పాపం..! సర్కారోళ్లు ఏ పని పెట్టుకున్నా.. అది ఎదురు గొడుతున్నదట. కారు పార్టీ వాళ్లను ఇరుకునపెడదామని ఎన్ని ఉచ్చులు పన్నినా.. ఆఖరికి అవి హస్తం నేతల మెడకే సుట్టుకుంటున్నయట. ఈ మధ్య ఓ కాంగ్రెస్ నాయకుడు పొలిటికల్ బాంబులు.. ఆటం బాంబులు అనుకుంట చేతులనే పట్టుకొని తిరుగుతున్న విషయం ఎరుకే కదా! అటు దిరిగి ఇటు దిరిగి ఆ బాంబులు వాళ్ల సారు సీటు కిందనే పేలే మోపయ్యాయట. హస్తం గుర్తు కీలక నేత ఒకరు ఢిల్లీ పోయి ‘ఈనె ఉంటే ఇందిరమ్మ పెట్టిన పార్టీ ఆగమాగమయ్యే కాడికి వచ్చి’ందని ఫిర్యాదు చేసిండట. ‘మరేం జేద్దమంటవ్’ అని ఢిల్లీ పెద్దలు అడగగా.. ‘నాకు ఇయ్యండి. ఢిల్లీకి ఏం కావాలో నేనే చూసుకుంట’ అని అన్నడట. ఈ మాట పెద్దలకు కూడా బాగా నచ్చడంతో.. ‘టైం చూసి బొట్టుపెట్టి పిలుస్తం పో’ అని ఒట్టేసి చెప్పిండ్రట. అయినా ఆ కీలక నేత కదలకుండా అక్కడే నిలబడ్డడట. దాంతో ‘మా మాటే శాసనం. ఇక నువ్వే ముఖ్యనేతవు పో’ అని మరోసారి ఆన పెట్టిండ్రట. ఇక అప్పటి నుంచి కీలక సారు అనుచరులు ఆగుతలేరు. ‘మా సారు ముఖ్యమంత్రి అని పోస్టర్లు, బ్యానర్లు తయారు చేసి సోషల్ మీడియాల గింగిరాలు తిప్పిస్తున్నరు.
ఆ మంత్రక్క దంపతులతో ఎవరికి గండముందో తెలియక ఎమ్మెల్యేలు హడలిపోతున్నరట. ఆ మేడం, వాళ్ల సారు కలిసి ఏ నియోజకవర్గానికైనా టూర్‌కి వెళ్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేకు గండం పొంచినట్టేనట. వందలాది మంది కార్యకర్తలు జెండాలు పట్టుకొని ఎదురుబడి ‘జై కాంగ్రెస్, జైజై అక్క దంపతులు’ అంటే చాలు.. ఈ నియోజకవర్గం తమదేనని పుసుక్కున కూసేత్తరట వారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తున్నమని చెప్పేత్తరట. ఆ మధ్య ఓ పంచాయితీకి పోలీసు స్టేషన్‌కు పోయి ఎస్ఐ సారును లేపి మరీ కూసున్నది గదా..! గా.. మంత్రి దంపతులతోనే ఈ కిరికిరి అంత. పరకాల వెళ్లినప్పుడల్లా.. ‘వచ్చేసారి మా బిడ్డదే ఈ సీటు’ అని ఓ కూత కూసి వత్తున్నరట వారు. ఆ మాటకు మండిన స్థానిక ఎమ్మెల్యే, ఆ దంపతులు రోడ్డు మీద కొట్టుకున్న సంగతి ఎరుకే గదా. ఈ మధ్య పాలకుర్తికి వెళ్లిన దంపతుల్లో ఒకరు వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తనని కార్యకర్తలకు చెప్పిర్రట. ఈ మాట విన్న అక్కడి చెయ్యి పార్టీ ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలం అయిపోయిందట. భూపాలపల్లి పోయి ‘మా అల్లుడు వస్తడు’ అని అన్నరట. ఇట్లా ఎక్కడికి పోయినా.. ‘మాకు చెరొకటి, మా బిడ్డకు, మా అల్లునికి ఒక్కో నియోజకవర్గం’ అని పప్పు బెల్లం పంచినట్టు పంచుతుండటంతో విసుగెత్తిపోయిన ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిర్రట. ‘ముందుగా అక్క సీటు ఊడగొట్టి మమ్ముల నిమ్మళంగ ఉంచుర్రి’ అని మొరపెట్టుకున్నరట.
‘తన కిందికి కల్లు నీళ్లు తెచ్చే పనేదో చేస్తన్నడు’ అని ముఖ్యనేత అనుమాన పడిపోతున్నడట. కాంగ్రెస్‌ను నడిపించే పదవి వస్తదని ఆశపడి భంగపడ్డ నేత ఉన్నడు కదా. అగో ఆయన మీదనే మన ముఖ్యనేతకు శంక ఉన్నది. అసలే రాహుల్‌గాంధీకి దోస్తని పేరున్నది. కనపడకుండా ఏదో ఎర్తు పెట్టే పనిలో ఉన్నడని ముఖ్యనేత జంకుతున్నడట. తాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకున్ని కానీ, తనది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాల్సి వస్తోందని, ఈ మధ్య సీనియర్ నాయకుడొకరు రోడ్డు మీదికి వచ్చి నెత్తినోరు బాదుకున్నడుగా. అగో.. ఆ నాయకునితోని సదరు నేత జట్టు కట్టిండట. ఈ మధ్య ఎటుపోయినా ఇద్దరూ అతుక్కపోయి తిరుగుతున్నరట. ముచ్చట్లు పెడుతున్నరట. మున్షీ మేడమ్‌కు షికాతి చేసిండ్రట. వీళ్ల పోకడను చూసే ముఖ్యనేత తెగ ఇబ్బందితో ఉన్నడని జనం అనుకుంటున్నరు.
ఆ.. ఇద్దరు బ్రదర్స్‌కు చైనా బ్రదర్స్ అని పేరుంది. చైనా సరుకుకు తక్కువ ధరే కానీ ఎప్పుడూ సక్కగ పని చేయవు. వీళ్లు అంతేనటా. డబుల్ ఇంజిన్ లెక్క ఉండి అభివృద్ధి చేస్తరనుకుంటే చైనా ఇంజిన్ల లెక్క తయ్యారయిండ్రట వారు. వారిలో ఒకరు అమాత్య పదవిలో ఉండగా.. ఇంకోకరు ఆ మాత్రం పదవి నాకు రాదా? అని ఎదురుచూస్తున్నడట. వీళ్ల సంగతి పసిగట్టిన ముఖ్యనేత బర్రెకు ఎగేత్తన్నడట.. దూడెకు సగేత్తన్నడట. ఇక అప్పటి నుంచి అన్న మొహం తమ్ముడు, తమ్ముడి మొహం అన్న జూసుడు లేదట. అమాత్య కూటంలో ఇద్దరన్నదమ్ములు గుత్పలు పట్టుకునే కాడికి వచ్చింది. ‘ఇద్దరిద్దరు పంచాయితీల పడి మమ్ములను మర్సిపోతున్నరు’ అని అంటున్నరు నియోజకవర్గం ప్రజలు.