చేయాలన్న ప్రయత్నమే కాదా? ఇది ఒక ఎత్తుగడ. కానీ, బలహీనమైనది. ఎందుకంటే, ఇటువంటి ఎత్తుగడలు త్వరలోనే తేలిపోతాయి. తేలిపోతున్నట్టు కూడా కనిపిస్తున్నది.
-టంకశాల అశోక్