పక్క రాష్ట్రం ఆంధ్రాలో పోలింగ్ ముగిసింది మొదలు పోస్టల్ బ్యాలెట్లపై జరుగుతున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు. చివరకు రాజకీయ పార్టీలు కోర్టుల తలుపులు తట్టాయి. పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల గెజిటెడ్ అధికారి స్టాంప్ లేకపోవడం ఈ వివాదానికి ప్రధాన కారణం. తెలంగాణలో కూడా పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య తక్కువేం కాదు.
2.08 లక్షల వరకు ఉన్నట్టు అధికారిక సమాచారం. మరి ఇక్కడ గెజిటెడ్ అధికారుల సంతకాలు, స్టాంపులు ఉన్నాయా? లేవా? అన్నది ఏ పార్టీకీ పట్టడం లేదు. ఇదేదో తమకు సంబంధం లేని వ్యవహారంగా ఎన్నికల అధికారులెవరూ నోరు విప్పడం లేదు. ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కలలు కంటున్న కమలనాథులు సైతం నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం.
ఆడలేక మద్దెల ఓడు అన్నది పాత సామెత. చేతగాక.. చేతబడి అన్నది కొత్త సామెత. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీ కేరళ తాంత్రికులతో ‘రాజకంటకం’ పేరిట చేతబడి చేయిస్తున్నదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఆరోపణ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పరిపాలన చేతగాక.. చేతబడి చేశారంటూ అధికార కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసిందని అక్కడి ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ చేతబడి కర్ణాటకకే పరిమితం అవుతుందా? లేక తెలంగాణకు కూడా పాకుతుందా? అనేది చూడాలి.
రాష్ట్ర అవతరణ వేడుకలపై సచివాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీకి తమను ఎందుకు పిలువలేదని బీఆర్ఎస్, బీజేపీ అధికార పక్షాన్ని తప్పుబడుతున్నాయి. అయితే అసలు దాన్ని అఖిలపక్షం అని అన్నదెవరని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలనే ఆహ్వానించినట్టు ఆ నేత చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూటమిలో ఉందనే కారణంగానే సీపీఎంను ఆహ్వానించినట్టు చెప్పారు. అలాంటప్పుడు ఎంఐఎం పార్టీ కూడా కూటమిలో లేదు కదా? ఆ పార్టీని ఎలా పిలిచారని ప్రశ్నించగా.. అందుకే ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరుకాలేదని అన్నారు. ఇక్కడ కూడా ఆప్, సమాజ్వాదీ పార్టీలకు శాఖలు ఉన్నాయి. మరి తమనెందుకు పిలువలేదని అడిగితే ఏం చెబుతారో మరి?
‘మీ కంటే మేం దేంట్లోనూ తక్కువ కాదు. మీకు బూమ్ బూమ్ బీర్లు ఉంటే.. మాకు సోం‘బేర్లు’ ఉన్నాయి’ అని తెలంగాణ మద్యం ప్రియులు సంబురపడే రోజులు వచ్చాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చీప్ లిక్కర్ బ్రాండ్లు అమ్మడాన్ని ఎద్దేవా చేస్తూ, ఇప్పటిదాకా తెలంగాణ మందుబాబులు బూమ్ బూమ్ బీర్ బాటిళ్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే.. తాజాగా ఆంధ్రా మందుబాబులు ‘మీకు కూడా వచ్చాయి కదా ‘సోం‘బేర్’లు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణలో ఇటీవల సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కంపెనీ తమ బీర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ బీర్లు ‘సోం‘బేర్’గా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
– వెల్జాల